TATA BISLERI : దూకుడుమీదున్న TATA .. బిస్లెరీ కొనుగోలుకు రంగం సిద్ధం

టాటా గ్రూప్ మాంచి దూకుడు మీదుంది. నచ్చిన ప్రతి కంపెనీని కొనేస్తోంది. వచ్చిన ప్రతి డీల్‌ని సెట్ చేసేస్తోంది. బిజినెస్ నచ్చినా.. దాని వెనకున్న ఐడియా నచ్చినా.. మంచి రేటు ఇచ్చి మరీ.. ఆ కంపెనీని కొనేస్తోంది. కొద్ది నెలల కిందటే.. భారత ప్రభుత్వం దగ్గర్నుంచి.. ఎయిర్ ఇండియాను కొనేసిన టాటా గ్రూప్‌లో తాజాగా మరో కీలక పరిణామం చోటు చేసుకోనుంది. టాటా గ్రూప్‌కు చెందిన టాటా కన్జూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్.. దేశంలోనే అతిపెద్ద ప్యాకేజ్డ్ వాటర్ కంపెనీ అయిన బిస్లెరీని కొనుగోలు చేయనుంది.

TATA BISLERI : దూకుడుమీదున్న TATA .. బిస్లెరీ కొనుగోలుకు రంగం సిద్ధం

TATA Consumer Products..Ramesh Chauhan in discussions for Sale Of Bisleri

TATA BISLERI : టాటా గ్రూప్ అంటే.. తనకున్న వ్యాపారాలేవో చేసుకుంటూ.. ప్రశాంతంగా ఉంటుందనే పేరు మాత్రమే ఉంది. కానీ.. కొన్ని రోజులుగా టాటా గ్రూప్ వేస్తున్న అడుగులు, చేస్తున్న టేకోవర్లు, తీసుకుంటున్న నిర్ణయాలు చూస్తుంటే.. ఇండియన్ బిజినెస్ వరల్డ్‌లో ఎంత దూకుడుగా ముందుకు వెళుతుందో అర్థమవుతోంది. సంప్రదాయ పద్ధతిలో వ్యాపారం చేయడమొక్కటే కాదు.. తాము బిజినెస్‌ని పెంచుకుంటూ పోతే.. టాటా గ్రూప్‌ను విస్తరించుకుంటూ వెళితే.. ఎలా ఉంటుందో.. కొంతకాలంగా చూపిస్తున్నారు టాటా సన్స్.

ఎస్.. టాటా గ్రూప్ మామూలు దూకుడు మీద లేదు. నచ్చిన ప్రతి కంపెనీని కొనేస్తోంది. వచ్చిన ప్రతి డీల్‌ని సెట్ చేసేస్తోంది. బిజినెస్ నచ్చినా.. దాని వెనకున్న ఐడియా నచ్చినా.. మంచి రేటు ఇచ్చి మరీ.. ఆ కంపెనీని కొనేస్తోంది. కొద్ది నెలల కిందటే.. భారత ప్రభుత్వం దగ్గర్నుంచి.. ఎయిర్ ఇండియాను కొనేసిన టాటా గ్రూప్‌లో తాజాగా మరో కీలక పరిణామం చోటు చేసుకోనుంది. టాటా గ్రూప్‌కు చెందిన టాటా కన్జూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్.. దేశంలోనే అతిపెద్ద ప్యాకేజ్డ్ వాటర్ కంపెనీ అయిన బిస్లెరీని కొనుగోలు చేయనుంది. ఇందుకోసం.. 6 నుంచి 7 వేల కోట్ల మధ్య ఒప్పందం జరిగినట్లు వార్తలొస్తున్నాయి. ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ మేకింగ్‌లో టాప్ పొజిషన్‌లో ఉన్న బిస్లెరీ ఇంటర్నేషనల్.. కొద్దిరోజుల్లోనే టాటాల చేతికి వెళ్లనుంది. అయితే.. దీనికి సంబంధించి ఇప్పటివరకు టాటా కన్జూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ గానీ, బిస్లెరీ ఇంటర్నేషనల్ గానీ స్పందించలేదు.

82 ఏళ్ల వ్యాపార దిగ్గజం రమేశ్ చౌహాన్.. బిస్లెరీ ఇంటర్నేషనల్ కంపెనీకి అధిపతి. ఆయన తర్వాత.. బిస్లెరీ కంపెనీని చూసుకునే వారసులెవరూ లేనందు వల్లే.. ఆయన తన కంపెనీని అమ్మేస్తున్నారని తెలిసింది. ఆయనకు కూతురు ఉన్నప్పటికీ.. వ్యాపారంపై ఆమె అంతగా ఆసక్తి చూపడం లేదు. దీంతో.. చౌహాన్‌తో ఎందరో చర్చలు జరిపినప్పటికీ.. తన బిస్లెరీ కంపెనీనీ టాటాలకు మాత్రమే అప్పగించేందుకు ఆయన సిద్ధంగా ఉన్నారు. వాళ్లయితేనే.. ఈ వ్యాపారాన్ని మరింత ఎత్తుకు తీసుకెళతారని నమ్మకంగా ఉన్నారు. అయితే.. బిస్లెరీ వ్యాపారాలను ట్రాన్స్‌ఫర్ చేసేందుకు.. రెండేళ్లుగా టాటా గ్రూప్‌తో చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. రిలయన్స్, నెస్లే లాంటి కంపెనీలు పోటీలో ఉన్నా.. చౌహాన్ టాటాలకే ఈ డీల్ ఓకే చేశారు. సేల్ అగ్రిమెంట్‌లో భాగంగా.. రెండేళ్ల పాటు ప్రస్తుత మేనేజ్‌మెంట్ ఆధ్వర్యంలోనే బిస్లరీ నడుస్తుంది.

Bisleri International: వ్యాపారాన్ని చూసుకోవడానికి కూతురు అయిష్టత.. బిస్లెరీని అమ్మకానికి పెట్టిన రమేశ్ చౌహాన్

రమేశ్ చౌహాన్ సాధారణమైన వ్యక్తేమీ కాదు. భారత్ సాఫ్ట్ డ్రింక్‌ మార్కెట్‌ను ఒక్క ఊపు ఊపిన థమ్సప్‌, గోల్ప్‌స్పాట్‌, మాజా, సిట్రా, లిమ్కా లాంటి బ్రాండ్స్‌ను సృష్టించింది ఆయనే. 30 ఏళ్ల కిందట.. వీటిని కోకాకోలాకు అమ్మేశారు. వీటిల్లో థమ్సప్ ఇప్పటికే బిలియన్ డాలర్ బ్రాండ్‌గా అవతరించింది. మాజా కూడా రానున్న రెండేళ్లలో.. ఈ లిస్టులో చేరుతుందని కోకాకోలా అంచనా వేస్తోంది. చౌహాన్ 2016లో మరోసారి సాఫ్ట్ డ్రింక్స్ సెగ్మెంట్‌లోకి ప్రవేశించారు. బిస్లెరీ పాప్ పేరుతో డ్రింక్‌ని తీసుకురాగా.. అది వర్కవుట్ కాలేదు. కానీ.. ఇండియాలో నీటి వ్యాపారంలో బిస్లరీని మాత్రం అందరికీ అందనంత ఎత్తున నిలబెట్టారు. బిస్లరీ కంపెనీ అమ్మకం బాధాకరమైన నిర్ణయమే అయినప్పటికీ.. టాటా గ్రూప్ దానిని మరింత డెవలప్ చేసి.. బాగా చూసుకుంటుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు రమేశ్ చౌహాన్. టాటా గ్రూప్ నిజాయితీ, జీవిత విలువలను గౌరవించే సంస్కృతి తనకిష్టమనీ, అందుకే మిగతా వాళ్లను పట్టించుకోకుండా.. ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు.

నిజానికి.. టాటా కన్జూమర్ ప్రైవేట్ లిమిటెడ్.. హిమాలయన్, టాటా కాపర్ ప్లస్ బ్రాండ్ల పేరుతో.. ప్యాకేజ్డ్ మినరల్ వాటర్‌ని సేల్ చేస్తోంది. వీటికి.. బిస్లెరీ లాంటి బ్రాండ్ తోడు కానుంది. 1965లో ఇటాలియన్ బ్రాండ్‌గా ముంబైలో ఎంట్రీ ఇచ్చిన బిస్లెరీ కంపెనీని.. 1969లో చౌహాన్స్ కొనేశారు. ప్రస్తుతానికి.. బిస్లెరీకి 122 ఆపరేషనల్ ప్లాంట్స్ ఉన్నాయి. భారత్‌తో పాటు పొరుగు దేశాల్లో కలిపి 4500 మంది డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారు. బిస్లరీ.. ఈ ఆర్థిక సంవత్సరంలో.. 2500 కోట్ల టర్నోవర్‌తో 220 కోట్ల లాభాన్ని గడిస్తుందని అంచనా వేస్తున్నారు. ఇక.. బిస్లెరీ ఇంటర్నేషనల్.. టాటాలు టేకోవర్ చేయబోతున్నారన్న వార్తలతో.. టీసీపీఎల్ షేర్ స్టాక్స్‌లో బాగా రాణిస్తోంది. ఏకంగా.. రెండున్నర శాతం పెరిగి.. నిఫ్టీ 50 స్టాక్స్‌లో టాప్ గెయినర్‌గా నిలిచింది.

టాటా గ్రూప్ ఇప్పటికే.. చాలా రంగాలకు విస్తరించింది. ఈ ఏడాది మొదట్లోనే.. ఎయిరిండియాను తిరిగి దక్కించుకుంది. అంతేకాదు.. ఇప్పుడు ఎయిరిండియా కిందకి.. ఎయిర్ ఏషియా, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్, విస్తారా ఎయిర్‌లైన్స్‌ని కూడా తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే.. ఈ ప్రక్రియ ప్రారంభమైందని ఇటీవలే వార్తలొచ్చాయి. దీని కోసం.. విస్తారాతో విస్తృతంగా చర్చలు జరుపుతోంది టాటా గ్రూప్.