బ్యాంకుల విలీనానికి కేబినెట్ ఆమోదం

  • Published By: chvmurthy ,Published On : January 2, 2019 / 02:01 PM IST
బ్యాంకుల విలీనానికి కేబినెట్ ఆమోదం

ఢిల్లీ:దేశంలో మరోసారి బ్యాంకుల విలీనానికి కేంద్రం పచ్చ జెండా ఊపింది.ఇప్పటికే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఐదు అనుబంధ బ్యాంకులను విలీనం చేసిన తర్వాత  కేంద్రం, దేనా బ్యాంకు,విజయా బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడాల విలీనాన్నిబుధవారం ఆమోదించింది. కేంద్ర న్యాయశాఖ మంత్రి  రవిశంకర్ ప్రసాద్ ఈ విషయాన్ని చెపుతూ బ్యాంకు విలీనం వల్ల ఉద్యోగుల సర్వీసుపై ఎటువంటి ప్రభావం చూపదని, ఈ మూడింటి విలీనం వల్ల ఏర్పడే కొత్త బ్యాంకు ఎస్బీఐ, ఐసీఐసీఐ తర్వాత దేశంలోనే 3వ అతి  పెద్ద బ్యాంకుగా అవతరిస్తుందని  చెప్పారు. 
డిసెంబర్ నెలలో బ్యాంకుల విలీనాన్ని వ్యతిరేకిస్తూ బ్యాంకు యూనియన్లు ఒకరోజు సమ్మె చేశాయి. కాగా, బ్యాంకుల విలీనం వల్ల బ్యాంకులతో పాటు వినియోగదారులకు సౌలభ్యంగా ఉంటుందని ,  బ్యాంకు షేర్ హోల్డర్స్ కి కూడా లాభమేనని ప్రభుత్వం చెపుతోంది. విలీన ప్రక్రియ 2019 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుందని ,కొత్తగా ఏర్పడే బ్యాంకులో 85 వేలకు పైగా ఉద్యోగులు ఉంటారని, దేశ, విదేశాల్లో 9,485  బ్రాంచ్ లు ఏర్పడతాయని రవిశంకర్ ప్రసాద్ తెలిపారు.