సచివాలయ పరీక్షలకు ఏర్పాట్లు : బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో హెల్ప్ డెస్క్‌లు

  • Published By: madhu ,Published On : August 31, 2019 / 03:36 AM IST
సచివాలయ పరీక్షలకు ఏర్పాట్లు : బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో హెల్ప్ డెస్క్‌లు

సచివాలయ ఉద్యోగాల రాత పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల కోసం బస్, రైల్వే స్టేషన‌లలో హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు పరీక్షల నిర్వాహణ కన్వీనర్, పంచాయతీ రాజ్ శాఖ కమిషనర్ గిరిజా శంకర్ వెల్లడించారు. సచివాలయ ఉద్యోగాలకు సంబంధించి సెప్టెంబర్ 01 నుంచి సెప్టెంబర్ 08వ తేదీ వరకు ఎగ్జామ్స్ జరుగనున్న సంగతి తెలిసిందే. పరీక్ష కేంద్రం చిరునామా వంటి విషయాల్లో హెల్ప్ డెస్క్ సిబ్బంది సహాయకారిగా ఉంటారని తెలిపారు. రికార్డు స్థాయిలో లక్షా 26 వేల 728 ఉద్యోగాలకు దాదాపు 21.69 లక్షల మంది పోటీ పడుతున్నారని, దీంతో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు. 

తొలి రోజు ఉదయం 36 వేల 449 ఉద్యోగాలకు పరీక్ష నిర్వహిస్తామని..దీనికి 12 లక్షల 54 వేల 034మంది దరఖాస్తు చేసుకున్నారన్నారు. ఆ రోజు మధ్యాహ్నం తర్వాత 11 వేల 158 పోస్టులకు పరీక్ష నిర్వహిస్తామని..దీనికి 2 లక్షల 95 వేల 907 మంది హాజరు కావాల్సి ఉందన్నారు. ఇందు కోసం మండల కేంద్రాలు, పట్టణాల్లో 4 వేల 487 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు..నిబంధనలు సరి చూసుకుని పరీక్షా కేంద్రాలకు రావాలని అభ్యర్థులకు సూచించారాయన. హెల్ప్ డెస్క్‌లలో పెద్ద సంఖ్యలో వాలంటీర్లను లక్షా 22 వేల 554 మంది సిబ్బందిని వినియోగిస్తున్నట్లు తెలిపారు. 

ఇక ఎగ్జామ్స్ జరిగే రోజుల్లో 500 బస్సులను పరీక్షా కేంద్రాలకు నడిపేందుకు ఆర్టీసీ అధికారులు అంగీకరించారన్నారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని పట్టాణాల్లో ఆటో యూనియన్లకు ఆ పట్టణంలో జరిగే కేంద్రాల వివరాలు కూడా ముందుగానే తెలియచేసినట్లు చెప్పారు. అభ్యర్థులకు ట్రాఫిక్ ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు అన్ని పట్టణాల్లో ఆదివారం ఉదయం 7 నుంచి 10 గంటల వరకు ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టాలని రాష్ట్ర డీజీపీని కోరినట్లు వెల్లడించారు. పరీక్షా కేంద్రం చుట్టుపక్కల వంద మీటర్ల వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుందని తెలిపారు.