Narayanaswamy Kalathuru : డిప్యూటీ సీఎంని నిలదీసిన కానిస్టేబుల్‌పై సస్పెన్షన్ వేటు
Narayanaswamy Kalathuru : కానిస్టేబుల్ యుగంధర్ కు ఉపముఖ్యమంత్రికి మధ్య వాగ్వాదం జరిగింది. ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి అనుచరులు కానిస్టేబుల్ ను అడ్డుకున్నారు.

Narayanaswamy Kalathuru (Photo : Google)
Deputy CM Narayanaswamy Kalathuru : చిత్తూరు జిల్లాలో ఏపీ డిప్యూటీ సీఎంని నిలదీసిన కానిస్టేబుల్ పై సస్పెన్షన్ వేటు పడింది. గంగాధర నెల్లూరు నియోజకవర్గంలోని కార్వేటి నగరం గుండ్రాజుపల్లి గ్రామానికి ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి వెళ్లారు. ఆ సమయంలో కానిస్టేబుల్ యుగంధర్ డిప్యూటీ సీఎంని అడ్డుకున్నారు.
రోడ్డు గురించి ఉపముఖ్యమంత్రిని నిలదీశారు. ఈ క్రమంలో కానిస్టేబుల్ యుగంధర్ కు ఉపముఖ్యమంత్రికి మధ్య వాగ్వాదం జరిగింది. ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి అనుచరులు కానిస్టేబుల్ ను అడ్డుకున్నారు.
Also Read..Jada Sravan Kumar: జగన్ వదిలిన బాణం షర్మిల పాదయాత్ర చేయలేదా? మేమూ చేసి తీరతామంతే..
ఈ వ్యవహారంపై పోలీసు ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. కానిస్టేబుల్ తీరుని తప్పుపట్టారు. ఉపముఖ్యమంత్రితో దురుసుగా ప్రవర్తించారన్న కారణంతో కానిస్టేబుల్ యుగంధర్ పై సస్పెన్షన్ వేటు వేశారు. అలాగే ఐపీసీ 153, 505 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
అసలేం జరిగిందంటే..
గడపగడపకు మన ప్రభుత్వంలో భాగంగా చిత్తూరు జిల్లా కార్వేటినగరం మండలంలోని గుండ్రాజుపల్లి గ్రామంలో గురువారం మంత్రి నారాయణ స్వామి పర్యటించారు. ఈ సందర్భంగా.. గ్రామానికి రోడ్డు నిర్మించాలని గ్రామస్తులు మంత్రిని కోరారు. ఈ విషయంలో ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి, ఏఆర్ కానిస్టేబుల్ యుగంధర్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
ఈ వివాదం తీవ్ర రూపం దాల్చింది. మంత్రి తీరుపై కానిస్టేబుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే అలర్ట్ అయిన స్థానిక పోలీసులు కానిస్టేబుల్‌ను పక్కకి తీసుకెళ్లారు. కాగా, ఏఆర్ కానిస్టేబుల్ తీరు పట్ల మంత్రి సీరియస్ అయ్యారు. తనను నిలదీయడంపై ఆగ్రహించిన ఆయన కానిస్టేబుల్‌పై తిరుపతి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు.
కానిస్టేబుల్ పై చర్యలు తీసుకోవాలన్నారు. కానిస్టేబుల్ యుగంధర్ తనను అవమానించారని మంత్రి ఆరోపిస్తుంటే, రోడ్డు నిర్మాణం కోసం నిలదీశానని తన తప్పేమీ లేదని కానిస్టేబుల్ చెబుతున్నారు. మొత్తంగా ఈ వ్యవహారం తీవ్ర దుమారం రేపింది. మంత్రి ఫిర్యాదుతో పోలీసు ఉన్నతాధికారులు స్పందించారు. కానిస్టేబుల్ యుగంధర్ పై సస్పెన్షన్ వేటు వేశారు. అలాగే కేసు కూడా నమోదు చేశారు.