సీఎంకు బర్త్ డే గిఫ్ట్: గంట వ్యవధిలో కోటి మొక్కలు నాటే అత్యద్భుతమైన కార్యక్రమం

సీఎంకు బర్త్ డే గిఫ్ట్: గంట వ్యవధిలో కోటి మొక్కలు నాటే అత్యద్భుతమైన కార్యక్రమం

CM KCR: ఫిబ్రవరి 17 తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావు పుట్టిన రోజు పురస్కరించుకుని పర్యావరణ హిత కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ మేరకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వినూత్న కార్యక్రమం మొదలుపెట్టనున్నారు.
హరిత హారం తర్వాత మరోసారి మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

సీఎం సంకల్పానికి మద్దతుగా ఒకే రోజు గంట సమయంలో కోటి మొక్కలను నాటే కోటి వృక్షార్చన కార్యక్రమాన్ని తీసుకున్నారు ఎం.పీ జోగినపల్లి సంతోష్ కుమార్. కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రులు మహమూద్ అలీ, తలసాని, చేతుల మీదుగా విడుదల చేశారు. మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవిత, ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణకు హరితహారం ద్వారా ఆకుపచ్చని రాష్ట్రాన్ని ఆకాంక్షిస్తున్న ముఖ్యమంత్రి ఆశయాలు ప్రతిబించించేలా ప్రతీ ఒక్కరూ ఫిబ్రవరి 17న మూడు మొక్కలు నాటాలను కోరారు. టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, ఎం.పీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు అందరూ మొక్కలు నాటి, వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవటమే కేసీఆర్‌కు మనమిచ్చే పుట్టిన రోజు కానుక అన్నారు. కోటి వృక్షార్చన కార్యక్రమం తీసుకున్న పార్టీ జనరల్ సెక్రటరీ, ఎం.పీ సంతోష్ కుమార్ ను కేటీయార్, మంత్రులు అభినందించారు.

సర్పంచ్ నేతృత్వంలో గ్రామ పరిధుల్లోని అన్ని చోట్లా ఖాళీ ప్రదేశాలను గుర్తించి మొక్కలు నాటాలని, పంచాయతీ రాజ్, అటవీశాఖలతో సమన్వయం ద్వారా కార్యక్రమాన్ని పూర్తి చేయాలని ఆకాంక్షించారు. ఆరేళ్ల హరితహారం ఫలితాలు కళ్ల ముందు కనిపిస్తున్నాయని, ఎంపీ సంతోష్ నేతృత్వంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కూడా పచ్చదనం పెంపులో అన్ని వర్గాలను జాగృతం చేస్తోందని మంత్రులు మహమూద్ అలీ, తలసాని అన్నారు.

సీఎం జన్మదినం సందర్భంగా కోటి వృక్షార్చనలో మొక్కలు నాటే వారందరికీ ప్రత్యేకంగా గుర్తించాలని, వనమాలి బిరుదును ఇవ్వాలని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ భావిస్తోంది. మొక్కలు నాటుతూ దిగిన ఫోటోలను ప్రత్యేక యాప్‌లో అప్ లోడ్ చేయాలి.

crore plantation poster

crore plantation poster

యాప్ కోసం వాట్సప్ నుంచి 9000365000 నెంబర్‌కు GIC అని మెసేజ్ చేయాలి. యాప్ లింక్‌తో కూడిన మెసేజ్ తిరిగి వస్తుంది. దానిలో మొక్కలు నాటుతూ సెల్ఫీ ఫోటోలను ఎవరికి వారు అప్‌లోడ్ చేయాలి. కోటి వృక్షార్చనలో పాల్గొన్నందుకు గుర్తింపుగా ముఖ్యమంత్రి సందేశంతో కూడిన వనమాలి బిరుదు ఈ మెయిల్ లేదా మొబైల్‌కు వారం రోజుల్లో ఎవరికివారికి చేరుతుందని గ్రీన్ ఇండియా ప్రతినిధులు తెలిపారు.