కొత్త బార్లకు ఫుల్ డిమాండ్…రూ. 73.78 కోట్ల ఆదాయం

కొత్త బార్లకు ఫుల్ డిమాండ్…రూ. 73.78 కోట్ల ఆదాయం

248 applications received for one bar in suryapet district nereducherala muncipality : తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన 72 మున్సిపాల్టీల్లో 159 బార్ల ఏర్పాటుకు గత నెల 25న ఎక్సైజ్ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. వాటిలో ఒక ప్రాంతంలో ఏర్పాటు చేసే బార్ కు ఏకంగా 248 అప్లికేషన్లు వచ్చి రికార్డు సృష్టించగా…దరఖాస్తు రుసుము కిందే ఖాజానాకు రూ.73.78 కోట్ల ఆదాయం వచ్చి చేరింది. సూర్యాపేట జిల్లాలో కొత్తగా ఏర్పాటైన నేరేడుచర్ల మున్సిపాలిటీలో ఒక్క లిక్కర్‌ షాపు కోసం 248 దరఖాస్తులు వచ్చాయి. అతిఎక్కువ దరఖాస్తులు వచ్చిన రెండో మున్సిపాలిటీ నేరేడుచర్లనే. మహబూబ్‌బాద్‌ జిల్లా తొర్రూర్‌లో ఒక బార్‌కు 278 దరఖాస్తులు వచ్చాయి. సోమవారం తో దరఖాస్తు గడువు ముగిసే సమయానికి ఆయా మున్సిపాలిటీల్లో 7,380 దరఖాస్తులు వచ్చాయని ఎక్సైజ్‌ వర్గాలు వెల్లడించాయి.

మందకొడిగా మొదలై వెల్లువలా వచ్చిన దరఖాస్తులు
కొత్త బార్‌ల కోసం మొదట్లో మందకొడిగా మొదలైన దరఖాస్తులు గడువు సమీపించేకొద్దీ వెల్లువలా వచ్చి పడ్డాయి. మొత్తం 7,378 దరఖాస్తులు వచ్చాయి. 147 షాపులకు 10 కంటే ఎక్కువే దరఖాస్తులు వచ్చాయి. నిజామాబాద్‌ కార్పొరేషన్‌లో కొత్తగా ఏడు బార్లు నోటిఫై చేయగా 7, బోధన్‌ మున్సిపాలిటీలో 3బార్లు నోటిఫై చేయగా 3 దరఖాస్తులు వచ్చాయి. దుబ్బాకలో ఒక షాపునకు 7, అమరచింతలో ఒక షాపునకు 8 దరఖాస్తులు వచ్చాయి.

జీహెచ్‌ఎంసీ పరిధిలో 55 షాపులకు 1,074 వరకు దరఖాస్తులు వచ్చాయి. కొత్త మద్యం దుకాణాలకుగాను బుధవారం పిబ్రవరి 10న ఆయా జిల్లాల కలెక్టర్లు డ్రా తీయనున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని షాపులకు ఎక్సైజ్‌ కమిషనర్‌ అదేరోజు డ్రా తీస్తారు. గెలిచినవారికి 17వ తేదీన షాపులు కేటాయిస్తారు. షాపులు కేటాయించిన మూడు నెలల్లోపు ఎక్సైజ్‌ శాఖ సూచించే అన్ని నిబంధనలకు అనుగుణంగా యజమానులు బార్ లు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.

యాదాద్రి భువనగిరి జిల్లా రికార్డు
యాదాద్రి–భువనగిరి జిల్లాలోని నూతన మున్సిపాలిటీల్లో ఏర్పాటు చేసే ఐదు బార్‌లకు 638 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తు ఫీజు రూపంలోనే రూ. 6.38 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి వచ్చింది. చివరి రోజైన సోమవారం నిన్న ఒక్కరోజే 356 దరఖాస్తులు రావడం పోటీ తీవ్రతకు అద్దంపడుతోంది. యాదగిరిగుట్ట మున్సిపాలిటీలోని ఒక బార్‌కు 277 దరఖాస్తులు వచ్చాయి. చౌటుప్పల్‌లోని రెండు బార్‌లకు 135, ఆలేరులోని ఒక బార్‌కు 126, మోత్కూరులోని ఒక బార్‌కు 100 మంది దరఖాస్తు చేసుకున్నారు.