Paddy Cultivation : వరి సాగులో సరికొత్త విప్లవం… సాంబ మసూరి వరివంగడం.

ఇదిలా వుంటే మరోవైపు అగ్గి తెగులు, దోమపోటు, ఎండాకు తెగులు కారణంగా క్రమేనా సాంబమసూరి సాగులో ఆసక్తి తగ్గుతుంది. ఎండాకు తెగులు మినహా ఇతర తెగుళ్ళకు పురుగు మందులు అందుబాటులోకి వచ్చాయి.

Paddy Cultivation : వరి సాగులో సరికొత్త విప్లవం… సాంబ మసూరి వరివంగడం.

Samba Masuri (3)

Paddy Cultivation : సన్న బియ్యం ఇచ్చే వరి వంగడాల్లో తెలుగు రాష్ట్రాల్లో బహుళ ప్రాచుర్యంలో ఉన్న రకం సాంబ మసూరీ… వినియోగదారులు ఎక్కవ గా ఇష్టపడటంతోపాటు, ఎగుమతుల్లో సైతం మొదటి స్ధానం ఆక్రమించి అంతర్జాతీయంగా గుర్తింపు పొందింది. వరి అన్నం దొరకటమే గగనమైన రోజుల్లో వ్యవసాయ శాస్త్రవేత్తల కృషి ఫలితంగా ఈ సాంబ మసూరీ రకం వరి వంగడాన్ని ఉత్పత్తి చేశారు. సాంప్రదాయ విత్తనాలకు భిన్నంగా అధిక దిగుబడులు ఇవ్వటం ఈ రకం వరి వంగడం స్పెషాలిటీ..

వరి ధాన్యాల ఉత్పత్తిలో చరిత్రలో ఇది నిలిచిపోయేదిగా చెప్పవచ్చు. ఈ వంగడం సృష్టికర్త అనంతపురం జిల్లా కదిరి మండలం ఎద్దులవారి పాలెం గ్రామానికి చెందిన డాక్టర్ మొరవపల్లి వెంకట రమణారెడ్డికాగ, గుంటూరు జిల్లా బాపట్ల వ్యవసాయ పరిశోధనా కేంద్రంలో వంగడం పూర్తిస్ధాయిలో రూపాంతరం చెందింది.

జీఈబీ 24, తైచుంగ్ నేటివ్ 1 వరి వంగడాలను సంకరపరిచారు. వీటి నుండి వచ్చిన రెండో సంతతిలో మంచి మొక్కలను ఎంపిక చేశారు. వాటిని మసూరి వంగడంతో సంకరం చేశారు. ఇలా వచ్చిన సంతతిని జెనెటిక్స్, ప్లాంట్ బ్రీడింగ్ పద్ధతిలో పరీక్షించి వాటిలో మేలైన వేలాది మొక్కల్ని మరో చేలో నాటి ప్రతి మొక్కకూ పరీక్ష జరిపారు. మేలుజాతిని ఎంపిక చేసి ఆ మొక్కలను మరో చేలో నాటి తుడి వంగడం రూపకల్పన చేశారు.

సాంబ మసూరి వరి వంగడాన్ని రూపొందించేందుకు శాస్త్రవేత్తలకు 8సంవత్సరాల కాలం పట్టింది. వరి వంగడం రూపకల్పనలో ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ మొరవపల్లి వెంకట రమణారెడ్డి కాగా, వ్యవసాయాధికారి బుచ్చయ్య చౌదరి నేతృత్వంలో ప్రొఫెసర్ నందేల శ్రీరామ్ రెడ్డి, ఎల్వీ సత్యనారాయణ, డాక్టర్ డి. సుబ్రహ్మణ్యం, ఎస్ఎస్డీవీ ప్రసాద్ లు నిరంతర కృషి ఉంది. 1986లో ఖరీఫ్ సీజన్ లో ఈ వరి వంగడాన్ని మార్కెట్లోకి విడుదల చేశారు. ప్రస్తుతం ఈ వరి వంగడం రైతులకు అందుబాటులోకి వచ్చి 35ఏళ్ళకాలం పూర్తయ్యింది.

నాణ్యత, దిగుబడి అధికంగా ఉండటంతో బీపీటీ 5204 సాంబమసూరి పేరు దేశస్ధాయిలో ప్రముఖంగా వినిపించింది. రైతులు సైతం దీనిని ఎక్కువ హెక్టార్లలో సాగు చేసేందుకు నేటికి ఆసక్తి చూపిస్తున్నారు. ఎకరానికి 35 నుండి 40 బస్తాల దిగుబడిని అందించటం ఈ రకం వరికి ఉన్న స్పెషాలిటీ. ఈ వంగడం రూపకల్పనతోనే అచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పేరు అంతర్జాతీయ స్ధాయిలో మార్మోగిపోయింది.

దేశ, విదేశాల్లో సాంబ మసూరికి మంచి గిరాకీ పెరగటంతోపాటు, ఎగుమతులకు మంచి అవకాశం ఏర్పడింది. భారత దేశానికి పెద్ద ఎత్తున విదేశి మారక ద్రవ్యం లబిస్తోంది. రైతులను ఆర్ధికంగా నిలదొక్కుకునేలా చేయటంతోపాటు, మార్కెట్ లో నేటికి మంచి ధరను వచ్చేలా చేస్తుంది సాంబ మసూరి రకం. దేశ ప్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఈ వరి వంగడం సాగుకు రైతులు ఆసక్తి చూపిస్తున్నారు.

ఇదిలా వుంటే మరోవైపు అగ్గి తెగులు, దోమపోటు, ఎండాకు తెగులు కారణంగా క్రమేనా సాంబమసూరి సాగులో ఆసక్తి తగ్గుతుంది. ఎండాకు తెగులు మినహా ఇతర తెగుళ్ళకు పురుగు మందులు అందుబాటులోకి వచ్చాయి. అయితే బాక్టీరియా వల్ల వచ్చే ఎండాకు తెగులుకు పరిష్కారం లేకపోవటంతో ఒక్కోసారి రైతులు పంట మొత్తం నష్టపోవాల్సి వస్తుంది. సన్నగింజ రకాల్లో ఈ గింజకు ప్రత్యామ్నాయంలేదు.

అయితే వ్యవసాయశాస్త్రవేత్తలు ఎండాకు తెగులు తట్టుకునేలా బయోటెక్నాలజీ అధారంగా ఎండాకు తెగులు తట్టుకునే జన్యువును ఈ రకంలోకి చొప్పించటం ద్వారా చక్కని ఫలితాలు సాధించారు. మెరుగుపరిచిన ఇంప్రూవ్డ్ సాంబమసూరి రకాన్ని అభివృద్ధి చేశారు. ఏపి, తెలంగాణా, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో రైతులు ఈ ఇంప్రూవ్డ్ సాంబమసూరిని సాగు చేస్తున్నారు. మసూరి రకాన్ని ఆ ప్రాంతాలను బట్టి వివిధ రకాల పేర్లతో పిలుస్తుంటారు. కర్నూలు సోనా, బాపట్ల మసూరి, బీపిటీ 5204, జీలకర్రి మసూరి, సీరగ పొన్ని వంటి పేర్లతో పిలుస్తున్నారు.