MP Gorantla Madhav Video Call : వీడియో ఒరిజినల్ అని తేలితే.. గోరంట్ల మాధవ్‌పై చర్యలు-సజ్జల

ఆ వీడియో ఒరిజినల్ అని తేలితే ఎంపీ గోరంట్ల మాధవ్ పై చర్యలు ఉంటాయని వైసీపీ అధిష్టానం తేల్చి చెప్పింది. గోరంట్ల మాధవ్ అంశం విచారణలో తేలుతుందని సజ్జల అన్నారు. చట్ట ప్రకారం విచారణ జరుగుతుందని.. అసాంఘిక వ్యవహారం వైరల్ అయితే తక్కువ మాట్లాడి చర్యలు ఎక్కువ ఉండాలని అన్నారు.

MP Gorantla Madhav Video Call : వీడియో ఒరిజినల్ అని తేలితే.. గోరంట్ల మాధవ్‌పై చర్యలు-సజ్జల

MP Gorantla Madhav Video Call : హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో కాల్ వ్యవహారం దుమారం రేపుతోంది. రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. దీనిపై సర్వత్రా రచ్చ రచ్చ జరుగుతుండటంతో ఈ వ్యవహారంపై వైసీపీ అధిష్టానం సీరియస్ అయ్యింది. వీడియో ఒరిజినల్ అని తెలిస్తే ఎంపీ మాధవ్ పై చర్యలు ఉంటాయని పార్టీ అధిష్టానం తేల్చి చెప్పింది. వీడియో వైరల్ పై అధిష్టానం వివరణ కోరగా.. అది మార్ఫింగ్ వీడియో అని గోరంట్ల మాధవ్ చెప్పినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.

ఎంపీ న్యూడ్ వీడియో కాల్ వ్యవహారంపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. గోరంట్ల మాధవ్ అంశం విచారణలో తేలుతుందని సజ్జల అన్నారు. ఒక ప్రైవేట్ అంశం బయట వైరల్ అయిందన్నారు. ఎంపీ గోరంట్ల ఆ విషయాన్ని ఖండించారని చెప్పారు. చట్ట ప్రకారం విచారణ జరుగుతుందని సజ్జల వ్యాఖ్యానించారు. అసాంఘిక వ్యవహారం వైరల్ అయితే తక్కువ మాట్లాడి చర్యలు ఎక్కువ ఉండాలని అన్నారు. వైసీపీ ఒక మహిళా పక్షపాతి పార్టీగా.. గోరంట్ల మాధవ్ వ్యవహారం నిజమైతే చర్యలు ఉంటాయని సజ్జల రామకృష్ణా రెడ్డి తేల్చి చెప్పారు.

మరోవైపు ఎంపీ గోరంట్ల మాధవ్ దీన్ని సీరియస్ గా తీసుకున్నారు. అనంతపురం టు టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన పరువుకి భంగం కలిగించే విధంగా మార్ఫింగ్ చేసిన వీడియోలు వైరల్ చేశారని ఫిర్యాదు చేశారు. ఈ ఘటన తన కుటుంబ సభ్యులను కలిచివేసిందని ఎంపీ వాపోయారు. దీని వెనుక ఉన్నవారిని గుర్తించి అరెస్ట్ చేయాలని పోలీసులను కోరారు. నిజానిజాలు త్వరలోనే వెలుగులోకి వస్తాయని, అభిమానులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పోలీసులు వాస్తవాలు వెలుగులోకి తెచ్చేవరకు ఎవరూ దీనిపై స్పందించ వద్దని ఎంపీ మాధవ్ కోరారు.

ఎంపీ గోరంట్ల మాధవ్ ఒక మహిళతో నగ్నంగా వీడియో కాల్ మాట్లాడారంటూ ఓ వీడియో బయటకు వచ్చింది. అది తెగ వైరల్ అయ్యింది. దీనిపై రచ్చ రచ్చ జరుగుతోంది. ఎంపీ తీరుపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. బాధ్యతాయుతమైన పదవిలో ఉంటూ ఇదేం పాడు పని తిట్టి పోస్తున్నారు. ఎంపీ గోరంట్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

దీనిపై గోరంట్ల మాధవ్ స్పందిస్తూ… ఈ వీడియో వెనుక పెద్ద కుట్ర ఉందని ఆరోపించారు. ఇది మార్ఫింగ్ వీడియో అని అన్నారు. దీని వెనుక టీడీపీ నేత అయ్యన్నపాత్రుడి కుమారుడు చింతకాయల విజయ్, పొన్నూరి వంశీ, శివకృష్ణ తదితరులు ఉన్నారని మాధవ్ అన్నారు. టీడీపీ నేతలకు దమ్ముంటే తనను నేరుగా ఎదుర్కోవాలని సవాల్ విసిరారు. ఇప్పటికే ఈ విషయంపై జిల్లా ఎస్పీకి తాను ఫిర్యాదు చేశానని చెప్పారు. ఈ వీడియోను ఫోరెన్సిక్ టెస్టుకు పంపాలని అన్నారు. తాను ఏ విచారణకైనా సిద్ధమేనని చెప్పారు. ఈ వీడియోను తయారు చేసి సోషల్ మీడియాలో పెట్టిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. ఈ వీడియోలో ఉన్నది తానే అని నిరూపించాలన్నారు.