AP SSC Results 2024 : ఈ నెల 22నే ఏపీ టెన్త్ ఫలితాలు.. స్కూళ్లకు సెలవులపై కీలక ఆదేశాలు
AP SSC Results 2024 : ఈ నెల 22న ఏపీ టెన్త్ ఫలితాలు విడుదల కానున్నాయి. స్కూళ్లకు సెలవులపై ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలను జారీ చేసింది.

AP SSC Results 2024 to be released on April 22nd And Summer Holidays Official notice here
AP SSC Results 2024 : ఏపీ టెన్త్ పరీక్షా ఫలితాలు ఈ నెల 22న వెల్లడి కానున్నాయి. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఏప్రిల్ 22న ఉదయం 11 గంటలకు విజయవాడలోని గేట్వే హోటల్లో విద్యాశాఖ కమిషనర్ సురేశ్ పదో తరగతి ఫలితాలను విడుదల చేస్తారని ప్రకటించింది. మార్చి 18 నుంచి మార్చి 30 వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహించగా.. దాదాపు 6.30 లక్షలకు పైగా విద్యార్థులు హాజరయ్యారు. ఎస్ఎస్‌సీ బోర్డులో పరీక్షా ఫలితాలను విద్యార్థులు నేరుగా చెక్ చేసుకునేందుకు ఏర్పాట్లు చేశారు.
ఏపీలో టెన్త్ ఫలితాలు చెక్ చేయాలంటే? :
- టెన్త్ పరీక్షా ఫలితాల కోసం అధికారిక వెబ్‌సైట్ (https://www.bse.ap.gov.in) వెళ్లాలి.
- ‘AP SSC Results 2024’ లింక్‌పై క్లిక్ చేయండి.
- హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేసి Submit బటన్‌పై క్లిక్ చేయండి.
- పరీక్షా ఫలితాలు, మార్కులు స్ర్కీన్‌పై కనిపిస్తాయి.
- టెన్త్ మెమోను డౌన్‌లోడ్ చేసి ప్రింట్ పొందవచ్చు.
స్కూళ్లకు సెలవులపై కీలక ఆదేశాలు :
మరోవైపు.. స్కూళ్లకు సెలవులపై కూడా ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలను జారీ చేసింది. ఇప్పటికే, వేసవి సెలవులు ఈ నెల 24 నుంచి జూన్ 11 వరకు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ వేసవి సెలవుల సమయాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకునేలా విద్యాశాఖ ‘సెలవుల్లో సరదాగా-2024’ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.
విద్యార్థుల కోసం వేసవి కోచింగ్ క్యాంపులు నిర్వహించాలని పీఈటీలను ఆదేశించింది. అలాగే, విద్యార్థుల్లో పఠనాశక్తిని పెంపొందించడానికి టీచర్లు, హెచ్ఎమ్‌లు ‘వుయ్ లవ్ రీడింగ్’ పోటీలు నిర్వహించాలని ఆదేశాల్లో పేర్కొంది. వివిధ స్వచ్ఛంద సంస్థలు, విద్యా సంస్థలు, స్థానిక కమ్యూనిటీల సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించాలని సూచించింది. వేసవి సెలవుల తర్వాత జూన్ 12న పాఠశాలలు పున:ప్రారంభం కానున్నాయి.