TRSలో కాంగ్రెస్ విలీనం ఖాయం – రేగా కాంతారావు

  • Published By: madhu ,Published On : April 21, 2019 / 01:54 PM IST
TRSలో కాంగ్రెస్ విలీనం ఖాయం – రేగా కాంతారావు

కాంగ్రెస్‌ శాసనసభాపక్షం త్వరలోనే TRSలో విలీనం అవుతుందని కాంగ్రెస్ నుండి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే రేగా కాంతారావు స్పష్టం చేశారు. ఈ విషయంలో న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నామని..విలీనం మాత్రం పక్కా అంటూ కుండబద్దలు కొట్టారు. ఏప్రిల్ 21వ తేదీ ఆదివారం పార్టీ ఫిరాయించిన చిరుమర్తి లింగయ్య, హరిప్రియ నాయక్, ఆత్రం సక్కులు TRS బీఫామ్‌లు తీసుకున్నారు. టీఆర్‌ఎస్ ఎల్పీలో పార్టీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ బీఫామ్‌లు తీసుకున్నామని రేగా కాంతారావు  తెలిపారు. విలీనం కావడానికి కొద్దిగా టైం పడుతుందన్నారు. కేసీఆర్ చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు తమను టీఆర్‌ఎస్‌ పార్టీలో ఆకర్షితులయ్యేలా చేసిందని హరిప్రియా నాయక్ చెప్పారు.

కాంగ్రెస్‌ పార్టీ శాసనసభ ఎన్నికల్లో 19 స్థానాలు గెలిచింది. ఇందులో 10 మంది…సబితారెడ్డి, జాజుల సురేందర్‌, రేగ కాంతారావు, కందాల ఉపేందర్‌రెడ్డి, హరిప్రియ, వనమా వెంకటేశ్వర్‌రావు, చిరుమర్తి లింగయ్య, దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, ఆత్రం సక్కు, బీరం హర్షవర్ధన్‌రెడ్డిలు టీఆర్ఎస్‌లో చేరతామని ప్రకటించారు. మరో ముగ్గురు చేరితే ఈ సంఖ్య కాంగ్రెస్‌ బలంలో మూడింట రెండొంతులవుతుంది. అప్పుడు వారు కాంగ్రెస్‌ శాసనసభాపక్షాన్ని టీఆర్ఎస్‌లో విలీనం చేయాలని శాసనసభాపతికి లేఖ రాస్తే ఆ ప్రక్రియ జరిగే వీలుంది.