Sajjala : బల ప్రదర్శన, సమ్మెతో ఏం సాధిస్తారు? టీచర్లకు జగన్ ఎంతో చేశారు-సజ్జల

బల ప్రదర్శన చేయడం వల్ల సమస్య జటిలం అవుతుందని అన్నారు. ఇవాళ చేపట్టిన ప్రదర్శనతో, 6వ తేదీ అర్ధరాత్రి నుంచే పట్టే సమ్మెతో ఉద్యోగులు ఏం సాధిస్తారో అర్థం కావడం లేదన్నారు సజ్జల.

Sajjala : బల ప్రదర్శన, సమ్మెతో ఏం సాధిస్తారు? టీచర్లకు జగన్ ఎంతో చేశారు-సజ్జల

Sajjala Ramakrishna Reddy

Sajjala : ఏపీలో పీఆర్సీ వివాదం ముదురుతోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యోగులు ఆందోళనలు ఉధృతం చేశారు. తాజాగా పీఆర్సీ జీవోలను ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలన్న డిమాండ్ తో ఉద్యోగులు ‘ఛలో విజయవాడ’ కార్యక్రమం చేపట్టారు. దీనిపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్రంగా స్పందించారు.

పీఆర్సీని ఏ విధంగా రూపొందించారో ప్రభుత్వం వివరించిందని, ఉన్నంతలో మంచి ప్యాకేజీ ఇచ్చామని ఆయన తెలిపారు. ఉద్యోగులను రోజూ చర్చలకు పిలుస్తున్నా, స్పందన లేదని ఆరోపించారు. బల ప్రదర్శన చేయడం వల్ల సమస్య జటిలం అవుతుందని అన్నారు. ఇవాళ చేపట్టిన ప్రదర్శనతో, 6వ తేదీ అర్ధరాత్రి నుంచే పట్టే సమ్మెతో ఉద్యోగులు ఏం సాధిస్తారో అర్థం కావడం లేదన్నారు సజ్జల.

WhatsApp New Update : వాట్సాప్‌ మెసేజ్ డిలీట్ టైమ్ లిమిట్.. 2 రోజులకు పొడిగించే అవకాశం!

గత ప్రభుత్వంలోని లేని ఉద్యోగ భద్రతను తాము కల్పించామని సజ్జల అన్నారు. కరోనా వ్యాప్తి వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ విధంగా మారిందో అందరికీ తెలుసు అన్నారు. మరోపక్క సంక్షేమానికి కూడా నిధులు అవసరమైన పరిస్థితి తలెత్తిందన్నారు. కొవిడ్ కారణంగా ఏర్పడిన సంక్షోభం ఎప్పుడు ముగుస్తుందో తెలియదని, చర్చల సమయంలో ఉద్యోగులకు పరిస్థితి వివరించినా అర్థం చేసుకోలేదని సజ్జల విమర్శించారు.

కాగా, డిమాండ్ల పరిష్కారం కోసం ఉపాధ్యాయులు సీఎం జగన్ పై మాట్లాడుతున్న తీరు సరిగాలేదని సజ్జల రామకృష్ణారెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. వేలమంది ఉపాధ్యాయులకు పెద్దఎత్తున పదోన్నతులు కల్పిస్తున్న సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని హితవు పలికారు. టీచర్లకు ఏడెనిమిది విషయాల్లో తాము ఉపకారం చేశామని సజ్జల చెప్పారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాకే స్కూల్ అసిస్టెంట్లకు ప్రమోషన్లు వచ్చినట్టు ఉపాధ్యాయులే చెప్పారని వెల్లడించారు.

Maharashtra : కరోనా టీకాతో కూతురు చనిపోయింది.. రూ. 1000 కోట్లు ఇవ్వాలన్న తండ్రి

చలో విజయవాడ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నించినా… ఉద్యోగులు మాత్రం తగ్గలేదు. వేలాదిగా నగరానికి చేరుకున్న ఉద్యోగులు… చెప్పినట్టుగానే తమ నిరసన కార్యక్రమాన్ని ముగించారు. ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చకపోతే… ఈ నెల 6వ తేదీ అర్ధరాత్రి నుంచి సమ్మెలోకి వెళ్తామని తేల్చి చెప్పారు.

పీఆర్సీ జీవోలను ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలన్న డిమాండ్ తో చేపట్టిన ‘ఛలో విజయవాడ’ కార్యక్రమానికి ఉద్యోగులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారని పీఆర్సీ సాధన సమితి నేతలు తెలిపారు. ఛలో విజయవాడ కార్యక్రమం విజయవంతం చేసిన ఉద్యోగులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. తీవ్ర నిర్బంధాల మధ్య కూడా లక్ష మంది విజయవాడ వచ్చారని వెల్లడించారు. మరో 3 లక్షల మందిని ప్రభుత్వం అడ్డుకుందని ఆరోపించారు.

ఛలో విజయవాడ కార్యక్రమం చూశాక అయినా ఉద్యోగుల ఆందోళనలను ప్రభుత్వం గుర్తించాలని అన్నారు. ప్రభుత్వం దిగొచ్చేంత వరకు ఉద్యమం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. సీపీఎస్ రద్దయ్యేవరకు ఆందోళనలు కొనసాగుతాయని తెలిపారు. తాము ఛలో విజయవాడ కార్యక్రమం నిర్వహించింది బల ప్రదర్శన కోసం కాదని ఉద్యోగ సంఘాల నేతలు స్పష్టం చేశారు. ఉద్యోగుల వేదనను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడమే తమ ఉద్దేశమని తెలిపారు. ఈ నెల 5 నుంచి పెన్ డౌన్ ఉంటుందని, 6వ తేదీ అర్ధరాత్రి నుంచి పూర్తిగా సమ్మెలోకి వెళతామని వెల్లడించారు.