Fake Currency Gang : ఏం తెలివి.. యూట్యూబ్‌లో చూసి దొంగ నోట్ల తయారీ.. హైటెక్ ముఠా అరెస్ట్

యూట్యూబ్ లో వీడియోలు దొంగ నోట్లు తయారు చేస్తున్న హైటెక్ ముఠా గుట్టురట్టు చేశారు సికింద్రాబాద్ పోలీసులు. ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు.

Fake Currency Gang : ఏం తెలివి.. యూట్యూబ్‌లో చూసి దొంగ నోట్ల తయారీ.. హైటెక్ ముఠా అరెస్ట్

Fake Currency Gang : కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. ఈజీ మనీ కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. కరెన్సీని అడ్డం పెట్టుకుని కరెన్సీ సంపాదించేస్తున్నారు. అదెలా? అనే సందేహం వచ్చింది కదూ. దొంగ నోట్లు ముద్రణ ద్వారా. నకిలీ కరెన్సీ ముద్రించి వాటిని మార్కెట్ లో చెలామణి చేసి డబ్బు సంపాదిస్తున్నారు కొందరు కంత్రీగాళ్లు. తాజాగా మరో దొంగ నోట్ల తయారీ ముఠా పోలీసులకు చిక్కింది.

దొంగ నోట్లు తయారీ చేసి చెలామణి చేస్తున్న ముఠా గుట్టురట్టు చేశారు సికింద్రాబాద్ పోలీసులు. ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. కాళీ మందిర్ ప్రాంతంలో దొంగనోట్లు తయారు చేస్తున్న ముఠా మార్కెట్ లో మార్పిడి చేస్తోంది. అయితే ఓ పండ్ల వ్యాపారికి అనుమానం రావడంతో ముఠా గుట్టు రట్టైంది. వారిని అరెస్ట్ చేసిన పోలీసులు విచారణలో షాకింగ్ నిజాలు తెలుసుకున్నారు. యూట్యూబ్ లో వీడియోలు చేసి దొంగ నోట్లను తయారు చేస్తున్నట్లు తెలుసుకుని విస్తుపోయారు పోలీసులు.

హబ్సిగూడ, గోపాలపురం పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ నోట్లను చెలామణి చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. యూట్యూబ్ లో వీడియోలు చూసి ఫేక్ కరెన్సీ తయారు చేస్తున్నారు. నకిలీ కరెన్సీ గురించి సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. పక్కా ప్లాన్ ప్రకారం గ్యాంగ్ ను పట్టుకున్నారు. నకిలీ కరెన్సీ తయారు చేస్తున్న కేటుగాళ్లు.. రద్దీ ప్రాంతాలు, మార్కెట్లలో చిరు వ్యాపారులను లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఓ చిరు పండ్ల వ్యాపారికి వంద రూపాయలు నోటు ఇవ్వగా ఆయనకు అనుమానం వచ్చింది. అంతే, వెంటనే పోలీసులను సంప్రదించాడు.

వ్యాపారి సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు నకిలీ కరెన్సీ తయారు చేస్తున్న గ్యాంగ్ ను అదుపులోకి తీసుకున్నారు. నిందితులంతా కాళీ మందిర్ ప్రాంతానికి చెందిన వారు. దొంగ నోట్లు ముద్రించి అంజయ్య అనే వ్యక్తి ద్వారా సికింద్రాబాద్ ప్రాంతంలో ఫేక్ కరెన్సీని చెలామణి చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వలపన్ని గ్యాంగ్ ను పట్టుకున్నారు.

టెక్నాలజీని మంచి పనుల కోసం కాకుండా ఇలా దుర్వినియోగం చేస్తుండటం ఆందోళన కలిగించే విషయం. యూట్యూబ్ లో వీడియోలు చూసి విజ్ఞానం పెంచుకోవాలి. మంచికి ఉపయోగించాలి. పది మందికి ఉపయోగపడే పనులు చేస్తే సంతోషమే. కానీ, ఈజీ మనీ కోసం కొందరు వ్యక్తులు.. టెక్నాలజీని ఇలాంటి చెడ్డ పనులకు వాడుకోవడం ఆందోళనకు గురి చేస్తోంది.