Vishnu Kumar Raju టీడీపీ- జనసేన పొత్తుపై విష్ణుకుమార్‌రాజు హ్యాపీ.. ఆయన సంబరానికి కారణమేంటి?

టీడీపీతో పొత్తు ప్రకటనకు ముందు.. ఆ తర్వాత కూడా జనసేనాని పవన్‌కల్యాణ్ బీజీపీని కూటమిలో చేరమని ఆహ్వానిస్తుండటం విష్ణుకుమార్‌రాజుకు ఆనందానికి ప్రధాన కారణంగా చెబుతున్నారు.

Vishnu Kumar Raju టీడీపీ- జనసేన పొత్తుపై విష్ణుకుమార్‌రాజు హ్యాపీ.. ఆయన సంబరానికి కారణమేంటి?

Penmetsa Vishnu Kumar Raju

Penmetsa Vishnu Kumar Raju టీడీపీ-జనసేన పొత్తుపై ఎలా స్పందించాలో తెలియని అయోమయ పరిస్థితిని ఎదుర్కొంటోంది బీజేపీ.. కరవమంటే కప్పకు కోపం.. విడవమంటే పాముకు కోపం అన్నట్లు తయారైన ఆ పార్టీలో ఓ మాజీ ఎమ్మెల్యే మాత్రం తెగ హ్యాపీగా ఉన్నారట.. కొత్త కూటమిలో బీజేపీ చేరినా.. చేరకపోయినా తాను మాత్రం మళ్లీ శాసనసభలో అడుగు పెట్టడం ఖాయమని సంబరపడిపోతున్నారట ఆ మాజీ ఎమ్మెల్యే.. ఆయనలో ఆనందం చూస్తున్న సొంతం పార్టీ వారు సదరు నేతను ఎలా అర్థం చేసుకోవాలో తేల్చుకోలేక జుట్టు పీక్కుంటున్నారట.. ఇంతకీ ఎవరా నేత..? ఆయన సంబరానికి కారణమేంటి? తెరవెనుక ఏం జరుగుతోంది?

ఏపీ బీజేపీలో సీనియర్ నేత, విశాఖ ఉత్తర మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు. 2014లో ఎమ్మెల్యేగా ఎన్నికైన విష్ణుకుమార్‌రాజు 2019 ఎన్నికల్లో ఓడిపోయారు. నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉండి.. ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినా.. టీడీపీతో పొత్తు లేకపోవడంతో తాను 2019లో గెలవలేకపోయానని ఫీల్ అవుతున్నారు విష్ణుకుమార్‌రాజు. అంతేకాదు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు.. ఆ తర్వాత కూడా టీడీపీపై సానుకూల ధోరణి ప్రదర్శించిన విష్ణుకుమార్‌రాజు గతంలో అధిష్టానం ఆగ్రహానికి లోనైనా.. షోకాజ్ నోటీసులు అందుకున్నా ఎక్కడా వెనక్కు తగ్గలేదు. పార్టీ లైన్‌లో ఉన్నానంటూనే సందు దొరికినప్పుడల్లా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ప్రశంసలు కురిపించడమే కాకుండా.. బాబు అరెస్టు తర్వాత ఏ బీజేపీ నేతా స్పందించకపోయినా.. విష్ణుకుమార్‌రాజు మాత్రం తీవ్రంగా ఖండిస్తూ పెద్ద చర్చకు తెరలేపారు.

బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడైన విష్ణుకుమార్‌రాజు టీడీపీలో చేరతారని గతంలో ఎన్నో సార్లు ప్రచారం జరిగినా.. ఆర్‌ఎస్‌ఎస్ సానుభూతిపరుడైన ఆయన మాత్రం ఎప్పుడూ కమలం పార్టీలో కొనసాగేందుకే మొగ్గుచూపారు. కానీ, తాను మళ్లీ ఎమ్మెల్యే అవ్వాలంటే టీడీపీ మద్దతు అవసరం ఉండాలని బలంగా నమ్ముతున్న విష్ణుకుమార్‌రాజు ఇటీవల టీడీపీ-జనసేన పొత్తు తర్వాత తెగ ఆనంద పడిపోతున్నట్లు చెబుతున్నారు. విష్ణురాజు అంతలా హ్యాపీగా ఉండటానికి పొత్తు ఒక్కటే కాకుండా అనేక రకాల కారణాలను చెబుతున్నారు విశ్లేషకులు.

టీడీపీతో పొత్తు ప్రకటనకు ముందు.. ఆ తర్వాత కూడా జనసేనాని పవన్‌కల్యాణ్ బీజీపీని కూటమిలో చేరమని ఆహ్వానిస్తుండటం విష్ణుకుమార్‌రాజుకు ఆనందానికి ప్రధాన కారణంగా చెబుతున్నారు. రాష్ట్ర బీజేపీ పెద్దలు ఎలా స్పందించినా తన వరకు టీడీపీతో పొత్తుకు ఆయన సముఖంగా ఉన్నట్లు చెబుతున్నారు. లేదంటే ఆ రెండు పార్టీల మద్దతుతోనైనా ఈ సారి ఎన్నికల్లో పోటీకి రెడీ అవ్వాలని భావిస్తున్నారట విష్ణుకుమార్‌రాజు.

Also Read: బండారు సత్యనారాయణను వదిలిపెట్టను, సుప్రీంకోర్టు వరకైనా వెళ్తాను- మంత్రి రోజా

ప్రస్తుతం విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యేగా టీడీపీ సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గంటా ఒకసారి గెలిచిన చోట రెండోసారి పోటీ చేసే సంస్కృతి లేకపోవడంతో ఈ సారి కొత్త నియోజకవర్గానికి మారతారనే ప్రచారం జరుగుతోంది. టీడీపీలో ఎమ్మెల్యే స్థాయి నేతలు లేకపోవడంతో తనకు చాన్స్ వచ్చినట్లేనని భావిస్తున్నారట విష్ణుకుమార్‌రాజు.

Also Read: 99 శాతం హామీలు అమలు చేశాం, మన ప్రభుత్వం చేసిన అభివృద్ధే మనల్ని గెలిపిస్తుంది : సీఎం జగన్

మూడు పార్టీల మధ్య పొత్తు కుదిరితే బీజేపీ అభ్యర్థిగా లేదంటే.. టీడీపీ-జనసేన పార్టీల్లో ఏదో ఒక పార్టీ తరఫున పోటీ చేసి రెండోసారి విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యేగా శాసనసభలో అడుగుపెట్టాలని స్కెచ్ వేస్తున్నారు విష్ణుకుమార్‌రాజు. తొలి ప్రాధాన్యం బీజేపీకే ఇస్తున్నా.. టీడీపీతో పార్టీ పెద్దలకు ఉన్న వైరం కారణంగా పొత్తు కుదిరే పరిస్థితి లేకపోతే ప్రత్యామ్నాయానికే మొగ్గుచూపుతున్నారు విష్ణుకుమార్‌రాజు. మరి మాజీ ఎమ్మెల్యే ఆశలు ఫలిస్తాయో? లేదో? కాలమే చెప్పాలి.