తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి శోభ

తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి శోభ

Vaikunta Ekadasi Celebrations : తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి శోభ మొదలైంది. వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని వైష్టవ ఆలయాలు అంగరంగ వైభవంగా ముస్తాబయ్యాయి. చలిని సైతం లెక్క చేయకుండా ఆలయాలకు తరలివస్తున్నారు భక్తులు. ఉత్తర ద్వార దర్శనం కోసం ఆలయాలకు బారులు తీరుతున్నారు. గోవిందా, నమో నారాయణాయ..నామాలతో ఆలయాలు మార్మోగుతున్నాయి. భద్రాచలం, యాదాద్రితో సహా వేలాది దేవాలయాలు ఉదయం రెండు, మూడు గంటల సమయంలోనే తెరుకుచున్నాయి.

ఇక…తిరుమల కొండపై వైకుంఠ ఏకాదశి సందడి నెలకొంది. తిరుమలలో తొలిసారిగా 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు కల్పిస్తున్నారు. అర్ధరాత్రి 12 గంటల 5 నిమిషాల నుంచి ఒంటిగంట 30 నిమిషాల వరకు తిరుప్పావైతో శ్రీవారిని మేల్కొలిపి ఏకాంతంగా ధనుర్మాస కైంకర్యాలు నిర్వహించారు. తర్వాత దక్షిణ, ఉత్తర భాగంలోని వైకుంఠ ద్వారాలను తెరిచారు. ఒకటిన్నర గంటల నుంచి 4 గంటల వరకు అభిషేకం, తోమాల, అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహించారు. ఆ తర్వాత వీఐపీ బ్రేక్‌ దర్శనం మొదలైంది. సుమారు 3 నుంచి 4 వేల మంది వివిధ కేటగిరీలకు చెందిన వీఐపీలకు దర్శన భాగ్యం కల్గనుంది. ఇక ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకున్న భక్తులకు ఉదయం 7 గంటల 30 నుంచి దర్శనం కల్పించనున్నారు.

కోవిడ్‌ నిబంధనలతో సాధారణం కంటే తక్కువ స్థాయిలో భక్తులు తిరుమలకు రానుండటంతో పరిమితంగానే ఏర్పాట్లు చేశారు. కొవిడ్‌ నిబంధనలు పాటించేలా సిబ్బందికి సూచనలు చేశారు. అలిపిరి, గదుల కేటాయింపు కేంద్రాలు, వైకుంఠం క్యూకాంప్లెక్స్‌, ఆలయం వద్ద థర్మల్‌ స్ర్కీనింగ్‌ చేసేలా ప్రణాళిక రూపొందించుకున్నారు. అన్ని ప్రదేశాలను నిరంతరం శానిటైజ్‌ చేయనున్నారు. తిరుమలలో భక్తుల వాహనాలకు పార్కింగ్‌ ప్రాంతాలను సిద్ధం చేశారు. డిసెంబరు 25వ తేదీ‌ నుంచి జనవరి 3వ తేదీ వరకూ రోజుకు ముప్పై వేల మంది భక్తులకు మాత్రమే దర్శనం కల్పిస్తామన్నారు టీటీడీ అధికారులు.

వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని తిరుమలలో పలువురు ప్రముఖులు వైకుంఠ ద్వార దర్శనం ద్వారా శ్రీవారిని దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు టిటిడి పాలకమండలి సభ్యులు జూపల్లి రామేశ్వర్ రావు. అలాగే తెలంగాణ మంత్రులు హరీష్ రావు, శ్రీనివాస్ గౌడ్, మల్లారెడ్డి, గంగుల కమలాకర్‌తో పాటు కాంగ్రెస్‌ నేత ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి దర్శించుకున్నారు.

ఇక ఏపీ మంత్రులు ఆదిమూలపు సురేష్‌, పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి, ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి, అవంతి శ్రీనివాస్, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి అరవింద్ బాబ్డే కుటుంబసమేతంగా శ్రీవారిని దర్శించుకున్నారు. ఎంపీలు మిధున్ రెడ్డి, రెడ్డెప్ప, గోరంట్ల మాధవ్, ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పలువురు ప్రముఖులు తిరుమల శ్రీనివాసున్ని దర్శించుకున్న వారిలో ఉన్నారు.