Casino Chikoti Praveen : చికోటి ప్రవీణ్‌..అలియాస్‌ క్యాసినో ప్రవీణ్‌..ఇది పేరే కాదు ఇట్స్ ఏ బ్రాండ్

ఆయన చుట్టూ మంత్రులు, ఎమ్మెల్యేలు. ఆయన ఏ కార్యక్రమం చేసినా ఫుల్‌ హడావుడి.. అటు బాలీవుడ్.. ఇటు టాలీవుడ్‌ .. అతడు పిలిస్తే ఎగురుకుంటూ వచ్చేస్తారు.. ప్రమోషన్లు సైతం చేస్తారు. పొలిటికల్ సపోర్ట్‌తో.. పవర్‌ఫుల్‌ క్యాసినో కింగ్ అయ్యాడు.. దేశాలు దాటించి జూదం ఆడిస్తూ కోట్లకు కోట్లు కూడబెట్టుకున్నాడు.. ఈడీ దాడులతో.. బయటకు వచ్చాయి చికోటి ప్రవీణ్ బిల్డప్‌ వెనుకున్న చీకటి కోణాలు. .

Casino Chikoti Praveen : చికోటి ప్రవీణ్‌..అలియాస్‌ క్యాసినో ప్రవీణ్‌..ఇది పేరే కాదు ఇట్స్ ఏ బ్రాండ్
ad

Casino Chikoti Praveen : ఆయన చుట్టూ మంత్రులు, ఎమ్మెల్యేలు. ఆయన ఏ కార్యక్రమం చేసినా ఫుల్‌ హడావుడి.. అటు బాలీవుడ్.. ఇటు టాలీవుడ్‌ .. అతడు పిలిస్తే ఎగురుకుంటూ వచ్చేస్తారు.. అంతేనా…. రండి.. బాబూ రండి.. అంటూ ప్రమోషన్లు సైతం చేస్తారు. అలా అనీ ఆయనేం పవర్‌ సెంటర్‌ కాదు.. జస్ట్‌ పత్తాలాడించే కామన్‌ మ్యాన్.. కానీ.. పొలిటికల్ సపోర్ట్‌తో.. పవర్‌ఫుల్‌ క్యాసినో కింగ్ అయ్యాడు.. దేశాలు దాటించి జూదం ఆడిస్తూ కోట్లకు కోట్లు కూడబెట్టుకున్నాడు.. ఈడీ దాడులతో.. బయటకు వచ్చాయి చికోటి బిల్డప్‌ వెనుకున్న చీకటి కోణాలు. .

డబ్బులున్న వారే ప్రధాన టార్గెట్‌గా చికోటి ప్రవీణ్‌ క్యాసినో ఈవెంట్లు నిర్వహిస్తాడు. జూదం పేరుతో కోట్లు కొల్లగొడతాడు. దేశం కాని దేశంలో.. రాష్ట్రం కాని రాష్ట్రంలో ఎక్కడైనా తన హవా నడిపించగలిగే సత్తా అతడిది. ఇంతలా అతడి హవా సాగడానికి అతని చుట్టూ కొంతమంది మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, డీసీసీబీ ఛైర్మన్లు ఉన్నారన్న ప్రచారం ఉంది. మనోడు ఎక్కడికెళ్లినా.. అక్కడ అన్ని పనులు వారి సాయంతోనే అలా చకచకా జరిగిపోతాయట. పొలిటీషియన్లు, సెలబ్రిటీలే.. అన్ని పనులు చక్కబెట్టేస్తారట. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు.. కోలీవుడ్ నుంచి శాండిల్‌వుడ్ వరకు.. చికోటి ప్రవీణ్‌ పేరు తెలియని హీరో, హీరోయిన్లు ఉండరేమో. ఈవెంట్‌కు రావాలని ఆయన పిలిస్తే.. రాని సెలబ్రేటిలు ఉండరంటే మనోడి సత్తా ఏంటో అర్థం చేసుకోవచ్చు. లగ్జరీ కార్లు, ఓపెన్‌ ఫార్మ్‌ హౌజ్‌లు.. లగ్జరీ పార్టీలు.. డబ్బుకు విలువివ్వని మైండ్ సెట్ అతడిది. అసలు తాము ఎంత సంపాదిస్తున్నామో.. తమ దగ్గర ఎంతుందో కూడా తెలియనంత సంపాదన. అది చికోటి ప్రవీణ్‌ రేంజ్.

Also read : Casino Chikoti Praveen : చికోటి ప్రవీణ్ తో వైసీపీ నేతలకు సంబంధాలు..నేపాల్ వెళ్లినవారిలో సగంమంది వారే

చికోటి ప్రవీణ్‌ ఒకప్పుడు పేకాట క్లబ్బులు నడిపించాడు. బేగంపేట, వనస్థలిపురం, సికింద్రాబాద్, జూబ్లీహిల్స్‌తో పాటు పలు ప్రాంతాల్లో సెలబ్రిటీల కోసమే క్యాసినోలు ఏర్పాటు చేసేవాడు. అలా ప్రారంభమైన అతడి క్యాసినో సామ్రాజ్యం… ఏకంగా విదేశాలకు పాకింది. పొలిటీషియన్స్‌తో ఉన్న పరిచయాలతోనే.. ప్రవీణ్‌ తన చీకటి వ్యాపారాన్ని ఫారిన్‌కు విస్తరించాడు. పత్తాలాడించే ఓ సామాన్య వ్యక్తి.. ఏకంగా స్పెషల్‌ ఫ్లైట్లలో విదేశాలకు తీసుకెళ్లి కోట్లలో క్యాసినోలు ఆడిస్తున్నాడంటే చికోటి ప్రవీణ్‌ రేంజ్‌ ఏంటో అర్థం చేసుకోవచ్చు.

క్యాసినో కింగ్ చికోటి ప్రవీణ్‌ అయితే… దాని మాస్టర్ మైండ్ అంతా మాధవరెడ్డిదే. వీరిద్దరూ కలిసి క్యాసినోలను నిర్వహిస్తుంటారు. చికోటి ప్రవీణ్‌కు మాధవరెడ్డి రైట్ లాగా వ్యవహరిస్తాడు. గోవాలో ప్రముఖ బిగ్‌డాడీ క్యాసినోలో వారిద్దరికీ వాటా ఉంది. క్యాసినో ఈవెంట్‌ ప్రోమోల్లోనూ ఇద్దరి పేర్లూ ఉంటాయి. జూన్‌ 10 నుంచి 13వరకు నేపాల్‌లోని జపా జిల్లా మోచీనగర్‌లో ఉన్న హోటల్‌ మోచీక్రౌన్‌లో ఆన్ ఇన్ ఈవెంట్ పేరుతో క్యాసినో నిర్వహించారు. 3 లక్షల రూపాయలు చెల్లిస్తే.. నాలుగు రోజుల పాటు ఫైవ్‌ స్టార్‌ హోటల్‌లో వసతితో పాటు మందు, విందు, సకల సౌకర్యాలుంటాయని ప్రచారం చేశారు. క్యాసినోలో తీన్‌ పత్తి, అందర్‌ బాహర్‌, మ్యారేజ్‌, బాక్రత్‌ లాంటి క్యాసినో ఆటలు ఆడొచ్చని ఊరించారు. నేపాల్‌లో ఈ ఈవెంట్‌ జరిగే ప్రాంతానికి.. పశ్చిమబెంగాల్‌ సిలిగురిలోని బాగ్‌డోగ్రా విమానాశ్రయం నుంచి కేవలం 20 నిమిషాల ప్రయాణం.

Also read : Casino Chikoti praveen : క్యాసినో చికోటి ప్రవీణ్‌ కేసు..మాధవరెడ్డి కారుపై మంత్రి మల్లారెడ్డి స్టిక్కర్..!

మొన్నటిదాకా శ్రీలంకలో క్యాసినో ఆడటానికి అలవాటుపడి.. అక్కడ సంక్షోభం వల్ల కొన్నాళ్లుగా దూరంగా ఉన్న పేకాటరాయుళ్లు .. వీళ్ల బుట్టలో పడ్డారు. హైదరాబాద్‌, వరంగల్‌, విశాఖపట్నం, విజయవాడ, భీమవరం, గుంటూరు, నెల్లూరు, ఏలూరుకు చెందిన దాదాపు 200 మంది ఈవెంట్‌లో పాల్గొన్నారు. వారందరినీ శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానాల్లో పశ్చిమబెంగాల్‌లోని బాగ్‌డోగ్రా విమానాశ్రయానికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి రోడ్డుమార్గంలో బస్సుల ద్వారా నేపాల్‌లోని మోచీక్రౌన్‌ హోటల్‌కు తరలించారు. అక్కడే దాదాపు 200 మంది జూదరులు నాలుగు రోజుల పాటు బసచేశారు. ఈ ఈవెంట్‌లో దాదాపు 15 మంది బాలీవుడ్‌, టాలీవుడ్‌తో పాటు నేపాల్‌ మోడళ్లతో డ్యాన్స్ లు వేయించారు. ఈ లిస్ట్‌లో అమీషా పాటేల్, ముమైత్‌ఖాన్, ఇషారెబ్బ, మల్లికా షెరావత్, సింగర్ జాన్సీరాజు ఉన్నారు.

అంతకుముందు క్యాసినో ఈవెంట్‌కు రావాలంటూ పలువురు బాలీవుడ్, టాలీవుడ్ స్టార్స్ సైతం ప్రమోషన్‌ చేశారు. ఈ వీడియోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారాయి. ఎన్ని తప్పులు చేసినా ఏదో ఒక రోజు అడ్డంగా బుక్కవడం కామన్. హైరేంజ్ లైఫ్‌ లీడ్ చేసే ప్రవీణ్‌ విషయంలో సరిగ్గా ఇదే జరిగింది. విదేశాల్లో క్యాసినో ఆడించే స్థాయికి ఎదిగిన చికోటి ప్రవీణ్‌ వ్యవహారాన్ని ఈడీ గుట్టురట్టు చేసింది. హైదరాబాద్‌లో భారత కరెన్సీని హవాలా రూపంలో అందించి.. నేపాల్, ఇండోనేషియాలో తరలిస్తున్నారన్న పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన ఈడీ అధికారులు.. చికోటీ ప్రవీణ్‌, మాధవరెడ్డి ఇళ్లల్లో తనిఖీలు చేశారు. సైదాబాద్‌ ఐఎస్‌సదన్, బోయిన్‌పల్లి, సిటీ శివారులోని కడ్తాల్.. ఇలా 8 ప్రాంతాల్లో దాదాపు 20 గంటల పాటు సోదాలు జరిగాయి. హవాలా ద్వారా వెళ్లిన నగదుకు సంబంధించి కీలక ఆధారాలు సేకరించారు. కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈడీ విచారణపై స్పందించిన చికోటి ప్రవీణ్‌… అధికారుల ముందే అంతా వివరిస్తానని చెప్పాడు.

హైదరాబాద్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలతో క్యాసినోవాలా చికోటి ప్రవీణ్‌ వ్యవహరం బట్టబయలైంది. సోదాల్లో కీలక డాక్యుమెంట్లు, క్యాసినోలతో చేసుకున్న ఒప్పందాలు, హవాలా మార్గంలో తెచ్చిన నగదుకు సంబంధించి ఆధారాలను ఈడీ స్వాధీనం చేసుకుంది. చికోటి ప్రవీణ్, ఆయన పార్ట్నర్‌ను సోమవారం విచారణకు రావాలని నోటీసులు ఇచ్చింది.