Tamilnadu Encounter : ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు రౌడీ షీటర్లు మృతి

తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు రౌడీ షీటర్లు మరణించారు. చెంగల్పట్టు జిల్లాలోని ఉత్తిరమేరూర్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

Tamilnadu Encounter : ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు రౌడీ షీటర్లు మృతి

Tamilnadu Encounter

Tamilnadu Encounter :  తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు రౌడీ షీటర్లు మరణించారు. చెంగల్పట్టు జిల్లాలోని ఉత్తిరమేరూర్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతులిద్దరూ మొయిద్దీన్, దినేష్ లు హత్యకేసులో నిందితులు. హత్య జరిగిన 12 గంటల్లోపే పోలీసులు నిందితులను మట్టుబెట్టారు.చాలాకాలం తర్వాత రాష్ట్రంలో ఎన్ కౌంటర్ జరిగింది.

వివరాల్లోకి  వెళితే చెంగల్పట్టు కేకే వీధికి చెందిన కార్తీక్ అలియాస్ అప్పు కార్తీక్ (30) గురువారం రాత్రి 7గంటల సమయంలో పాత బస్ టెర్మినల్  వద్ద ఉన్న టీస్టాల్ లో టీ తాగేందుకు వెళ్లాడు. ఆ సమయంలో ముగ్గురు వ్యక్తులు అతడ్ని మోటారు సైకిల్ పై వెంబడించి నాటు బాంబులు వేసి, వేట కొడవళ్లతో దారుణంగా నరికి హత్య చేశారు. ఈ దాడిలో కార్తీక్ తల ఛిద్రమయ్యింది.

అనంతరం దుండగులు మేట్టువీధిలోని శ్రీనివాసన్ అనే వ్యక్తి ఇంటిలోకి వెళ్ళి టీవీ చూస్తున్న అతడి కుమారుడు మహేష్(22) ను వేట కొడవళ్లతో నరికి చంపారు. ఈ రెండు ఘటనలు స్వల్ప వ్యవధిలో జరగటంతో జిల్లాలో ఉద్రిక్త  పరిస్ధితులు నెలకొన్నాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్ధలానికి వచ్చి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితులను మొయిద్దీన్, దినేష్,మాధవన్ లుగా గుర్తించారు.

జిల్లా ఎస్పీ అరవిందన్, ఇనస్పెక్టర్ రవి నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. మృతులు కార్తీక్, మహేష్ ఇద్దరూ బంధువులు అని… కూరగాయల వ్యాపారం చేస్తూ ఉంటారని పోలీసులు తెలిపారు. పాతకక్షల నేపధ్యంలో ఈ హత్యలు జరిగినట్లు పోలీసులు తెలిపారు. నిందితులు, బాధితులపై రౌడీ షీట్లు, పాత నేరస్తులుగా పోలీసుల తెలిపారు.  నిందితుల కోసం  గాలింపు చేపట్టిన పోలీసులు మాధవన్‌ను కాంచీపురం జిల్లా తిరుపులివనం దగ్గర ప్రియురాలు జెస్సీకా ఇంట్లో ఉండగా గురువారం అర్ధరాత్రి పోలీసులు ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు.
Also Read : TTD Oriental College : నా మాట వింటే పాస్ చేస్తా.. టీటీడీ కాలేజీలో కామాంధుడు.. ఆడియో లీక్
వారిచ్చిన సమాచారంతో మరో ఇద్దరు నిందితులు మొయుద్దీన్, దినేష్ లు తిరుపులివనం అటవీ ప్రాంతంలో తలదాచుకున్నట్లు తెలుసుకుని  గాలింపుకు బయలు దేరారు. తెల్లవారుఝూమున ఇద్దరు నిందితులను గుర్తించి లొంగిపొమ్మని హెచ్చరించగా పోలీసులపై నిందితులు  నాటుబాంబులు వేసి పారిపోవటానికి ప్రయత్నించారు. పోలీసులు  జరిపిన కాల్పుల్లో ఇద్దరు నిందితులు మరణించారు.

ఈ ఘటనలో ఇద్దరు పోలీసులకు గాయాలయ్యాయి. వీరిని చెంగల్పట్టు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నిందుతుల మృతదేహాలను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. నిందితులు ఇద్దరూ పాత నేరస్తులేనని… వారిపై కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. జంట హత్యల వెనుక కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.