Gold Rate: బంగారం ధర ఎందుకు ఇంతలా పెరుగుతోంది.. మరింత పెరిగే చాన్స్ ఉందా?

Gold Rate: గత ఏడాది అక్టోబర్ నుంచి బంగారం నెమ్మదిగా పెరుగుతూ వస్తోంది. ఈ అర్నెల్ల కాలంలో 19 శాతం ధర పెరిగిందని అంటున్నారు మార్కెట్ నిపుణులు.

Gold Rate: బంగారం ధర ఎందుకు ఇంతలా పెరుగుతోంది.. మరింత పెరిగే చాన్స్ ఉందా?

Gold Rate: ప్రపంచ ఆర్థిక సంక్షోభంలో బంగారం మెరిసిపోతోంది. అమెరికా, యూరప్‌ల్లో బ్యాంకులు డీలా పడుతుంటే పసిడి ధగధగలాడుతోంది. ఏకంగా పది గ్రాముల బంగారం 60 వేల మార్క్‌ను దాటేసి ఆల్‌టైమ్ రికార్డు నమోదుచేసింది. ఈ ధరల పరుగు మరికొద్ది కాలం కొనసాగే అవకాశం ఉందంటున్నారు. సురక్షిత పెట్టుబడి కింద ఇన్వెస్టర్లు బులియన్ సవారీ చేస్తుంటే.. సామాన్యులు ధరల పరుగు చూసి బెంబేలెత్తిపోతున్నారు.

60 వేల మార్క్‌ను దాటేసిన పుత్తడి
బులియన్ రన్ స్పీడందుకుంది. సామాన్యులకు అందనంత స్థాయిలో పసిడి ధర పెరిగిపోతోంది. ఈ వారం ఆరంభంలోనే అదిరిపోయే రికార్డు నమోదు చేసింది పుత్తడి. తొలిసారిగా 60 వేల మార్క్‌ను తాకి.. ఆల్‌టైం రికార్డు నమోదు చేసింది. అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులు బులియన్ మార్కెట్‌కు లాభిస్తున్నాయి. సురక్షిత పెట్టుబడి మార్గంగా పెద్దఎత్తున బంగారంపై పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు పెట్టుబడిదారులు. రిస్క్ పర్సంటేజ్‌ తక్కువ ఉన్న బులియన్ మార్కెట్‌… ఇప్పుడున్న పరిస్థితులకు ప్రత్యామ్నాయంగా.. రక్షణగా మారింది. మదుపర్ల దృక్పథం మారడంతో బులియన్ రన్ వేగం పెంచుకోగా.. సామాన్యులు.. చిన్న వ్యాపారులు డీలా పడుతున్నారు.

ఆర్థిక మాంద్యంలో ఇన్వెస్టర్లను ఆకర్షిస్తున్న పసిడి
గత ఏడాది స్థిరంగా కొనసాగిన బంగారం ధర ఈ ఏడాది ఆరంభంలో కాస్త పెరుగుదల నమోదు చేసింది. కానీ, గత వారం అమెరికాలోని సిలికాన్ వ్యాలీ బ్యాంక్ – SVB, యూరప్‌కు చెందిన క్రెడిట్ సూయిస్ బ్యాంకులు దివాలా తీశాయి. ఈ ప్రభావం షేర్ మార్కెట్‌పై తీవ్రంగా పడింది. ఒక్కసారిగా షేర్ మార్కెట్ పతనం కావడంతో లక్షల కోట్ల రూపాయలు క్షణాల్లో ఆవిరైపోయాయి. ఈ రెండే కాదు. అంతర్జాతీయంగా.. మరీ ముఖ్యంగా అమెరికా, బ్రిటన్ వంటి దేశాల్లో తీవ్ర ఆర్థిక సంక్షోభం నెలకొంది. ఈ ప్రభావం వల్ల సమీప భవిష్యత్‌లో మరో 186 బ్యాంకులు దివాళా తీసే ప్రమాదం ఉన్నట్లు అంచనా వేస్తున్నాయి మార్కెట్ వర్గాలు. ఇదే జరిగితే ఆర్థికంగా తీవ్ర నష్టాలు ఖాయం. ఈ కారణంగా ముందుచూపుతో బంగారంపై పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు ఇన్వెస్టర్లు.

భవిష్యత్‌లో మరింత పెరిగే అవకాశం
బంగారం అంటే భారతీయులకే కాదు.. ఇప్పుడు అంతర్జాతీయంగా అదో సురక్షిత పెట్టుబడిగా మారిపోయింది. ఇన్నాళ్లు మనం మాత్రమే బంగారాన్ని ఓ ఆస్తిలా.. స్టేటస్ సింబల్‌గా ఉపయోగించుకున్నాం.. ఇప్పుడు ఈ ట్రెండ్ అంతర్జాతీయంగా కనిపిస్తోంది. ఈ ఎల్లో మెటల్ కోసం విదేశీయులు సైతం వెంపర్లాడుతున్నారు. దీంతో మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ -MCXలో బంగారం ధర ఆల్‌టైం హైకి చేరుతోంది. రాబోయే కొద్ది నెలల్లో బంగారం ధర మరింత పెరుగుతుందంటున్నారు బంగారం వ్యాపారులు. కొత్త గరిష్టాలను తాకే అవకాశం ఉందని.. పది గ్రాముల బంగారం ధర 61 వేల నుంచి 62 వేల రూపాయలకు చేరొచ్చని అంచనాలు వెలువడుతున్నాయి.

Also Read: ప్రపంచ సంపన్నుల జాబితాలో అదానీని దాటేసిన అంబానీ.. టాప్-10లో నిలిచిన ముకేష్ అంబానీ

ఇప్పట్లో తగ్గే అవకాశమే లేదా?
ముఖ్యంగా అమెరికా డాలర్ పతనం.. బంగారం ధర పెరుగుదలకు అనుకూలంగా మారిందని చెబుతున్నారు. ఇది సమీప కాలంలో పుత్తడికి మరింత శోభ తెస్తుందని అంచనా వేస్తున్నారు. అమెరికా డాలర్ పడిపోయినప్పుడు బంగారం పెరగడం కామన్‌గా మారింది. గత ఏడాది అక్టోబర్ నుంచి అమెరికా డాలర్ పతనాన్నే నమోదు చేస్తోంది. దీని ఫలితంగా బంగారం ధర పెరుగుతోంది. సిలికాన్ వ్యాలీ బ్యాంక్ సంక్షోభం తర్వాత అమెరికా సెంట్రల్ బ్యాంక్ వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉండటంతో బంగారం ధర ఇప్పట్లో తగ్గే అవకాశమే లేదంటున్నారు వ్యాపారులు.

Also Read: మరో ‘బిగ్ వన్’పై హిండెన్ బర్గ్ రిపోర్ట్ ..! ఈసారి బ్రహ్మాస్త్రం ఎవరిపైనో..!!

అర్నెల్ల కాలంలో 19 శాతం పెరిగిన ధర
గత ఏడాది అక్టోబర్ నుంచి బంగారం నెమ్మదిగా పెరుగుతూ వస్తోంది. ఈ అర్నెల్ల కాలంలో 19 శాతం ధర పెరిగిందని అంటున్నారు మార్కెట్ నిపుణులు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు, ఆర్ధిక మాంద్యం, ద్రవ్యోల్బణం వంటి కారణాలతో 2022లో బంగారం ధర కేవలం ఒక శాతం మాత్రమే పెరిగింది. ప్రపంచ కరెన్సీగా చలామనీ అయ్యే అమెరికన్ డాలర్ బలంగా ఉంటే బంగారం ధర స్థిరంగా ఉంటుంది. అదే డాలర్ కాస్త అటు ఇటు అయినా బంగారం ధర జిగేల్ మంటోంది. గత ఏడాది ఇదే జరిగింది. కానీ, ఈ ఏడాది రష్యాపై విధించిన అంక్షలు.. పరోక్షంగా అమెరికాను ప్రభావితం చేశాయంటున్నారు. భారత్, చైనా వంటి దేశాలు రష్యాతో వాణిజ్యం ఆపకపోవడం.. ఈ దేశాల మధ్య అమెరికా డాలర్ కాకుండా.. రూపాయి, రూబుల్ రూపంలో లావాదేవీలు జరగుతుండటంతో డాలర్ నష్టపోయిందని అంటున్నారు. బంగారం ధర పెరగడానికి ఇదీ ఓ కారణంగా చెబుతున్నారు. మరీ ముఖ్యంగా దివాళా అంచున నిల్చొన్న 186 బ్యాంకులు… అంతర్జాతీయ ఆర్థిక పతనానికి దారి తీసే ప్రమాదకర పరిస్థితులు బంగారంపై భరోసా కల్పిస్తున్నాయి.