సర్కారీ కొలువులకు డిమాండ్ : చిన్న పోస్టులకు పెద్ద చదువులు

  • Published By: veegamteam ,Published On : April 14, 2019 / 02:38 PM IST
సర్కారీ కొలువులకు డిమాండ్ : చిన్న పోస్టులకు పెద్ద చదువులు

దేశంలో నిరుద్యోగం ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిన్న క్లర్క్‌ ఉద్యోగం కోసం లక్షల మంది దరఖాస్తు చేయడం చూస్తూనే ఉన్నాం. ప్రభుత్వోద్యోగం అంటే ఏ స్థాయిలో పోటీ ఉటుందో చెప్పక్కర్లేదు. తెలంగాణ ప్రభుత్వం వరుసగా ఖాళీలు భర్తీ చేస్తుండటంతో… పది చదివినోళ్లు.. పీజీ చేసినోళ్లు… చదువుతో సంబంధం లేకుండా సర్కారీ కొలువుల కోసం పోటీ పడుతున్నారు. తెలంగాణలో సర్కారీ కొలువులకు డిమాండ్ బాగా పెరిగింది. డిగ్రీ పూర్తవగానే గవర్నమెంట్ జాబ్ టార్గెట్ పెట్టుకుని కొందరు ప్రిపేర్ అవుతూ కొలువులు కొట్టేస్తున్నారు. మరికొందరు ఉన్నత చదువులు చదివినా… ఆ స్థాయికి తగ్గ ఉద్యోగాలు రాకపోవడంతో… చిన్న పోస్ట్ అయినా ప్రభుత్వ ఉద్యోగానికి పోటీ పడుతున్నారు. 

ఇంటర్ అర్హతతో కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేస్తే… దరఖాస్తు చేసుకున్న వారిలో పీజీ, ఎంఫిల్, పీహెచ్‌డీ, ఎంటెక్ చేసిన అభ్యర్థులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. 4లక్షల 49వేల 439మంది డిగ్రీ చేసినవాళ్లుంటే… 372 మంది దరఖాస్తుదారులు పీహెచ్‌డీ పూర్తి చేసారు. ఇక ఎంఫిల్ చేసినవారు 539మందున్నారు. ఇక పీజీ కంప్లీట్ చేసినవారిలో లక్షా 51వేల 735మంది కానిస్టేబుల్ పోస్టులకు పోటీ పడ్డారు. అటు ఎస్ఐ ఉద్యోగాల తుది పరీక్ష కోసం ఎంపికైనవారిలో ఇంజనీరింగ్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నవారే సుమారు 4వేల మంది ఉన్నారు. ఎంటెక్ చేసినవారు 19వందల మంది అప్లై చేశారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో బీటెక్ కంప్లీట్ అయిన వెంటనే ప్రైవేట్ జాబ్ దొరకడం కూడా కష్టంగా మారింది. ఒక వేళ దొరికినా.. 30నుంచి 40వేల జీతం కూడా దాటడం లేదు. అదే ఎస్ఐ ఉద్యోగం అయితే.. కనీసం 45వేల రూపాయల వేతనం ఉఁది. అలాగే… యూనిఫామ్ సర్వీస్ కావడంతో.. పోలీసు ఉద్యోగాల పట్ల యువతలో క్రేజ్ పెరుగుతోంది. 

అటు వీఆర్వో, పంచాయతీ కార్యదర్శి ఉద్యోగాలకు సైతం ఉన్నత విద్యావంతులు క్యూ కట్టారు. పంచాయతీ కార్యదర్శి పోస్టుకు డిగ్రీ అర్హత ఉండగా… బీటెక్ చేసినవారు 19వేల 621మంది,  ఎంటెక్ చేసిన వారు వేయిమంది, పీహెచ్‌డీ చేసిన ఐదుగురు  అప్లై చేశారు. ఇక ఎంబీఏ, ఎంసీఏ లాంటి ప్రొఫెషనల్ కోర్సులు చదివిన 26వేల 420మంది కూడా పోటీ పడ్డారు. వీఆర్వో పోస్టులకు కూడా పీహెచ్‌డీ చేసినవారు 34 మంది..ఇంజనీరింగ్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న అభ్యర్థులు 24వేల 340 మంది అప్లై చేశారు. గ్రూప్ వన్, గ్రూప్ టూ నోటిఫికేషన్లకు ఆలస్యం కావడం… వయోపరిమితి దాటిపోయే అవకాశం ఉండటంతో.. చిన్న ఉద్యోగాలకు సైతం భారీగా పోటీ ఉంటోంది. చదివిన చదువుకూ.. చేసే ఉద్యోగానికి సంబంధం లేదన్నట్లుగా పరిస్థితి మారిపోయింది.