Bathukamma Festival 2022: నేటి నుంచి బతుకమ్మ ఉత్సవాలు.. భారీ ఏర్పాట్లు చేసిన ప్రభుత్వం.. ఏ రోజు ఏ బతుకమ్మను తయారు చేస్తారంటే..

తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ పండుగ నేటి (ఆదివారం) నుంచి తొమ్మిది రోజుల పాటు ఘనంగా జరగనుంది. తొమ్మిది రోజులపాటు నిర్వహించే బతుకమ్మ పండుగకు 9 రకాల ప్రసాదాలను నైవేధ్యంగా పెడతారు.

Bathukamma Festival 2022: నేటి నుంచి బతుకమ్మ ఉత్సవాలు.. భారీ ఏర్పాట్లు చేసిన ప్రభుత్వం.. ఏ రోజు ఏ బతుకమ్మను తయారు చేస్తారంటే..

bathukamma

Bathukamma Festival 2022: తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ పండుగ నేటి (ఆదివారం) నుంచి తొమ్మిది రోజుల పాటు ఘనంగా జరగనుంది. మహిళలు, యువతులు, బాలికలకు ఎంతో ప్రీతిపాత్రమైన పండుగను తోబుట్టువులు, చిన్ననాటి స్నేహితులతో కలిసి ఆనందోత్సాహాల నడుమ జరుపుకుంటారు. పుట్టినింట.. మెట్టినింట సుఖసంతోషాలు, ప్రేమానురాగాలను ఆకాంక్షిస్తూ ఇష్టదైవాలు, ప్రకృతి మాతలను కొలుస్తూ శుభ, సామాజిక సందేశాలను ఈ పండుగ చాటుతుంది.

Bathukamma 2022 : బతుకమ్మ పేర్చే ఒక్కో పువ్వుకి ఒక్కో అర్థం.. ఆ పూలలో ఔషధ గుణాలు

బతుకమ్మ ఉత్సవాల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ ఏడాది రూ. పది కోట్లను కేటాయించింది. హైదరాబాద్ తో పాటు అన్ని జిల్లాల్లో భారీగా ఏర్పాట్ల కోసం కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చింది. బతుకమ్మ మైదానాల వద్ద విద్యుత్, మంచినీరు, పారిశుద్ధ్య నిర్వహణ చేపట్టాలని సూచించింది. బతుకమ్మ నిమజ్జనం చేసే ఘాట్ల వద్ద ప్రమాదాల నివారణ చర్యలకు ప్రభుత్వం ఆదేశించింది.

ఉత్సవాల చివరి రోజు అక్టోబర్ 3న రాజధానిలోని ఎల్బీ స్టేడియం నుంచి వేల మంది మహిళలు, వెయ్యి మందికిపైగా జానపద గిరిజన కళాకారులతో బతుకమ్మలను ఊరేగింపుగా తీసుకెళ్లి ట్యాంక్ బండ్ వద్ద నిమజ్జనం చేస్తారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఉత్సవాలు జరగనున్నాయి. రవీంధ్రభారతిలో ప్రతీరోజూ బతుకమ్మ ఉత్సవాలతో పాటు సాంస్కృతిక, సాహిత్య కార్యక్రమాలు నిర్వహిస్తారు.

బతుకమ్మ సంబరాల్లో భాగంగా తొమ్మిది రోజుల పాటు తొమ్మిది రకాల ప్రత్యేక పువ్వులను పూజిస్తారు. తొలిరోజు ఎంగిలి పూల బతుకమ్మ, రెండో రోజు అటుకుల బతుకమ్మ, మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ, నాలుగో రోజు బియ్యం బతుకమ్మ, ఐదో రోజు అట్ల బతుకమ్మ, ఆరో రోజు అలిగిన బతుకమ్మ, ఏడో రోజు వేపకాయల బతుకమ్మ, ఎనిమిదో రోజున వెన్నముద్దల బతుకమ్మ, చివరగా సద్దుల బతుకమ్మతో ఈ సంబరాలను ఘనంగా ముగిస్తారు. ఈ సంబురాల సమయంలో బతుకమ్మ పాటలు కూడా పాడతారు.