Uttar Pradesh : లఖింపూర్ ఘటనపై యూపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
లఖింపూర్ ఘటనపై సుప్రీం కోర్టు విచారణ కంటే ముందే యూపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రిటైర్డ్ న్యాయమూర్తితో విచారణ కమిషన్ ఏర్పాటు చేసింది.

Up
Lakhimpur incident : లఖింపూర్ ఘటనపై సుప్రీం కోర్టు విచారణ కంటే ముందే యూపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రిటైర్డ్ న్యాయమూర్తితో విచారణ కమిషన్ ఏర్పాటు చేసింది. అలహాబాద్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ప్రదీప్‌కుమార్‌తో విచారణ జరపనుంది. లఖింపూర్ కేంద్రంగా విచారణ జరిగేలా ఏర్పాట్లు చేసింది. రెండు నెలల్లో కమిషన్ విచారణ పూర్తి చేయనుంది. లఖింపూర్ రైతుల మరణంపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న వేళ ఈ ఘటనపై కాసేపట్లో సుప్రీం విచారణ జరపనుంది.
కేసును సుమోటోగా విచారణకు స్వీకరించిన సుప్రీం వాదనలు వినేందుకు సిద్ధమైంది. చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం లఖింపూర్ కేసుపై విచారణ చేపట్టనుంది. 8 మంది ప్రాణాలను బలిగొన్న హింసాత్మక ఘటనలపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని కోరుతూ ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఇద్దరు న్యాయవాదులు సీజేఐ జస్టిస్ రమణకు లేఖ రాశారు.
దీనిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి కేసు దర్యాప్తు చేపట్టేలా కేంద్రహోంశాఖకు ఆదేశాలు జారీ చేయాలని, ఈ హింసాత్మక ఘటనలకు బాధ్యులైన వారికి చట్టపరంగా శిక్షపడేలా చూడాలని వారు కోరారు. ఈ లేఖను పరిగణనలోకి తీసుకొని సుప్రీంకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించింది. అటు ఈ ఘటనపై యూపీ ప్రభుత్వాన్ని ప్రతిపక్ష పార్టీలు దుమ్మెతిస్తుండగా.. కేంద్ర ప్రభుత్వం కూడా మౌనాన్ని పాటిస్తోన్న సందర్భంలో సుప్రీంకోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుందోనన్నది ఆసక్తిగా మారింది.
ఈ కేసు విచారణపై అటు ప్రతిపక్ష పార్టీలతో పాటు యావత్ దేశం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. సాగు చట్టాలకు వ్యతిరేకంగా నిరసన చేస్తోన్న రైతులను కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కొడుకు ఆశిష్ మిశ్రా కారు ఢీకొట్టడం.. నలుగురు రైతులు ప్రాణాలు కోల్పోవడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.