Uttar Pradesh: స్నేహితుడి అంత్యక్రియలు చేసి, చివరికి అదే చితిలో దూకాడు

నిజానికి అంత గొప్ప స్నేహం దొరకడం చాలా అరుదు కూడా. ప్రాణ స్నేహానికి నిర్వచనం చెప్పిన ఇద్దరు స్నేహితుల విషాద గాథ చోటు చేసుకుంది. తన ప్రాణ స్నేహితుడి మరణం తట్టుకోలేని ఒక వ్యక్తి తాను కూడా తనువు చాలించాడు. స్నేహితుడి చితి మంటల్లోనే దూకి చావులో కూడా తోడుగానే ఉన్నాడు.

Uttar Pradesh: స్నేహితుడి అంత్యక్రియలు చేసి, చివరికి అదే చితిలో దూకాడు

Agra: కొన్ని బంధాలు జీవితంపై చెరిగిపోని ముద్ర వేస్తాయి. అందులో స్నేహం ఒకటి. స్నేహం కోసం కొంతమంది ప్రాణమైనా ఇస్తారు. అదే స్నేహం దూరమైతే ప్రాణమైనా తీసుకుంటారు. నిజానికి ప్రాణాలు తీసుకోవడం సబబు కాదేమో కానీ, కొన్ని స్నేహాలు అంత వరకు వెళ్తాయి. నిజానికి అంత గొప్ప స్నేహం దొరకడం చాలా అరుదు కూడా. ప్రాణ స్నేహానికి నిర్వచనం చెప్పిన ఇద్దరు స్నేహితుల విషాద గాథ చోటు చేసుకుంది. తన ప్రాణ స్నేహితుడి మరణం తట్టుకోలేని ఒక వ్యక్తి తాను కూడా తనువు చాలించాడు. స్నేహితుడి చితి మంటల్లోనే దూకి చావులో కూడా తోడుగానే ఉన్నాడు.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన విషాధ ఘటన ఇది. పోలీసులు వివరాల ప్రకారం.. నాగ్లా ఖంగార్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్న అశోక్ (42) క్యాన్సర్‌తో బాధపడుతూ శనివారం ఉదయం మరణించాడు. అతని అంత్యక్రియలు అదేరోజు ఉదయం 11 గంటలకు యమునా ఒడ్డున జరిగాయి. అతని ప్రాణ స్నేహితుడు ఆనంద్(40) ఆ అంత్యక్రియలకు హాజరయ్యాడు. దహన సంస్కారం ముగించి అక్కడి నుంచి అందరూ బయలుదేరడం ప్రారంభించారు. అంతలోనే దారుణ ఘటన చోటు చేసుకుంది.

స్నేహితుడి మరణం తట్టుకోలేని ఆనంద్ అకస్మాత్తుగా కాలుతున్న స్నేహితుడి చితిలోకి దూకాడు. అది గమనించిన మిగతావారు అతన్ని అగ్ని నుండి బయటకు తీసి జిల్లా ఆసుపత్రికి తరలించారు. కానీ, తీవ్రంగా గాయాల పాలైన ఆనంద్ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆగ్రా మెడికల్ కాలేజీకి వైద్యులు రిఫర్ చేశారు. ఆగ్రాలోని మెడికల్ కాలేజీకి తరలిస్తుండగానే ఆనంద్ మార్గమధ్యలో మృతి చెందాడు.