వృద్దులూ జాగ్రత్త.. కరోనా టీకా పేరుతో ఘరానా మోసం

వృద్దులూ జాగ్రత్త.. కరోనా టీకా పేరుతో ఘరానా మోసం

nurse cheat corona vaccine: హైదరాబాద్‌లోని మీర్‌పేట్‌లో దారుణం జరిగింది. కరోనా టీకా పేరుతో ఓ నర్సు ఘరానా మోసానికి పాల్పడింది. వృద్ద దంపతులను అడ్డంగా చీట్ చేసింది. మాయమాటలు చెప్పి మత్తుమందు ఇచ్చి ఉన్నదంతా ఊడ్చుకుని పరారైంది. కరోనా టీకా అని నమ్మించి దొంగతనానికి పాల్పడింది.

మీర్‌పేట పోలీస్ స్టేషన్‌ పరిధిలోని లలితానగర్‌లో కస్తూరి(70), లక్ష్మణ్‌(80) దంపతులు నివాసం ఉంటున్నారు. లక్ష్మణ్ ఎలక్షన్‌ కమిషన్‌ స్టేట్‌ ఆఫీస్‌లో అకౌంటెట్‌గా పని చేసి రిటైర్ అయ్యారు. వికారాబాద్‌కు చెందిన విజయ్‌, అనూష దంపతులు మూడు నెలల క్రితం దాకా వారి పక్కింట్లో అద్దెకు ఉండేవారు. ఆ తర్వాత పక్క కాలనీలోకి మారారు. అనూష (21) కొన్నాళ్లపాటు ఓ ప్రైవేటు ఆస్పత్రిలో నర్సుగా పని చేసి మానేసింది. ప్రస్తుతం బీఫార్మసీ చదువుతోంది. అప్పుడప్పుడు ఆమె లక్ష్మణ్ ఇంటికి వచ్చేది. తెలిసిన వ్యక్తి కావడంతో అనూషని బాగా నమ్మారు లక్ష్మణ్ దంపతులు.

కాగా, కుటుంబ ఖర్చులకు సరిపడా ఆదాయం లేకపోవడంతో అనూష బుద్ది తప్పింది. ఆమెకి దొంగ బుద్ది పుట్టింది. కస్తూరి ఒంటి మీదున్న నగలపై ఆమె కన్నుపడింది. ఎలాగైనా కాజేయాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం స్కెచ్ వేసింది.

శుక్రవారం వారి ఇంటికి వెళ్లిన అనూష.. తాను గర్భవతినని చెప్పి ఇద్దరికీ మత్తు మందు కలిపిన పాయసం ఇచ్చింది. అయితే.. వారికి షుగర్‌ ఉండడంతో దానిని తినలేదు. దీంతో అనూష ప్లాన్ ఫెయిల్ అయ్యింది. ఆమె రెండో ప్లాన్ వేసింది. శనివారం సాయంత్రం మరోసారి వారి వెళ్లి, ఉచితంగా కొవిడ్‌ వాక్సిన్‌ ఇస్తానని నమ్మించింది. తెలిసిన వ్యక్తి కావడం, పైగా తమ మేలు కోరి వ్యాక్సిన్ ఇస్తానంటోంది కదా అని.. దంపతులు అనూష మాటలను నమ్మేశారు.

కాగా, టీకా పేరుతో అనూష వారిద్దరికి మత్తు ఇంజక్షన్‌ ఇచ్చింది. వారు అపస్మారక స్థితికి చేరుకోగానే కస్తూరి ఒంటిపై ఉన్న 8 తులాల బంగారు నగలు అపహరించుకుని ఉడాయించింది. రెండు గంటల తర్వాత స్పృహలోకి వచ్చిన దంపతులు జరిగిన మోసాన్ని గుర్తించి షాక్ తిన్నారు. ఆ వెంటనే మీర్‌పేట్‌ పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు గంటల వ్యవధిలోనే అనూషను అదుపులోకి తీసుకున్నారు. ఆమె నుంచి నగలు స్వాధీనం చేసుకున్నారు.

లక్ష్మణ్ దంపతులకు ఇద్దరు కుమారులు. ఒకరు దుబాయ్‌లో, మరొకరు బెంగళూరులో జాబ్‌ చేస్తున్నారు. దంపతులు మాత్రమే ఇక్కడ ఉంటున్నారు. ఇదే అదనుగా అనూష దారుణానికి ఒడిగట్టింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు ఓ హెచ్చరిక జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. కరోనా వ్యాక్సిన్ పేరుతో మోసాలు జరుగతున్నాయని, జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. ఎవరిని పడితే వారిని నమ్మొద్దన్నారు. మరీ ముఖ్యంగా వృద్ధులు చాలా కేర్ ఫుల్ గా ఉండాలన్నారు.