ఆన్‌లైన్‌ లో శ్రీవారి కళ్యాణోత్సవం, ఇంట్లోనే శ్రీవారి సేవలో భక్తులు. పోస్ట్‌లో ప్రసాదాలు, అక్షింతలు

  • Published By: madhu ,Published On : August 21, 2020 / 12:06 PM IST
ఆన్‌లైన్‌ లో శ్రీవారి కళ్యాణోత్సవం, ఇంట్లోనే శ్రీవారి సేవలో భక్తులు. పోస్ట్‌లో ప్రసాదాలు, అక్షింతలు

కరోనా కారణంగా శ్రీవారి దర్శనానికి, నిత్య కళ్యాణోత్సవ సేవకు భక్తులు ఇన్నాళ్లు దూరమయ్యారు. అయితే వీరికోసం టీటీడీ ఆన్‌లైన్‌ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. శ్రీవారి కళ్యాణోత్సవ సేవతో మరింత చేరువ చేసేలా ఆన్‌లైన్‌ సేవలు ప్రారంభించింది. దీంతో భక్తులు ఇంట్లోనే ఉంటూ శ్రీవారి కల్యాణోత్సవ సేవలో పాల్గొంటూ తరిస్తున్నారు.



TTD తీసుకొచ్చిన కార్యక్రమానికి భక్తుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. కరోనా కారణంగా శ్రీవారి సేవకు దూరమైన భక్తులు…. ఆన్‌లైన్‌లో కళ్యాణోత్సవం నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. దీంతో భక్తుల విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకున్న టీటీడీ ఈనెల నుంచి ఆన్‌లైన్‌లో శ్రీవారి కళ్యాణోత్సవాలకు శ్రీకారం చుట్టింది. 2020. ఆగస్టు ఈనెల 30 వరకు ఆన్‌లైన్‌లో టిక్కెట్లు బుక్ చేసుకోవాలని సూచించింది. దీంతో 3వేలమంది భక్తులు టిక్కెట్లు బుక్‌ చేశారు.

ఆన్‌లైన్‌లో శ్రీవారి కళ్యాణంలో పాల్గొనే భక్తుల గోత్రనామాలను అర్చకులు చదువుతుంటే భక్తి పారవశ్యంలో మునిగిపోతున్నారు. సాక్షాత్తు శ్రీవారి ఆలయంలో జరిగే నిత్య కళ్యాణోత్సవ సేవలో పాల్గొంటున్నట్లు..వారు అనుభూతి పొందుతున్నారు. ఆన్ లైన్‌లో టికెట్లు కొన్న భక్తులు తమ ఇళ్ల దగ్గరి నుంచే టీవీల ముందు కూర్చుని కళ్యాణోత్సవ సేవలో పాల్గొంటున్నారు. అనంతరం భక్తులకు ప్రసాదాలు, అక్షింతలను టీటీడీ పోస్టు ద్వారా పంపుతోంది.



ఆన్‌లైన్‌లో వెయ్యి ధర కలిగిన టికెట్టు కొనుగోలు చేసే వారు సంప్రదాయ దుస్తులు ధరించి, SVBC ద్వారా LIVEలో పాల్గొంటున్నారు. అనంతరం అర్చక స్వాముల సూచనల మేరకు గోత్రనామాలతో సంకల్పం చెప్పేలా ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో తొలిరోజైన ఈనెల ఏడో తేదీన 118 మంది భక్తులు పాల్గొంటే.. రెండో రోజు 496 మంది టికెట్లు కొనుగోలు చేశారు. ప్రతిరోజు 150 నుండి 200 మంది భక్తులు తమ ఇళ్లల్లో ఉంటూనే శ్రీవారి కళ్యాణంలో పాల్గొంటూ ఆశీసులు పొందుతున్నారు.