Solar Eclipse : రేపు సూర్యగ్రహణం.. తిరుమల శ్రీవారి ఆలయం, దుర్గగుడి, శ్రీశైలం సహా దేవాలయాలు మూసివేత

మంగళవారం (అక్టోబర్ 25) దేశంలో పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రధాన అలయాలన్నింటిని మూసివేయనున్నారు.

Solar Eclipse : రేపు సూర్యగ్రహణం.. తిరుమల శ్రీవారి ఆలయం, దుర్గగుడి, శ్రీశైలం సహా దేవాలయాలు మూసివేత

Solar Eclipse : మంగళవారం (అక్టోబర్ 25) దేశంలో పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రధాన అలయాలన్నింటిని మూసివేయనున్నారు. గ్రహణం కారణంగా తిరుమలలో శ్రీవారి ఆలయం మూసివేయనున్నారు. ఉదయం 8.11 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు ఆలయం మూసివేస్తారు.

ఈ సమయంలో అన్ని రకాల దర్శనాలు రద్దు చేశారు. లడ్డూ విక్రయం, అన్నప్రసాద వితరణ కూడా రద్దు చేశారు. రేపు దర్శనాలు లేనందున నేడు ఎలాంటి సిఫారసు లేఖలు స్వీకరించరు. గ్రహణ ఘడియలు ముగిసిన తర్వాత ఆలయం తలుపులు తిరిగి తెరవనున్నారు. ఆలయ శుద్ధి అనంతరం కేవలం సర్వదర్శనం భక్తులకు మాత్రమే దర్శనానికి అనుమతిస్తారు.

ఇంద్రకీలాద్రిపై దుర్గగుడి ఆలయం మూసివేస్తారు. కేతుగ్రస్త పాక్షిక సూర్యగ్రహణం కారణంగా అమ్మవారి ఆలయం మూసివేస్తారు. ప్రధానాలయంతో పాటు ఉపాలయాలు మూసివేయనున్నారు. రేపు ఉదయం 11 గంటలకు అమ్మవారికి సన్నపనాభిషేకలు, మహానివేదన, పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం ఆలయ ద్వారాలను మూసివేయనున్నారు అర్చకులు. తిరిగి మరుసటి రోజు అమ్మవారి ఆలయ ద్వారాలు తెరుచుకోనున్నాయి. మరుసటి రోజు 26వ తేదీన దేవతామూర్తులకు సన్నపనాభిషేకలు, మహానివేదన నిర్వహించి మధ్యాహ్నం 12 గంటలకు అమ్మవారి దర్శనానికి భక్తులను అనుమతిస్తారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

26వ తేదీన ఉదయం నిర్వహించే సుప్రభాత సేవ, ఖడ్గమాల అర్చన, గణపతి హోమం, నవగ్రహ శాంతి హోమం, రుద్ర హోమం, లక్ష కుంకుమార్చన, శ్రీ చక్రనవర్చన, చండీ హోమం, శాంతి కల్యాణం మొదలైన సేవలన్నీ రద్దు చేశారు. 26వ తేదీన ప్రదోషకాలంలో నిర్వహించే పంచ హారతులు, పల్లకీ సేవలు మాత్రమే భక్తులకు కల్పించనున్నారు దుర్గగుడి అధికారులు.

అటు శ్రీశైలం పుణ్యక్షేత్రం కూడా మూసివేయనున్నారు. ఉదయం 6 నుండి సాయంత్రం 6.30 వరకు ఆలయ ప్రధాన ద్వారాలు మూసి స్వామి అమ్మవార్ల సేవలు దర్శనాలు రద్దు చేసినట్లు ఈఓ లవన్న వెల్లడించారు. సాయంత్రం 6:30కి ఆలయశుద్ధి, సంప్రోక్షణ రాత్రి 8 గంటల నుండి భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు. రేపు ఉదయం ఆర్జిత సేవలు, శాశ్వత సేవలు, పరోక్ష సేవలు నిలిపేశారు. గ్రహణం కారణంగా శ్రీశైలంలో రేపు మధ్యాహ్నం భక్తులకు అన్నప్రసాద వితరణ రద్దు చేసినట్లు ఈవో లవన్న తెలిపారు. రాత్రి భక్తులకు అన్నదాన మందిరంలో అల్పాహారం అందించనున్నారు.

కాగా, ఈ పాక్షిక సూర్యగ్రహణం 27 ఏళ్ల తర్వాత ఏర్పడనుంది. 2025 లోనూ పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడనున్నా, అది భారత్ లో కనిపించదు. మళ్లీ భారత్ లో పాక్షిక సూర్యగ్రహణం వీక్షించాలంటే 2032 వరకు ఆగాల్సి ఉంటుంది. హైదరాబాద్ లో ఈ పాక్షిక సూర్యగ్రహణం సాయంత్రం 4.59 గంటలకు కనిపించనుంది.