APPSC Group 2 : 446 పోస్టులు..మే 5 పరీక్ష

  • Published By: madhu ,Published On : May 1, 2019 / 01:26 AM IST
APPSC Group 2 : 446 పోస్టులు..మే 5 పరీక్ష

ఏపీలో గ్రూప్ 2 ప‌రీక్షను నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది APPSC. వివిధ శాఖ‌ల్లో ఖాళీగా ఉన్న 446 పోస్టుల‌ భ‌ర్తీకి ఈ ప‌రీక్ష నిర్వహిస్తున్నారు. మెన్నటి పంచాయితీ కార్యద‌ర్శుల ప‌రిక్ష నిర్వహ‌ణ‌లో జ‌రిగిన త‌ప్పులు ఈ సారి జ‌ర‌గ‌కుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఎపీపీఎస్సీ అధికారులు.  మే 5వ తేదీ గ్రూప్ 2 ప‌రీక్ష నిర్వహించేందుకు APPSC ఏర్పాట్లు పూర్తి చేసింది. వివిధ శాఖ‌ల్లో ఖాళీగా ఉన్న 446 పోస్టుల భర్తీకి గతేడాది డిసెంబర్‌లో నోటిఫికేషన్‌ విడుద‌ల చేసింది. ఇప్పటికే ప‌రీక్ష అల‌స్యమైంద‌ని భావిస్తున్న ఏపీపీఎస్సీ ఇక వాయిదా వేసే ప్రసక్తి లేదంటుంది. కొంత మంది అభ్యంత‌రం వ్యక్తం చేసినా అనుకున్నట్లు ప‌రీక్ష నిర్వహిస్తామంటున్నారు ఏపీపీఎస్సీ అధికారులు. 

రాష్ట్రవ్యాప్తంగా గ్రూప్ 2 ప‌రీక్షకు 2 ల‌క్షల 95 వేల 36 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. పరీక్ష నిర్వహణ కోసం 727 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. 446 పోస్టుల్లో 154 ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు ఉన్నాయి. మిగిలిన‌వన్నీ నాన్ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులే. ఈ పరీక్ష OMR షీట్‌ విధానంలో జరగనుంది. తప్పు సమాధానాలకు 1/3 నెగెటివ్‌ మార్కులు కూడా ఉంటాయి.

అభ్యర్థుల‌ హాల్‌టికెట్లు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. అయితే..పంచాయితీ కార్యద‌ర్శి ప‌రీక్షలో త‌లెత్తిన స‌మ‌స్యల‌ను దృష్టిలో ఉంచుకుని ఈసారి అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు అధికారులు. ఓఎమ్మార్‌ షీట్‌ను నింపే విష‌యంలో గ‌త ప‌రీక్షలో అభ్యర్థులు త‌ప్పులు చేశార‌ని.. ఈసారి అలా జ‌ర‌గ‌కుండా జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు అధికారులు. ఇక ప్రిలిమ్స్‌లో నిర్దేశిత కటాఫ్‌ మార్కులు సాధించినవారిని వారి రిజర్వేషన్లకు అనుగుణంగా 1:12 నిష్పత్తిలో మెయిన్స్‌ పరీక్షలకు ఎంపిక చేస్తారు. మెయిన్స్ ప‌రీక్ష జూలై 18,19 తేదిల్లో జ‌ర‌గ‌నుంది.