SBI కొత్త రూల్ : సేవింగ్స్ ఖాతాలో నిల్వలపై వడ్డీ తగ్గింపు

SBI కొత్త రూల్ : సేవింగ్స్ ఖాతాలో నిల్వలపై వడ్డీ తగ్గింపు

2019, మే 1 నుంచి SBI కొత్త పద్ధతిని అనుసరించేందుకు తెరదీసింది. ఈ కొత్త విధానంతో సేవింగ్స్ ఖాతాల్లో కేవలం లక్షలోపు నిల్వ ఉన్న వారికే బెనిఫిట్ ఉంటుంది. లక్ష దాటిందంటే తమకు వచ్చే వడ్డీరేటులో 0.25శాతం మాత్రమే వర్తిస్తుందని తేల్చేసింది. అధిక డిపాజిట్‌ కలిగిన సేవింగ్స్  ఖాతాలు, స్వల్పకాలిక రుణాల వడ్డీ రేట్లను ఆర్‌బీఐ రెపో రేటుతో అనుసంధానించే ప్రక్రియలో ఈ పద్ధతిని ఆరంభించింది. దీని గురించి మార్చిలోనే ప్రకటించిన SBI.. 2019 మే1 నుంచి అమలులోకి తీసుకొచ్చింది. 
Also Read : ఫేస్ బుక్ కొత్త డిజైన్ : ఐకానిక్ బ్లూ ప్లేస్ లో.. వైట్ కలర్

SBI అధికారిక వెబ్‌సైట్‌ ప్రకారం.. పొదుపు ఖాతాలో సొమ్ము రూ.లక్ష లోపు నిల్వ ఉన్న ఖాతాదారులకు ఎప్పటిలాగే 3.5 శాతం వార్షిక వడ్డీ లభిస్తుంది. మూడు నెలలకోసారి బ్యాంక్‌ వడ్డీని ఖాతాలో జమ చేస్తుంది. ఒకవేళ రూ.లక్షకు పైగా సొమ్ము నిల్వ ఉంటే, వడ్డీ రేటు రెపో రేట్ల సవరణలకు అనుగుణంగా మారనుంది. వడ్డీ రేటును రెపో రేటును 275 బేసిస్ పాయింట్లు కంటే తక్కువగా నిర్ణయించారు. మీ సేవింగ్స్ ఖాతా(SB) ఖాతాలో లక్ష రూపాయల కంటే తక్కువ నిల్వ ఉంటే 3.5 శాతం వడ్డీ లభిస్తుంది. అదే లక్ష కంటే ఎక్కువ డబ్బు ఉంటే వారికి 3.25 శాతం వడ్డీ మాత్రమే లభించనుంది. 

గతంలో అంటే, ఏప్రిల్‌ 30 వరకు రూ.కోటి లోపు డిపాజిట్లు ఉన్న వారికి 3.5 శాతం, రూ.కోటికి పైగా ఉన్నవారికి 4 శాతం వడ్డీ చెల్లిస్తూ వచ్చింది. ఈ కొత్త విధానం కేవలం కొంతమందిపై మాత్రమే ప్రభావం చూపనుంది. SBI పొదుపు ఖాతాదారుల్లో రూ.లక్ష లోపు డిపాజిట్‌ 95 శాతం మంది ఉన్నారు. 

రుణాల విషయంలో చురకలు:
వడ్డీ రేట్లు రెపో రేటుతో అనుసంధానించడంతో రుణాలపై వడ్డీ శాతం పెరుగుతోంది. రూ. లక్షకంటే ఎక్కువ క్యాష్‌ క్రెడిట్‌ ఖాతాలు, ఓవర్‌డ్రాఫ్ట్‌‌లపై వడ్డీ రేట్లను రెపోతో అనుసంధానించింది. ఈ విధానంతో 2.25 శాతం అధిక వడ్డీ పడటం ఖాయం. అంటే స్వల్ప కాలిక రుణాలు తీసుకుంటే బ్యాంక్‌‌కు 8.25 శాతం వార్షిక వడ్డీ చెల్లించాల్సిందే. ఇంతటితో సరిపెట్టుకోకుండా 8.25 శాతం ఫ్లోర్‌ రేటుతో పాటు కస్టమర్‌ రిస్క్‌ ప్రొఫైల్‌ ఆధారంగా ఎక్స్‌ట్రా వసూలు చేయనున్నట్లు ఎస్బీఐ స్పష్టం చేసింది. 

గత రెండు సమీక్షల్లో ఆర్‌బీఐ రెపో రేటును వరుసగా పావు శాతం చొప్పున తగ్గించింది. దాంతో ప్రస్తుత రెపోరేటు 6 శాతంగా ఉంది.
Also Read : మానవ జాతికి రక్షణగా : ఏలియన్స్.. మనతో రహస్యంగా జీవిస్తున్నాయి!