పప్పులో మత్తుమందు కలిపి రూ.40లక్షలతో పారిపోయిన నేపాలీ గ్యాంగ్ కోసం హైదరాబాద్ పోలీసుల వేట

  • Published By: naveen ,Published On : October 8, 2020 / 12:28 PM IST
పప్పులో మత్తుమందు కలిపి రూ.40లక్షలతో పారిపోయిన నేపాలీ గ్యాంగ్ కోసం హైదరాబాద్ పోలీసుల వేట

nepali gang: హైదరాబాద్‌లో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న నేపాలీ గ్యాంగ్ కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. రాయదుర్గంలోని మధుసూదన్ రెడ్డి ఇంట్లో డిన్నర్ లో మత్తుమందిచ్చి మూడు రోజుల క్రితం దోపిడీకి పాల్పడింది. నేపాలీ గ్యాంగ్‌ను పట్టుకునేందుకు 8 బృందాలను ఏర్పాటు చేసిన పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. ఇంట్లో మనిషిగా ఉంటూ… యజమానికి మత్తుమందు ఇచ్చి చోరీకి పాల్పడ్డారు. ఇంట్లో సీసీటీవీ ఫుటేజ్ లభించకుండా దానికి సంబంధించిన వస్తువులను కూడా నేపాలీ గ్యాంగ్ తీసుకెళ్లింది.

ఇంట్లో పనికి కుదిరి.. భారీ చోరీ:
రాయదుర్గం బీఎన్నార్‌ హిల్స్‌ కాలనీలో బోర్‌వెల్‌ వ్యాపారం చేసే గూడూరు మధుసూదన్‌రెడ్డి (55) తన భార్య శైలజ (50), కుమారుడు నితీశ్‌రెడ్డి (35), కోడలు దీప్తిరెడ్డి (32), మనుమడు అయాన్‌రెడ్డి (5)తో కలిసి నివాసం ఉంటున్నారు. వీళ్ల ఇంట్లో నేపాల్‌కు చెందిన రాజేందర్‌ అలియాస్‌ రవి ఏడాది క్రితం హౌజ్‌ కీపింగ్‌ పనికి కుదిరాడు. అప్పటినుంచి నమ్మకంగా పనిచేశాడు. కొన్నిరోజుల తర్వాత రవి తన సోదరి సీతను తీసుకొచ్చి అదే ఇంట్లో హౌజ్‌కీపింగ్‌ పనికి కుదిర్చాడు. 15రోజుల క్రితం నేపాల్‌కు చెందిన మనోజ్‌, జానకి అనే ఇద్దరిని కూడా తీసుకొచ్చాడు. మనోజ్‌ హౌజ్‌ కీపింగ్‌కు, జానకి వంట పనికి కుదిరారు. వీరందరికీ ఇంటి సెల్లార్‌లో ఉన్న సర్వెంట్‌ క్వార్టర్‌ను మధుసూదన్‌రెడ్డి కేటాయించారు. పక్కా ప్లాన్‌తో ఇంట్లో చేరిన వీరు అదను కోసం వేచి చూశారు.

పప్పు, గ్రీన్ టీ లో మత్తుమందు కలిపి:
సోమవారం(అక్టోబర్ 5,2020) రాత్రి 8 గంటల ప్రాంతంలో మధుసూదన్‌రెడ్డి కుటుంబం కోసం పప్పు, చపాతీ చేశారు. పప్పులో మత్తుమందు కలిపారు. మధుసూదన్‌రెడ్డి భార్య పప్పు తినకపోవడంతో గ్రీన్‌ టీలో మత్తుమందు కలిపి ఇచ్చారు. మత్తుమందు కలిపిన పదార్థాలు తినడంతో మధుసూదన్‌రెడ్డి, నితీశ్‌రెడ్డి, దీప్తిరెడ్డి స్పృహ కోల్పోయారు. మత్తుమందు కలిపిన గ్రీన్‌ టీ తాగిన శైలజ మైకంతో పడిపోయారు.

రూ.15 లక్షల నగదు, 25 లక్షల విలువ చేసే బంగారంతో పరార్:
దీనికోసమే ఎదురుచూస్తున్న రవి, సీత, మనోజ్‌, జానకిలతోపాటు అక్కడికి వచ్చిన మరో ఇద్దరు కలిసి శైలజను కుర్చీలో తాళ్లతో కట్టేశారు. ఇంట్లో ఉన్న రూ.15 లక్షల నగదు సర్దేశారు. నితీశ్‌రెడ్డి బెడ్‌రూంలో ఉన్న లాకర్‌ తెరుచుకోకపోవడంతో దానిని సర్వెంట్‌ క్వార్టర్‌కు తీసుకొచ్చి పగులగొట్టారు. అందులో సుమారు 25 లక్షలు విలువచేసే బంగారు ఆభరణాలు ఉన్నాయి. రాత్రి 10 గంటల సమయంలో మెయిన్‌గేట్‌కు గడియపెట్టి పారిపోయారు.

మొత్తంగా రూ.40 లక్షల సొత్తు చోరీ:
మొత్తం రూ.40 లక్షల సొత్తు చోరీకి గురైంది. తెల్లవారుజామున మెలకువ వచ్చిన చిన్నారి అయాన్‌ రెడ్డి.. శైలజ కట్లు విప్పడంతో ఆమె తన బంధువులకు సమాచారం అందించారు. అప్పటికీ స్పృహ కోల్పోయే ఉన్న మధుసూదన్‌రెడ్డి, నితీశ్‌రెడ్డి, దీప్తిరెడ్డిని ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.

ఏడాది పాటు నమ్మకంగా పని చేస్తారు, ఇంట్లో వాడిగా కలిసిపోతారు, అదను చూసి చోరీ చేస్తారు:
హడావుడిగా రాత్రుళ్లు కన్నాలేసి ఏం సాధిస్తామనుకున్నాడో ఏమో. దోచుకుంటే పక్కా ప్రణాళికతో భారీగా ఉండాలనుకున్నాడేమో. అందుకే.. ఒక ఇంటిని ఏడాదిపాటు టార్గెట్‌గా పెట్టుకున్నాడు. ఆ ఇంట్లో పనికి కుదిరి.. నమ్మకస్థుడిగా మెలిగాడు. మరికొందరిని పనికి కుదిర్చి.. ‘ఓ మంచి పనోడు..’ అని ఇంటిల్లిపాదితో అనిపించుకున్నాడు. తనను పూర్తిగా నమ్మారని అనిపించిన తర్వాత అసలు పని మొదలుపెట్టాడు.

ఓ మంచిరోజు చూసి.. అప్పటికే తాను పనికి కుదిర్చినవారితో కలిసి.. పన్నాగం అమలు చేశాడు. భోజనంలో మత్తుమందు కలిపి ఇంట్లో వారికి పెట్టాడు. వారు స్పృహ కోల్పోగానే.. నగలు.. నగదు మూటకట్టుకుని తోటి దొంగలతో కలిసి ఉడాయించాడు. రాయదుర్గం బీఎన్నార్ హిల్స్ లో నివాసం ఉండే ఓ బోర్‌వెల్‌ వ్యాపారి ఇంట్లో నేపాలీగ్యాంగ్‌ చేసిన ఘరానా చోరీ ఇది.