నాటు కోడి కి పెరుగుతున్న డిమాండ్

  • Published By: chvmurthy ,Published On : November 5, 2019 / 05:25 AM IST
నాటు కోడి కి పెరుగుతున్న డిమాండ్

ఉపవాసం ఉన్నప్పుడే ఉప్మా విలువ… కార్తీక మాసంలోనే కోడి రుచి తెలుస్తాయేనే మాట సరదాకి అన్నప్పటికీ .. మాంస ప్రియులు ఇప్పుడు నాటు కోడిమాంసంపై మొగ్గు చూపుతున్నారు. నాటు కోడి గుడ్డు….మాంసాన్ని బలవర్ధక ఆహారంగా అందరూ అంగీకరిస్తారు, కానీ  నాటు కోడిమాంసం  తినటానికి గట్టిగా ఉండటంతో జనం బ్రాయిలర్ కోడికి అలవాటు పడ్డారు.  బ్రాయిలర్  చికెన్ మెత్తగా తినడానికి వీలుగా ఉండటంతో బ్రాయిలర్ కోడి మాంసం గ్రామాల్లో సైతం అందరికీ అందుబాటులోకి వచ్చింది. 

ఇటీవలి కాలంలో మాంసం ప్రియుల ఆహర అలవాట్లలో మార్పులు వచ్చాయి.  వారు నాటు కోడి వైపు ఆసక్తి చూపిస్తున్నారు. వ్యాపారం వృధ్ది చేసుకునే క్రమంలో బరువు పెరగడానికి బ్రాయిలర్‌ కోళ్లకు ఇంజెక్షన్‌లు చేస్తున్నారనే వార్తలు తరచూ చూస్తున్నాం. హార్మోన్‌ ఇంజెక్షన్లతో నెల రోజుల కోడి పిల్లను రెండు, మూడు కేజీలకు పెంచుతున్న ఘటనలు చూసాము. మరోవైపు  మందులతో పెంచిన చికెన్ రుచి తగ్గిపోవడం వంటి కారణాలతో కూడా  బ్రాయిలర్‌ మాంసం వినియోగాన్ని క్రమంగా తగ్గించేస్తున్నారు.  వారాంతంలో నాటు కోడి మాంసం కొనుగోలుకే  వినియోగ దారులు మొగ్గు చూపుతున్నారు. ఇంటికొచ్చిన బంధువులకు, వివాహ విందులు, ఇతర కార్యక్రమాల్లో నాటు కోడి కూర వండి వడ్డించేస్తున్నారు.  

గతంలో రైతులు పెరట్లో నాటు కోళ్లు విరివిగా పెంచేవారు. కాలక్రమేణా వచ్చిన మార్పులతో..ఇటీవల గ్రామాల్లో నాటు కోళ్ల పెంపకం కూడా పెరిగింది. రైతులు మళ్లీ నాటుకోళ్లు పెంపకంపై ఆసక్తి చూపిస్తున్నారు. ప్రతి జిల్లాలో చిన్న చిన్న ఫామ్‌లు వెలుస్తున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం కూడా పెరటికోళ్ల పెంపకాన్ని ప్రోత్సహించేందుకు ప్రతి రైతుకూ సబ్సిడీపై 45 నాటుకోళ్ల పిల్లలను పంపిణీ చేస్తోంది. పెంపకం దార్లు నాటు కోడిని రూ.300 వరకు విక్రయిస్తుంటే.. మార్కెట్‌లో కిలో కోడిని రూ.400 నుంచి రూ.500కు పైగా అమ్ముతున్నారు.పల్లెటూళ్లలో పెంచుతున్న నాటుకోళ్లను పట్టణాలు, నగరాలకు తీసుకొచ్చి వారాంతంలో విక్రయిస్తున్నారు.నాటు కోడికి పెరుగుతున్న డిమాండ్‌ దృష్ట్యా ఇటీవల కాలంలో బ్రాయిలర్‌ కోళ్ల ఫారాలు మాదిరిగా నాటు కోళ్ల ఫారాలు కూడా కొత్తగా  పెరిగాయి. 

విజయవాడ,విశాఖ, గుంటూరు, తిరుపతి, నెల్లూరు, కర్నూలు, కాకినాడ, రాజమండ్రి తదితర నగరాల్లోని రెస్టారెంట్లు, స్టార్‌ హోటళ్లలో నాటు కోడి ఇగురు, పులుసును మెనూలో ప్రత్యేకంగా చూపుతున్నారు. చిన్న చిన్న  పట్టణాల్లో కూడా నాటు కొడి వంటకాలతో హోటల్ ముందు ప్రత్యేకంగా  బోర్డులు వెలుస్తున్నాయి.  రాయలసీమ జిల్లాల్లో అన్ని రెస్టారెంట్లు, దాబాలు.. నాటు కోడి పులుసు, రాగి సంగటితో   కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి.ఇక  హైవేలపై ఉన్న హోటల్స్, దాబాల్లో నాటు కోడికే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు.  నాటు కోళ్లలో తక్కువ ఖర్చుతో ఎక్కువ మాంసం కృతులు లభిస్తాయని వాటికి సీజనల్ వ్యాధులు రాకుండా కోళ్ళ పెంపకం దారులు  సరైన సమయంలో  వ్యాక్సిన్ లు వేయించుకోవాలని పశుసంవర్ధక శాఖ అధికారులు  తెలిపారు.