నిత్య పెళ్లి కూతురు : ఆరేళ్లలో నాలుగు పెళ్ళిళ్లు చేసుకున్న కిలేడీ

  • Published By: murthy ,Published On : July 28, 2020 / 09:40 AM IST
నిత్య పెళ్లి కూతురు : ఆరేళ్లలో నాలుగు పెళ్ళిళ్లు చేసుకున్న కిలేడీ

సూది కోసం సోది కెళితే రంకు యవ్వారం బయటపడ్డట్టు… మొగుడు నన్ను వదిలేసి విదేశాలకు చెక్కేసాడని ఫిర్యాదు చేస్తే ….ఆమె గారి అసలు బాగోతం అంతా బయట పడింది. ఆరేళ్లలో ఒకరికి తెలియకుండా ఒకరిని నలుగురిని పెళ్లి చేసుకుని అందరినీ మోసం చేసింది. ఈ కిలేడీ గుట్టును ప్రకాశం జిల్లా దొనకొండ పోలీసులు రట్టు చేశారు.
vipparla swapna
చిత్తూరు జిల్లా తిరుపతి కి చెందిన స్వప్న అలియాస్ హరిణి చౌదరి అనే మహిళ పెళ్లి కోసం మ్యాట్రిమోనీ వెబ్ సైట్ లో పేరు రిజిష్టర్ చేసుకుంది. ఆమె వివరాలు నచ్చిన ప్రకాశం జిల్లా వీరేపల్లికి చెందిన విప్పర్ల రామాంజనేయులు 2019 లో ఆమెను వివాహం చేసుకున్నాడు. రామాంజనేయులు డెన్మార్క్ లో పని చేస్తుంటాడు. పెళ్లైన నెల రోజులకు తన భార్య మ్యాట్రిమోని వెబ్ సైట్ లో పెట్టిన వివరాలు తప్పు అని తెలుసుకున్నాడు.
vipparla swapna గతంలోనే స్వప్నకు వివాహం అయిందని తెలుసుకుని ఆమెకు చెప్పకుండా డెన్మార్క్ వెళ్లి పోయాడు. దీంతో ఆమె దొనకొండ పోలీసు స్టేషన్ లో రామాంజనేయులుపై కేసు పెట్టింది. అత్తగారింటికి వెళ్లబోతే వారు రానీయలేదు. దీంతో ఆమె వీరేపల్లి గ్రామంలో నిరసన చేపట్టింది. రామాజంనేయుల తల్లి తండ్రులు కూడా స్వప్నపై కేసు పెట్టారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చెపట్టగా స్వప్న చేసిన మోసాలు ఒక్కోక్కటి వెలుగు చూశాయి.

తిరుపతిలో హాస్టల్ లో ఉండి ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటూ ఉండే స్వప్నకు మొదట మేనమావతో వివాహం జరిగింది. కోద్దిరోజులకు అతడ్ని వదిలేసి…. తిరుపతికి చెందిన పృధ్వీరాజ్ ను పెళ్లి చేసుకుంది. తనకెవరూ లేరని తాను అనాధనని చెప్పి పృధ్వీరాజ్ ను పెళ్లి చేసుకుంది. కొన్నాళ్లకు అతడితో గొడవపడి అతడిపై పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసి రూ. 25 లక్షలు డిమాండ్ చేసింది.

tirupati swapna

ఆతర్వాత జర్మనీ లో పనిచేసే ఆత్మకూరుకు చెందిన సుధాకర్ అనే వ్యక్తిని మ్యాట్రిమోనీ వెబ్ సైట్ ద్వారా పరిచయం చేసుకుంది. పెళ్లి జరిగే లోగా అతని వద్దనుంచి రూ.5 లక్షలు కాజేసింది.

swapna tirupati

ఆతర్వాత ప్రకాశం జిల్లా వీరేపల్లి రామాంజనేయులుతో పెళ్లి జరిగింది. తాను ఢిల్లీలో ఐపీఎస్ స్దాయి అధికారినని, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ దగ్గర పని చేస్తుంటానని రామాంజనేయులుకు పరిచయం చేసుకుని 2019,డిసెంబర్ 12, న వివాహం చేసుకుంది. రామాంజనేయులుకు భార్య వ్యవహారంపై అనుమానం వచ్చింది. ఆమె గురించి ఎంక్వైరీ చేయగా ఆమె చేసిన మోసాలు బయటపడటంతో ఆమెకు చెప్పకుండా డెన్మార్క్ వెళ్లిపోయాడు.

దీంతో వారిద్దరూ ఒకరిపై ఒకరు పోలీసు స్టేషన్లో కేసులు పెట్టుకోవటంతో నిత్యపెళ్లి కూతురు గుట్టు రట్టైంది. పతంగి స్వప్న, పతంగి హరిణి, నందమురారి స్వప్న అనే పేర్లతోనూ వివిధ రకాల హోదాలతోనూ ఆమె మ్యాట్రిమోనీ వెబ్ సైట్లలో తన ప్రొఫైల్ రిజష్టర్ చేసినట్లు దొనకొండ ఎస్ఐ ఫణిభూషణ్ తెలిపారు.