Birla Group jewellery : గోల్డ్‌ బిజినెస్‌లోకి ఎంట్రీ ఇస్తున్న బిర్లా గ్రూప్‌ .. రూ 5,000 కోట్లతో రిటైల్‌ స్టోర్లు

టాటా.. రిలయన్స్‌ వంటి అగ్రశ్రేణి కార్పొరేట్‌ దిగ్గజాలకు పోటీగా బిర్లా గ్రూప్‌ కూడా బంగారం బిజినెస్ లోకి ఎంట్రీ ఇస్తోంది. బిర్లా గ్రూప్‌ ప్రకటనతో దేశంలో గోల్డ్‌ బిజినెస్‌పై ఒక్కసారిగా ఆసక్తి పెరిగింది.

Birla Group jewellery : గోల్డ్‌ బిజినెస్‌లోకి ఎంట్రీ ఇస్తున్న బిర్లా గ్రూప్‌  .. రూ 5,000 కోట్లతో రిటైల్‌ స్టోర్లు

Birla Group enter jewellery

Birla Group enter jewellery retail  :  బంగారం వ్యాపారంలోకి మరో కార్పొరేట్‌ దిగ్గజం ఎంటర్‌ అవుతోంది. వ్యాపార విస్తరణలో భాగంగా గోల్డ్‌ రిటైల్‌ ఔట్‌లెట్లను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది బిర్లా గ్రూప్‌. ఇప్పటికే ఈ వ్యాపారంలో టాటా.. రిలయన్స్‌ వంటి అగ్రశ్రేణి కార్పొరేట్‌ దిగ్గజాలు ఉన్నాయి. ఇప్పుడు బిర్లా గ్రూప్‌ కూడా ఐదు వేల కోట్లతో దేశవ్యాప్తంగా స్టోర్లు ప్రారంభిస్తామని ప్రకటించింది. బిర్లా గ్రూప్‌ ప్రకటనతో దేశంలో గోల్డ్‌ బిజినెస్‌పై ఒక్కసారిగా ఆసక్తి పెరిగింది. లాభాల్లో మేటి అయిన మేలిమి బంగారం వ్యాపారంలోకి కార్పొరేట్‌ దిగ్గజాలు ఎంట్రీకి కారణమేంటి? ఈ వ్యాపారంలో ఉన్న అవకాశాలు ఏంటి?

 

బంగారం వ్యాపారంలోకి బడా కంపెనీలు అడుగుపెడుతున్నాయి. ఒకప్పుడు బంగారం వ్యాపారం అంటే ఫ్యామిలీ బిజినెస్‌గానే చూసేవారు. ఆభరణాల తయారీదారులు.. ఓ స్థాయి వ్యాపారులు మాత్రమే గోల్డ్‌ బిజినెస్‌ చేసేవారు. కానీ.. ఇప్పుడు గోల్డ్‌ బిజినెస్‌లో పోటీ ఒక్కసారిగా పెరిగిపోయింది. బడా సంస్థలతోపాటు కార్పొరేట్‌ దిగ్గజాలు కూడా బంగారం వ్యాపారంపై ఫోకస్‌ పెట్టాయి. లాభాలే తప్ప.. నష్టాలు ఎరుగని వ్యాపారంలోకి ఎంటర్‌ అవుతూ తమ కంపెనీల గ్రాఫ్‌ పెంచుకుంటున్నాయి. కొన్నేళ్లుగా ఈ ట్రెండ్‌ బాగా పెరిగింది. భారతీయ కార్పొరేట్‌ దిగ్గజంగా చెప్పే టాటా గ్రూప్‌ తనిష్క్‌ పేరిట జ్యువెల్స్‌ బిజినెస్‌ చేస్తుండగా… అంబానీలు రిలయన్స్‌ జ్యువెల్స్‌ను ప్రారంభించారు. ఇప్పుడు ఈ బిజినెస్‌లోకి ఆదిత్యా గ్రూప్‌ కూడా ప్రవేశిస్తోంది.

 

దేశంలో పెద్ద వ్యాపారాలు.. బడా సంస్థలకు పర్యాయపదంగా టాటా.. బిర్లా గ్రూప్‌లను చెబుతుంటారు. ఇంతవరకు గోల్డ్‌ తప్ప మిగిలిన అన్ని రంగాల్లోనూ ఈ కంపెనీలు ప్రవేశించాయి. కొన్నేళ్ల క్రితం టాటా తనిష్క్‌ జ్యువెల్స్‌ ప్రారంభించగా.. ఇప్పుడు బిర్లా కూడా నావల్‌ జ్యువెల్స్‌తో ముందుకు వస్తోంది. దిగ్గజ కార్పొరేట్‌ కంపెనీలు ఈ వ్యాపారంలోకి వచ్చేందుకు ఏకైక కారణం.. లాభాలే అని ఒక్క ముక్కలో చెప్పొచ్చు. ఏ వ్యాపారంలో అయినా లాభంతోపాటు నష్టం కూడా ఉంటుంది. కాని ఒక్క బంగారం మాత్రమే నష్టభయం లేని వ్యాపారంగా చెబుతున్నారు. రోజురోజుకు పెరిగే ధరలతో గోల్డ్‌ బిజినెస్‌ చాలా సేఫ్‌ అనే చెప్పాలి. పెరగడమే కాని.. తగ్గడం అంటూ ఏంటో తెలియని పుత్తడిని నమ్ముకున్న వారు ఎవరూ నష్టపోయిన చరిత్ర లేదు.

 

బంగారం వ్యాపారం చేయాలంటే రిటైల్‌ స్టోర్లే పెట్టాల్సిన అవసరం లేదు. ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌, గోల్డ్‌ ఈటీఎఫ్‌ల్లో కూడా పెట్టుబడులు పెట్టొచ్చు. కాని కార్పొరేట్‌ దిగ్గజాలు మాత్రం రిటైల్‌ స్టోర్లపైనే ఆసక్తి చూపుతున్నాయి. బంగారానికి భారతీయులకు ఎంతో అవినాభావ సంబంధం ఉంది. ఎంత పేదవారైనా అవకాశం చిక్కితే గ్రాము బంగారం అయినా కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతుంటారు. ఎన్ని ఆభరణాలు ఉన్నా భారతీయ వనితలు.. మళ్లీ… మళ్లీ ఆభరణాలు కొనుగోలు చేయడానికే ఆసక్తి చూపుతారు. ప్రపంచంలో బంగారం ఎక్కువగా అమ్ముడయ్యే దేశాల్లో మనది రెండో స్థానం. ఏటా 700 టన్నుల వరకు గోల్డ్‌ బిజినెస్‌ జరుగుతుంది. భవిష్యత్‌లో ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. సీజన్‌ అన్‌ సీజన్‌ సంబంధం లేకుండా గోల్డ్‌ బిజినెస్‌ జరుగుతుంటుంది. ధర పెరిగితే కొద్ది రోజులు వేచి చూడడం.. పెరిగిన ధరకే మళ్లీ కొనుగోలు చేయడం గోల్డ్‌ బిజినెస్‌లో సర్వసాధారణం. అంతే కాదు బంగారం ధరలు తగ్గుతున్నప్పటి కంటే పెరుగుతున్నప్పుడే ఎక్కువ మంది మంచి పెట్టుబడి వనరుగా భావించి బంగారం కొంటారు. అందుకే దిగ్గజ సంస్థలు కూడా ఈ వ్యాపారంలోకి వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నాయి.

 

టాటా గ్రూప్‌నకు చెందిన తనిష్క్‌ జ్యువెల్స్‌ మూడు దశాబ్దాలుగా ఈ వ్యాపారంలో ఉంది. రిలయన్స్‌ కూడా గోల్డ్‌ స్టోర్లు ప్రారంభించి దాదాపు రెండు దశాబ్దాలు కావస్తోంది. ఈ రెండు సంస్థలతో అన్ని రంగాల్లో పోటీపడిన బిర్లా గ్రూప్‌ ఇన్నాళ్లు ఇటు వైపు చూడలేదు. సిమెంట్‌, కెమికల్స్‌, మెటల్ పల్ప్‌ ఫైబర్‌, టెక్స్‌టైల్స్‌, కమ్యూనికేషన్స్‌, B2B ఇ-కామర్స్‌, పెయింట్స్, ఫైనాన్సియల్‌ సర్వీసెస్‌, ఫ్యాషన్‌ రిటైల్‌, ఆయిల్‌.. ఇలా బిర్లా గ్రూప్‌నకు ఎన్నో వ్యాపారాలు ఉన్నాయి. సుమారు 26 దేశాల్లో తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించింది బిర్లా గ్రూప్‌. ఈ ఊపులోనే ఇప్పుడు మన దేశంలో బంగారం ఔట్‌లెట్లను ప్రారంభించాలని అనుకుంటోంది. నమ్మకమైన వజ్రాభరణాలకు చిరునామాగా తమ స్టోర్లను ఏర్పాటు చేస్తామని చెబుతోంది. టాటా, రిలయన్స్‌లే కాదు.. ఈ రంగంలో ఎన్నో పెద్ద పెద్ద కార్పొరేట్‌ దిగ్గజాలు ప్రస్తుతం మన దేశంలో గోల్డ్‌ బిజినెస్‌లో ఉన్నాయి. వినియోగదారులకు మెరుగైన.. నాణ్యమైన ఆభరణాలు లభిస్తుండటంతో కార్పొరేట్‌ స్టోర్లకు ఆదరణ లభిస్తోంది.