TDP: సీట్ల పెంపు లేనట్లే.. టీడీపీకి 2029 ఎన్నికలు సవాలేనా..!?

దీంతో ఇప్పటినుంచే ప్రత్యామ్నాయం ఆలోచించడం..సాధ్యమైనంత వరకు లీడర్లకు టికెట్‌పై క్లారిటీ ఇవ్వడం వంటివి టీడీపీ అధిష్టానం మదిలో ఉన్న అస్త్రాలుగా చెబుతున్నారు.

TDP: సీట్ల పెంపు లేనట్లే.. టీడీపీకి 2029 ఎన్నికలు సవాలేనా..!?

Updated On : December 13, 2025 / 8:06 PM IST

TDP: ఏపీలో ఎన్నికలకు ఇంకా మూడేళ్ల టైముంది. కానీ ఇప్పటినుంచే కొన్ని నియోజకవర్గాల్లో టికెట్ రేసు రచ్చకెక్కుతోంది. మరీ ముఖ్యంగా టీడీపీలో టికెట్ ఫైట్ మామూలుగా లేదు. గత ఎన్నికల్లోనే దాదాపు 50 మంది నేతలు టికెట్ త్యాగం చేయాల్సి వచ్చింది. ఇందులో 20 మంది వరకు సీనియర్ లీడర్లు పార్టీ గెలుపు కోసం..పొత్తుల్లో సీటును వదులుకోవాల్సి వచ్చింది.

మరికొన్ని చోట్ల యువనేతలకు నామినేటెడ్ పోస్టుల హామీ ఇచ్చి టికెట్ రేస్ నుంచి తప్పించారు. ఇంకొందరు వచ్చే ఎన్నికల నాటికి అసెంబ్లీ సీట్ల సంఖ్య పెరుగుతుందని..అప్పుడు కచ్చితంగా టికెట్ ఇస్తామని హామీ ఇచ్చారు. కట్ చేస్తే అసెంబ్లీ సీట్ల పెంపుపైన స్పష్టత వచ్చింది. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం ఏపీలో 50, తెలంగాణలో 34 అసెంబ్లీ సీట్లు పెరగాల్సి ఉంది. ఒక్కో పార్లమెంట్ స్థానం పరిధిలో రెండు అసెంబ్లీ సీట్లు పెరగాలి. కానీ 2029 ఎన్నికల్లోపే అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన పూర్తి కాదని కేంద్రం క్లారిటీ ఇచ్చింది.

Also Read: హైదరాబాద్‌లో మెస్సీ సందడి.. ఫలక్‌నుమా ప్యాలెస్‌లో మీట్‌ అండ్‌ గ్రీట్‌లో పాల్గొన్న ఫుట్‌బాల్ దిగ్గజం

అయితే 2026లో జనగణన చేపడుతుంటంతో ఇప్పుడు అసెంబ్లీ స్థానాల పెంపు చేయకుండా..సెన్సెస్ పూర్తయిన తర్వాత డీలిమిటేషన్ చేయాలని డిసైడ్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చే అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు పాత నియోజకవర్గాలతోనే జరుగనున్నాయి. 2029 ఎన్నికల నాటికి అసెంబ్లీ సీట్లు పెరుగుతాయని ఆశపడ్డ పార్టీలకు, రాజకీయ నేతలకు బిగ్ షాక్ ఇచ్చినట్లు అయింది. 2024లో కూటమిలో భాగస్వామి అయిన టీడీపీ తమ నేతలకు సీట్లు సర్ధుబాటు చేసేందుకు నానా అవస్థలు పడింది.

గత ఎన్నికల్లో టికెట్ల కేటాయింపు చేసేందుకు చివరి క్షణం వరకు బుజ్జగింపులు, సామాజిక సమీకరణాలు, పార్టీలో సీనియర్లకు హామీలు చాలా ప్రాసెస్ నడిచింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యత్వాలు, నామినేటెడ్ పోస్టులతో పాటు పార్టీ పదవుల పంపకం కూడా టీడీపీ హైకమాండ్‌కు ఇబ్బందికరంగా మారింది.

వచ్చే ఎన్నికల్లో టికెట్ల కేటాయింపునకు ఇవన్నీ అడ్డంకి
టీడీపీకి పట్టు ఉండి..లీడర్ స్ట్రాంగ్‌గా ఉన్న చోటే జనసేన, బీజేపీ టికెట్ కోసం పట్టుబట్టడంతో..చాలా మంది తెలుగు తమ్ముళ్లు సీటు త్యాగం చేశాయి. అధికారంలోకి వస్తే ఏదో పదవి దక్కుతుందని ఆశపడి..ఇప్పటికి ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లోపు అసెంబ్లీ సీట్ల పెంపు అయ్యే పని కాదన్న క్లారిటీ వచ్చింది.

దీంతో టీడీపీ హైకమాండ్‌కు ఇప్పటినుంచే గుబులు మొదలైందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. గత ఎన్నికలప్పుడే.. గెలుస్తున్నాం.. అధికారంలోకి వచ్చాక అన్ని విధాలుగా మిమ్మల్ని స్యాటిస్ఫై చేస్తామని కింద మీద పడి హామీ ఒప్పించి టికెట్ త్యాగానికి ఒప్పించారు. ఈ సారి టికెట్ల కేటాయింపు ఎలా.? అసలే ఐదేళ్లు పవర్‌లో ఉంటాం. పైగా అసంతృప్తులు, లీడర్ల వర్గపోరు ఉండనే ఉంది. వచ్చే ఎన్నికల్లో టికెట్ల కేటాయింపునకు ఇవన్నీ అడ్డంకిగా మారనున్నాయి. ఏం చేసేదని ఇప్పటినుంచే ఆలోచనలో పడిందట టీడీపీ అధిష్టానం.

చాలాచోట్ల కూటమిలో వర్గపోరు నడుస్తోంది. స్టార్టింగ్లో కాస్త రచ్చకెక్కిన లీడర్లు..అధినేతల ఆదేశాలతో..సర్దుకోకపోయినా..గొడవ అయితే పడట్లేదు. కలిసి పనిచేయడం కూడా అంతంత మాత్రమే. ఇలాంటి పరిస్థితులున్న వేళ..అసెంబ్లీ ఎన్నికల టికెట్ రేసు..ఇప్పటినుంచే కొన్ని నియోజకవర్గాల్లో కాక రేపుతోంది. అక్కడక్కడ తెలుగు తమ్ముళ్లే తగువ పడుతుంటే..మరికొన్ని చోట్ల, జనసేన, బీజేపీ నేతలతో టీడీపీ నేతలకు టికెట్ ఫైట్ నడుస్తోంది. ఎన్నికల టైమ్ వచ్చే సరికి టికెట్‌ రేసు, ఆశావహుల ప్రయత్నాలు జోరందుకోవడం ఖాయం.

దీంతో ఇప్పటినుంచే ప్రత్యామ్నాయం ఆలోచించడం..సాధ్యమైనంత వరకు లీడర్లకు టికెట్‌పై క్లారిటీ ఇవ్వడం వంటివి టీడీపీ అధిష్టానం మదిలో ఉన్న అస్త్రాలుగా చెబుతున్నారు. గత ఎన్నికల్లో టికెట్ దక్కని వారికి నామినేటెడ్ పోస్టులు ఇవ్వడంతో పాటు..కొందరిని పార్టీ పొలిట్ బ్యూరోలోకి.. మరికొందరిని జిల్లా పార్టీ అధ్యక్ష పగ్గాలు..ఇంకొందర్ని ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులుగా పంపించాలనేది బాబు ఆలోచనగా చెబుతున్నారు. సీట్ల సర్దుబాటు విషయంలో వచ్చే సవాళ్లను టీడీపీ అధిష్టానం ఇంకా ఎలా ఫేస్ చేయబోతోందో వేచి చూడాలి మరి.