ఆర్థిక కష్టాల్లో జెట్ ఎయిర్ వేస్ : బోర్డు నుంచి నరేష్ గోయల్ ఔట్

ఆర్థిక కష్టాల్లో జెట్ ఎయిర్ వేస్ : బోర్డు నుంచి నరేష్ గోయల్ ఔట్

 1990ల నుంచి 2000ల వరకూ భారతదేశ విమానయాన రంగానికి ముఖచిత్రంగా మెరిసిపోయి ఓ వెలుగు వెలిగిన విమానయాన సంస్థ జెట్ ఎయిర్ వేస్ వ్యవస్థాపకుడు నరేష్ గోయల్,ఆయన భార్య అనిత సోమవారం(మార్చి-25,2019)జెట్ ఎయిర్ వేస్ బోర్డు నుంచి తప్పుకున్నారు.ఆర్థిక నష్టాల కారణంగా వారు బోర్డు నుంచి తప్పుకున్నారు.బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పులు కట్టలేక కొంతకాలంగా జెట్ ఎయిర్ వేస్ సంస్థ తమ ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వడం లేదన్న విషయం తెలిసిందే.

ఆకాశమంత ఎత్తుకు ఎదిగిన ఈ సంస్థ ఇప్పుడు కుప్పకూలిపోయే పరిస్థితుల్లో చిక్కుకుంది.ప్రపంచ స్థాయి ప్రమాణాలతో సేవలందిస్తూ జాతీయ సంస్థ అయిన ఎయిరిండియాను అధిగమించగలిగే స్థాయికి జెట్ ఎయిరన్ వేస్  చేరుకుంది.గత ఏడాదిలో స్థిరమైన ప్రగతి సాధించిన జెట్ ఎయిర్‌వేస్ భారతదేశ అతిపెద్ద అంతర్జాతీయ విమాన సేవల సంస్థగా ఎదిగింది. గత ఏడాదే రజతోత్సవ వేడుకలు జరుపుకున్న ఈ సంస్థ కొన్నివారాలుగా వేల సంఖ్యలో దేశీయ, అంతర్జాతీయ విమాన సేవలను రద్దు చేసింది. తనకున్న 119 విమానాలలో మూడింట రెండు వంతులను నిలిపేసింది.ఇప్పటికే ఈ సంస్థ రుణభారం రూ.7,000 కోట్ల రూపాయలు చేరుకుంది. ఉద్యోగులకు కొంతకాలంగా జీతాలు కూడా చెల్లించడం లేదు.

ఈ సమయంలో రంగంలోకి దిగిన భారత ప్రభుత్వం..ప్రైవేట్ సంస్థే అయినప్పటికీ, జెట్‌ ను ఆదుకునే ప్రయత్నాలు ప్రారంభించింది. 23,000 మంది ఉద్యోగులున్న ఈ సంస్థ కుప్పకూలిపోకుండా ఆపేందుకు ఈ సంస్థను కష్టాల్లోంచి బయటపడేసే పథకాలతో ముందుకు రావాలని జాతీయ బ్యాంకులకు సూచించింది.ఎస్ బీఐ నేతృత్వంలో ఈ సంస్థను ఆదుకునే  ప్రయత్నం మొదలైంది.

అబుదాబీకి చెందిన ఎతిహాద్ ఎయిర్ వేస్ కి జెట్ ఎయిర్ వేస్‌లో 24 శాతం వాటా ఉంది. జెట్‌ లో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని రుణదాతలు ఎతిహాద్ యాజమాన్యాన్ని కోరారు. ఎతిహాద్ సంస్థ జెట్ ఎయిర్వేస్‌లో తన వాటాను పెంచడానికి మొదట అంగీకరించిందని, అయితే గోయల్ ఆ సంస్థ చైర్మన్ పదవి నుంచి తప్పుకోవడానికి నిరాకరించడంతో వెనక్కి తగ్గిందని తెలిసింది. గోయల్, ఆయన కుటుంబ సభ్యులకు జెట్ ఎయిర్వేస్‌లో 52 శాతం వాటా ఉంది. విదేశీ విమానయాన సంస్థలు భారతీయ విమానయాన సంస్థలలో 49 శాతం వరకు పెట్టుబడులు పెట్టడానికి భారత విమానయాన చట్టాలు అనుమతిస్తున్నాయి.

2004-05 సమయంలో ఇండిగో, స్పైస్ జెట్ రాకతో జెట్ ఎయిర్ వేస్ కు సమస్యలు మొదలయ్యాయి. ఈ రెండు సంస్థలు తక్కువ ధరలకే టికెట్లను అమ్మడం మొదలుపెట్టాయి. మొదట్లో ‘ప్రీమియం ఎయిర్‌ లైన్స్’ అన్న పేరును నిలబెట్టుకోవాలన్న ఉద్దేశంతో జెట్ ఎయిర్ వేస్ తమ టికెట్ల ధరలను తగ్గించకుండా అధిక ధరలనే కొనసాగించింది. రోజులు గడిచే కొద్దీ ప్రయాణికుల్లో తన వాటాను ఇండిగోకు కోల్పోవడం మొదలైంది.

ఈ పరిణామంతో జెట్ ఎయిర్వేస్ తన విధానాన్ని మార్చుకొంది. టికెట్ల ధరలను తగ్గించింది. ఈ విధాన నిర్ణయమే జెట్ ఎయిర్ వేస్ ను సమస్యల్లోకి నెట్టేసిందని నిపుణులు అంటున్నారు.అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరల్లో నిలకడ లేకపోవడం కూడా జెట్ ఎయిర్ వేస్ ను ప్రభావితం చేసింది.నిరుడు చమురు ధరలు పెరగడంతో పరిస్థితి ఇంకా దిగజారింది.అప్పట్నుంచి తక్కువ వనరులతోనే సంస్థ కార్యకలాపాలు సాగిస్తోంది.