వాట్సప్ లో టెన్త్ పరీక్ష పేపర్ చక్కర్లు …. పరీక్ష క్యాన్సిల్ …ముగ్గురు అరెస్ట్

వాట్సప్ లో టెన్త్ పరీక్ష పేపర్ చక్కర్లు …. పరీక్ష క్యాన్సిల్ …ముగ్గురు అరెస్ట్

Updated On : February 20, 2021 / 9:32 PM IST

BSEB Class 10 Social Science Exam cancelled, due to paper leak, re-exam on march 8 : బీహార్‌ రాష్ట్రంలో జరుగుతున్న పదో తరగతి సోషల్‌ సైన్స్‌ పరీక్ష ప్రశ్న పత్రాన్ని లీకు చేసిన కేసులో పోలీసులు ముగ్గురు వ్యక్తులను అరెస్ట్‌ చేశారు. బీహార్‌​ స్కూల్‌ ఎగ్జామినేషన్ బోర్డు (బీఎస్‌ఈబీ) నిర్వహిస్తున్న పదో తరగతి పరీక్షల్లో భాగంగా ఫిబ్రవరి 19 శుక్రవారం రోజు సోషల్‌ సైన్స్‌ పరీక్షకు 8.46 లక్షలు మంది విద్యార్థులు హజరయ్యారు.

ఈ సమయంలో పరీక్ష పేపర్‌ లీకు అయినట్లు తెలియడంతో బోర్డు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసుల వివరాల ప్రకారం.. ఝాఝా ఎస్‌బీఐ బ్రాంచ్‌కు చెందిన వికాస్‌ కుమార్‌, మరో ఇద్దరు బ్యాంక్‌ సిబ్బంది పరీక్ష పేపర్‌ను లీక్‌ చేసినట్లు కనుగొన్నారు. ప్రధాన నిందితుడైన వికాశ్‌ కుమార్‌ బంధువులలో ఒకరు ఈ పరీక్షలు రాస్తుండగా పరీక్ష పేపర్‌ను లీకు చేసి వాట్సాప్‌ ద్వారా ప్రశ్నా పత్రాన్ని విద్యార్ధికి పంపించాడు.

బోర్డు ఫిర్యాదు మేరకు ఆ ముగ్గురిని అరెస్ట్‌ చేసి వారిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రశ్న పత్రం లీకు అయినట్లు తెలియడంతో బోర్డు పరీక్షను రద్దు చేసింది. ఈ పరీక్షను వచ్చే నెలలో, మార్చి 8వ తేదీన తిరిగి నిర్వహిస్తామని ప్రకటించింది. పోలీసులు దర్యాపు పూర్తి చేశారని, ఈ ఘటనకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని బీఎస్‌ఈబీ చైర్మన్‌ అనంద్‌ కిశోర్‌ తెలిపారు.