ప్రజా సంకల్ప పాదయాత్రకు మూడేళ్లు, 10 రోజుల పాటు వైసీపీ చైతన్య కార్యక్రమాలు

  • Published By: madhu ,Published On : November 6, 2020 / 01:25 PM IST
ప్రజా సంకల్ప పాదయాత్రకు మూడేళ్లు, 10 రోజుల పాటు వైసీపీ చైతన్య కార్యక్రమాలు

3 Years of YS Jagan Padayatra : వైసీపీని అధికారంలోకి తెచ్చి.. జగన్ కోరికను నెరవేర్చింది ప్రజా సంకల్ప పాదయాత్ర.. 8 ఏళ్ల పార్టీ కలని నెరవేర్చిన పాదయాత్ర.. పార్టీ క్యాడర్‌లో ఫుల్ ఎనర్జీ నింపింది. అంతకు ముందు.. ఆ తరువాత అనేలా పార్టీ దశను మార్చేసిన జగన్ ప్రజా సంకల్ప యాత్రకు 2020, నవంబర్ 06వ తేదీ గురువారంతో మూడేళ్లు పూర్తయ్యాయి. మరి ఇలాంటి సందర్భంలో వైసీపీ చేస్తున్న సంబరాలేంటి.



చరిత్రలో నిలిచిపోయింది :-
ఏపీ రాజకీయాలకు పాదయాత్ర కొత్త కాకపోయినా.. జగన్ చేపట్టిన సుదీర్ఘ పాదయాత్ర మాత్రం చరిత్రలో నిలిచిపోయింది. పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉండగా మొదలు పెట్టిన ప్రజా సంకల్ప యాత్ర పార్టీని ప్రజల్లోకి దూసుకెళ్లేలా చేసింది. పాదయాత్ర వల్లే జగన్ సీఎం అవ్వగలిగారనేది రాజకీయ విశ్లేషకుల మాట. అలాంటి ఓ చరిత్రకు నేటికి మూడేళ్లు పూర్తయింది.



ఇడుపులపాయలో :-
2017 నవంబర్ 6 తేదీన ఇడుపులపాయలో ప్రజా సంకల్ప యాత్రని ప్రారంభించారు జగన్. కడప జిల్లాలోని ఇడుపులపాయ నుంచి శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురం వరకూ మొత్తం 13 జిల్లాలను టచ్ చేస్తూ 134 నియోజవర్గాల్లో 341 రోజుల పాటు 3 వేల 648 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. 2 వేల 516 గ్రామాల్లో జగన్ పాదయాత్ర సాగింది. మొత్తం 124 బహిరంగ సభలు, 55 ఆత్మీయ సమవేశాలతో పాదయాత్రను పూర్తి చేశారు జగన్.



చైతన్య కార్యక్రమాలు :-
జగన్ పాదయాత్రకు మూడేళ్లు పూర్తయిన నేపథ్యంలో.. పది రోజుల పాటు చైతన్య కార్యక్రమాలకు పిలుపునిచ్చింది వైసీపీ అధిష్టానం. పాదయాత్రలో ఇచ్చిన హామీలను దాదాపు 90 శాతానికి పైగా నెరవేర్చామంటున్న వైసీపీ నేతలు.. ఈ పది రోజులు వాటిపై ప్రజలకి వివరించనున్నారు.



ఇంకా సమస్యలున్నాయా ? :-
ఈ 10 రోజులు ప్రభుత్వ పథకాలపై ప్రజల అభిప్రాయాన్ని సేకరించి.. మరేమైనా సమస్యలున్నాయా.? అనే అంశాలను ఈ కార్యక్రమాల ద్వారా తెలుసుకోబోతున్నారు. మొత్తానికి ఈ పది రోజులు ప్రతీ గ్రామ స్థాయి నుండి పార్టీ క్యాడర్ ఫుల్ యాక్టీవ్‌గా ఉండేలా ప్రణాళిక సిద్ధం చేసింది వైసీపీ. కార్యక్రమాలు నిర్వహించేలా ఎమ్మెల్యేలు. పార్టీ ఇంచార్జ్ లకి బాధ్యతలు అప్పగించారు.