టూత్ పేస్ట్‌లో పాయిజన్ అంట.. జర జాగ్రత్త!

టూత్ పేస్ట్‌లో పాయిజన్ అంట.. జర జాగ్రత్త!

టూత్ పేస్ట్ వాడుతున్నారా? జర జాగ్రత్త.. టూత్ పేస్ట్ లో ఉపయోగించే ఒక రసాయనం పాయిజన్ లాంటిందని కొత్త పరిశోధనలో వెల్లడైంది. ఈ రసాయనం కారణంగా నాడీ వ్యవస్థపై తీవ్ర దుష్ప్రభావం పడుతుందని తేలింది. టూత్ పేస్టు, సబ్బులు, డియోడరెంట్లు ఎక్కువ కాలం నిల్వ ఉండేందుకు వీటిలో రసాయనాన్ని కలుపుతారు. అదే.. ట్రైక్లోసాన్ అనే కెమికల్.. అయితే పరిమితి కంటే ఎక్కువగా ఈ కెమికల్ కలిపితే అది పాయిజన్ గా మారుతుందని పరిశోధకులు చెబుతున్నారు.  అనుమతించిన పరిమితి కన్నా 500వ వంతు తక్కువగా ట్రైక్లోసాన్‌ను కలిపినా సరే నాడీ వ్యవస్థలోని కణాలను దెబ్బతీస్తుందని హైదరాబాద్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (IIT-H‌)కు చెందిన పరిశోధకులు గుర్తించారు.

పరిశోధనకు సంబంధించిన వివరాలు  ‘కీమోస్ఫియర్‌ ఆఫ్‌ ది యునైటెడ్‌ కింగ్‌డమ్‌’ అనే జనరల్‌లో ప్రచురించారు. సబ్బులు, టూత్‌పేస్ట్‌లే కాకుండా ఇంకా అనేక రకాల వస్తువుల్లో ట్రైక్లోసాన్‌ను కలుపుతున్నారంట.. ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన ఐఐటీ-హెచ్‌ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ అనామికా భార్గవ అన్నారు. వంటింట్లో ఉపయోగించే వస్తువులు, వస్ర్తాల్లో కూడా ట్రైక్లోసాన్‌ మిశ్రమాన్ని కలుపుతున్నట్టు గుర్తించామంటున్నారు.

వాస్తవానికి 1960లోనే ఔషధ ఉత్పత్తులకు మాత్రమే ట్రైక్లోసాన్‌ను పరిమితం చేశారు. ట్రైక్లోసాన్‌ను తక్కువ పరిమాణంలో వినియోగించినప్పుడు మానవ శరీరాలు కొంతవరకు తట్టుకుంటాయి. కానీ రోజువారీ వినియోగం వల్ల దీర్ఘకాలంలో అనారోగ్యం ముప్పు తప్పదని భార్గవ హెచ్చరిస్తున్నారు. ఇటీవల కేంద్ర ఆహార, ఔషధ పాలకసంస్థ (FDA) ట్రైక్లోసాన్‌పై తాత్కాలిక నిషేధం విధించింది.

కానీ దీనిపై పూర్తి నిషేధం విధించే చట్టాలేవీ లేకపోవడం గమనార్హం. ట్రైక్లోసాన్‌ను సూక్ష్మ మొత్తంలో వినియోగించినా.. అది నాడీ వ్యవస్థలోని జన్యువులను, ఎంజైమ్‌లను దెబ్బతీయడమే కాకుండా నాడీకణాలను కూడా ప్రభావితం చేస్తుందని ఐఐటీ-హెచ్‌ పరిశోధనలో వెల్లడైంది. కణజాలాలు, ద్రవాలలో ట్రైక్లోసాన్‌ కలవడంవల్ల మనుషుల నాడీ సంబంధిత పనితీరులో మార్పు వస్తుందని, ఆ తరువాత ఆ వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం పొంచి ఉంటుందని ఆ పరిశోధన తెలిపింది. అందువల్ల ట్రైక్లోసాన్‌ వినియోగంతో తయారైన వస్తువులపై భారత్‌లో తక్షణం నిషేధం విధించాలని ఆ అధ్యయనం సూచించింది.