కంగ్రాట్స్ దత్తాత్రేయ : రాష్ట్రపతి, మోడీ ఫోన్

  • Edited By: madhu , September 1, 2019 / 08:37 AM IST
కంగ్రాట్స్ దత్తాత్రేయ : రాష్ట్రపతి, మోడీ ఫోన్

బీజేపీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన్ను హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా కేంద్రం నియమించిన సంగతి తెలిసిందే. దీంతో బీజేపీ శ్రేణులు, దత్తన్న అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇతర పార్టీలకు చెందిన నేతలు సోషల్ మీడియా వేదికగా కంగ్రాట్స్ చెబుతున్నారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ..దత్తన్నకు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. 

తెలంగాణ రాష్ట్ర నేతలు కూడా అభినందనలు తెలిపారు. దత్తాత్రేయకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ విషెష్ తెలియచేశారు. కష్టపడి పార్టీ కోసం పనిచేసే వారికి పదవులు లభిస్తాయనడానికి ఇదే ఒక సూచకమంటున్నారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు. కొత్త పాత్రలో గొప్పగా ఉండాలని కోరుకుంటున్నాను..సార్..అంటూ తెలిపారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు కూడా అభినందనలు తెలిపారు. దత్తాత్రేయ చాలా మందికి స్పూర్తి అని, సికింద్రాబాద్ నియోజకవర్గానికి, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి విశేషంగా కృషి చేశారని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ట్వీట్ చేశారు. 

బీజేపీలో కీలక నేతగా దత్తన్న ఉన్నారు. ఆయన RSSలో ప్రచారక్ గా పనిచేశారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌లో కూడా చేశారు. ఆయన పార్టీలో కీలక పదవులు చేపట్టారు. చట్టసభలో అడుగు పెట్టి కేంద్ర మంత్రిగా కూడా సేవలందించారు. 1991 నుంచి 2004 మధ్యకాలంలో సికింద్రాబాద్ లోక్ సభ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. వాజ్ పేయి హాయాంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు.

2014 సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి బీజేపీ తరపున దత్తాత్రేయ పోటీ చేసి గెలుపొందారు. మోడీ ప్రభుత్వం తొలి కేబినెట్‌లో కార్మిక శాఖ మంత్రిగా దత్తన్న బాధ్యతలు చేపట్టారు. తర్వాత కొన్ని కారణాల వల్ల పదవి నుంచి తప్పించారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో సికింద్రాబాద్ పార్లమెంట్ సీటు దత్తనకు ఇవ్వకుండా..కిషన్ రెడ్డికి ఇచ్చారు. ఇక దత్తాత్రేయ పార్టీ మారుతారని ప్రచారం జరిగింది. ఈ తరుణంలో ఆయనకు గవర్నర్ పదవి కట్టబెట్టింది బీజేపీ ప్రభుత్వం.