ఏపీలో 10వ తరగతి పరీక్షలు వాయిదా, బయటకు వస్తే కేసులు

  • Published By: veegamteam ,Published On : March 24, 2020 / 11:51 AM IST
ఏపీలో 10వ తరగతి పరీక్షలు వాయిదా, బయటకు వస్తే కేసులు

ఏపీలో 10వ తరగతి పరీక్షలు వాయిదా పడ్డాయి. టెన్త్ క్లాస్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు మంత్రి పేర్ని నాని తెలిపారు. లాక్ డౌన్ కారణంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని చెప్పారు. మంగళవారం(మార్చి 24,2020) మీడియాతో మంత్రి మాట్లాడారు. కొత్త పరీక్షల తేదీలను త్వరలోనే ప్రకటిస్తామన్నారు. అలాగే ఎంసెట్, ఐసెట్ ఆన్‌లైన్ దరఖాస్తుల గడువునూ పొడిగించారు. ఎంసెట్ కు ఏప్రిల్ 5వ తేదీ వరకు, ఐసెట్ కు ఏప్రిల్ 9వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తుకు ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. లాక్ డౌన్ కారణంగా ఇంటర్ పరీక్షల వాల్యుయేషన్ కూడా వాయిదా వేసింది ప్రభుత్వం. షెడ్యూల్ ప్రకారం మార్చి 31వ తేదీ నుంచి ఏపీలో టెన్త్ పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉంది.

మార్చి 31వరకు లాక్ డౌన్:
కరోనా వైరస్ వ్యాప్తి కట్టడికి ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మార్చి 31వ తేదీ వరకు లాక్ డౌన్ ప్రకటించింది. కరోనా వైరస్ తీవ్రత అధికంగా ఉన్న ఈ పరిస్థితుల్లో టెన్త్ క్లాస్ పరీక్షలు నిర్వహించడం సమంజసం కాదని ప్రభుత్వం నిర్ణయించింది. పిల్లల విషయంలో రిస్క్ తీసుకోవడం కరెక్ట్ కాదని భావించిన ప్రభుత్వం పరీక్షలను వాయిదా వేసింది. తెలంగాణ రాష్ట్రంలోనూ టెన్త్ పరీక్షలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. హైకోర్టు ఆదేశాలతో ప్రభుత్వం టెన్త్ పరీక్షలు వాయిదా వేసింది.

తెలంగాణలోనూ టెన్త్ పరీక్షలు వాయిదా:
మార్చి 23వ తేదీ నుంచి ఏపీలో టెన్త్ పరీక్షలు నిర్వహించాలని తొలుత ప్రభుత్వం భావించింది. ఇంతలో స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చాయి. దీంతో టెన్త్ పరీక్షల షెడ్యూల్ ను 23వ తేదీ నుంచి మార్చి 31వ తేదీకి మార్చారు. ఇప్పుడు కరోనా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో మరోసారి టెన్త్ పరీక్షలు వాయిదా వేసింది ప్రభుత్వం. మార్చి 31 తర్వాత పరిస్థితులను సమీక్షించి తదుపరి తేదీలను ఖరారు చేయనున్నారు. 

బయటకు వస్తే కేసులు:
కరోనాను అరికట్టేందుకు పౌరులు సీరియస్ గా పోరాడాలని మంత్రి పేర్ని నాని అన్నారు. విదేశాల నుంచి వస్తే 14 రోజులు క్వారంటైన్ తప్పనిసరి అని చెప్పారు. లాక్ డౌన్ నిబంధనలు పాటించని వారిపై సెక్షన్ 158 కింద కేసులు పెడతామని మంత్రి వార్నింగ్ ఇచ్చారు. అత్యవసరం అయితేనే ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలన్నారు. అనవసరంగా బయటకు వస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. కరోనా నేపథ్యంలో గుంటూరు మిర్చియార్డును మూసివేశామన్నారు. రైతు బజార్లలో ప్రజలు సామాజిక దూరం పాటించాలని మంత్రి కోరారు. కరోనా నిరోధంలో గ్రామ వాలంటీర్లు కీలక పాత్ర పోషిస్తున్నారని మంత్రి చెప్పారు. సమాచార సేకరణలో వాలంటీర్లు పకడ్బందీగా పని చేస్తున్నారని చెప్పరు. విదేశాల నుంచి వచ్చిన వారి గుర్తింపులో వాలంటీర్లు కీలక పాత్ర పోషిస్తున్నారని మంత్రి వివరించారు.

Also Read | ప్రపంచమంతా లాక్ డౌన్…వైరస్ వెలుగులోకి వచ్చిన వూహాన్ లో ప్రయాణ ఆంక్షలు ఎత్తివేత!