Strange Tradition : ఆ ఊరిలో వింత సంప్రదాయం..ఒకరికొకరు తాళి కట్టుకునే వధూవరులు

ఆ ఊరి రూటే సెపరేటు.. రెండేళ్లకు ఒకసారి వివాహాలు జరుగుతాయి. ఆ ఊరికి చెందిన అమ్మాయిలకు అబ్బాయిలకు వివాహాలు చేస్తారు. ఇతర గ్రామాల నుంచి అమ్మాయిలను..అబ్బాయిలతో వివాహాలు జరుపరు. పైగా వధూవరులు ఇద్దరూ ఒకరికొకరు తాళి కట్టుకుంటారు. ఇటువంటి వింత వివాహాలు మన ఆంధ్రప్రదేశ్ లో వందల ఏళ్లుగా జరుగుతున్నాయి.

Strange Tradition : ఆ ఊరిలో వింత సంప్రదాయం..ఒకరికొకరు తాళి కట్టుకునే వధూవరులు

Variety Weddings In Andhra Pradesh Nuvvala Revu Village (1)

Variety weddings In andhra pradesh village : ఆ ఊరి రూటే సెపరేటు.. ఏ ఊరికైనా.. ఆ ఊరి రూటు సెపరేటుగానే ఉంటుంది. ఇందులో వింతేముందనుకోవద్దు. విషయం రూటు గురించి కాదు. సంప్రదాయాల గురించి. వాటిని కాపాడుకోవడంలో.. ఆ గ్రామస్తులు వారికి వారే సాటి. తరాలు మారుతున్నా.. దశాబ్దాలు దాటుతున్నా.. ఇప్పటికా సామూహిక వివాహాల ఆచారాన్ని కొనసాగిస్తున్నారు. అంతేకాదు.. ఒకరికొకరు తాళి కట్టుకోవడం వారి వెరైటీ సంప్రదాయం. శ్రీకాకుళం జిల్లా.. నువ్వలరేవులో సామూహిక వివాహాల సందడి..

రోజులు గడుసున్నకొద్దీ.. క్యాలెండర్లు మారుతున్న కొద్దీ.. సంప్రదాయాలకు పక్కన బెట్టేస్తున్నాయ్ నేటి తరాలు. కానీ.. శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలంలోని మత్స్యకార గ్రామాల్లో నువ్వల రేవు కూడా ఒకటి. కానీ.. ఇక్కడ మిగతా చోట్ల ఉన్న పరిస్థితులుండవు. సంప్రదాయాలు, ఆచారాలంటే.. ఎనలేని గౌరవం. అందుకే.. ఏళ్లు గడుస్తున్నా.. సామూహిక వివాహాల సంప్రదాయాన్ని ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. రెండేళ్లకోసారి.. ఊరంతా పందిళ్లు వేసి.. వీధుల్లో.. విద్యుత్ వెలుగుల తోరణాలను కట్టి.. ఒకే ముహూర్తంలో.. ఎంతో వైభవంగా కొత్త జంటలు ఒక్కటవుతుంటాయ్.

నువ్వలరేవు గ్రామంలో.. సుమారు 2,500కు పైగా కుటుంబాలున్నాయి. 12 వేల జనాభా ఉంటుంది. శతాబ్దాల క్రితం ఒడిశా నుంచి వలసొచ్చిన కేవిటి కులస్తులు.. నువ్వలరేపు కేంద్రంగా నివాసం ఏర్పరచుకొని స్థిరపడ్డారు. అప్పటి నుంచే ఈ గ్రామానికి ఓ ప్రత్యేకత వచ్చింది. ఊరు ఊరంతా.. ఒకే మాట మీద ఉంటారు. గ్రామ పెద్ద ఏది చెబితే.. అంతా దానినే ఫాలో అవుతారు. ఈ ఊళ్లో.. బెహరా, బైనపల్లి, మువ్వల పేరుతో ఎక్కువ కుటుంబాలుంటాయ్. ఇక్కడ.. కేవిటీ సామాజికవర్గానికి పెద్దగా ఉన్న పెద్ద బెహరా, చిన్న బెహరా, బొల్లబాయ్ అని ముగ్గురు గ్రామపెద్దలుంటారు. వాళ్లు ఏది చెబితే.. అదే వేదం. సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారా వ్యవహారాల నుంచి.. రాజకీయాల దాకా అందరిదీ ఒకే మాట. ఒకే బాట.

ముఖ్యంగా.. పెళ్లిళ్ల విషయంలో.. పూర్వీకుల నుంచి వచ్చిన సంప్రదాయాన్ని.. ఇప్పటికీ కొనసాగిస్తున్నారు నువ్వలరేవు గ్రామస్తులు. రెండేళ్లకొకసారి పెద్దలు కుదిర్చిన ముహూర్తంలోనే.. గ్రామంలో పెళ్లీడుకొచ్చిన యువతీ, యువకులు ఒక్కటవుతుంటారు. ఈ గ్రామనికి చెందిన అమ్మాయిలకు.. అదే గ్రామానికి చెందిన అబ్బాయిలతో.. వివాహాలు జరిపించడం ఆనవాయితీగా వస్తోంది. ఇతర ప్రాంతాల్లోని అమ్మాయిలను, అబ్బాయిలను.. ఈ గ్రామ యువతీ, యువకులతో వివాహాలు జరిపించరు. ఇదంతా.. ఇంటి పెద్దల అంగీకారం, అమ్మాయి, అబ్బాయిల ఇష్యానుసారమే పెళ్లిళ్లు నిర్ణయిస్తుంటారు.

ఒకే ముహూర్తంలో.. అన్ని జంటలకు సామూహిక మాంగల్యధారణ కార్యక్రమం నిర్వహిస్తుంటారు. కేవిటీ సంప్రదాయం ప్రకారం.. రంగులు చల్లుకుంటూ ఊరేగింపుగా కులదేవత బృందావతి అమ్మవారి ఆలయానికి వెళ్తారు. అక్కడ కోనేరు నుంచి.. గ్రామపెద్దలు ఇచ్చిన నీటితో.. ఇంటి ముందు వెళ్లి పీట వేస్తారు. తర్వాత.. వధూవరులు ఆకు చెక్కలతో.. ఇంటింటికి వెళ్లి.. బంధువులు, స్నేహితులను పెళ్లికి ఆహ్వానిస్తారు. పెళ్లికి కూడా చాలా ప్రత్యేకంగా ముస్తాబవుతారు. కట్నకానుకలు లేకుండా.. కేవలం అత్తారింటి వారిచ్చిన బట్టలు, స్నేహితులు, బంధువులు ఇచ్చిన కరెన్సీ నోట్లను దండగా మెడలో వేసుకొని.. పెళ్లి పీటలపై కూర్చుంటారు. అంతేకాదు.. హిందూ వివాహ పద్ధతిలో.. వరుడు.. వధువు మెడలో తాళి కడతాడు. తర్వాత.. వధువు కూడా వరుడికి బంగారంతో తయారు చేసిన ఆభరణాన్ని తాళిగా కడుతుంది. కాకపోతే దీనిని.. దురుసం అనే పేరుతో పిలుస్తారు.

రెండేళ్లకోసారి జరిగే ఈ సామూహిక వివాహాల కోసం.. చిన్నా, పెద్దా అంతా కలిసి వస్తారు. ఉపాధి కోసం ఎక్కడెక్కడికో వలసెళ్లిన వాళ్లంతా.. గ్రామానికి చేరుకొని.. ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.

కొన్ని దశాబ్దాల క్రితం మొదలైన ఈ సంప్రదాయాన్ని కొనసాగించేందుకు.. కొత్త తరాలు కూడా సై అంటున్నాయ్. ఎన్ని జనరేషన్స్ మారినా.. తమ సంస్కృతి, సంప్రదాయాలను కొనసాగించడం ఆనందంగా ఉందని.. గ్రామస్తులు చెబుతున్నారు. ఈ సామూహిక వివాహాల సంప్రదాయాన్ని.. ఇక ముందు కుడా కొనసాగిస్తామని తెలిపారు.