దసరా సెలవులు : అప్పుడే బస్సులు కిటకిట

  • Published By: madhu ,Published On : September 29, 2019 / 02:06 AM IST
దసరా సెలవులు : అప్పుడే బస్సులు కిటకిట

దసరా సెలవులు వచ్చేశాయి. దీంతో ఊరెళ్లడానికి నగర ప్రజలు సిద్ధమవుతున్నారు. ప్రధానంగా విద్యార్థులు సొంతూరి బాట పట్టారు. సెప్టెంబర్ 28వ తేదీ శనివారం నుంచి అక్టోబర్ 13 దాక పాఠశాలలకు సెలవులు ప్రకటించిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 09వ తేదీ వరకు కళాశాలలకు హాలీడేస్ ఇచ్చారు. దీంతో ముందే సొంత ఊర్లకు వెళ్లేందుకు చాలా మంది బస్టాండ్లకు చేరుకున్నారు. దీంతో శనివారం ప్రధాన బస్టాండులు కిక్కిరిసిపోయాయి. జేబీఎస్, ఎంజీబీఎస్ బస్టాండులు..ప్రయాణీకులతో సందడిగా మారింది.

మహబూబ్ నగర్, సూర్యాపేట, ఖమ్మం వైపు వెళ్లే బస్సులకు రద్దీ అధికంగా ఉంది. రద్దీకి అనుగుణంగా ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు ఆర్టీసీ అధికారులు వెల్లడిస్తున్నారు. రోజు నడిచే 3 వేల 250 బస్సులతో పాటు నిర్ణీత తేదీల్లో ప్రత్యేకంగా 4 వేల 950 బస్సులను నడుపుతున్నట్లు తెలిపారు. ఉదయం వేళ రద్దీ తక్కువగానే ఉన్నా..మధ్యాహ్నం వరకు అమాంతం పెరిగిపోయింది. ప్రయాణీకుల సంఖ్య పెరగడంతో రాత్రి 7 గంటల వరకు అదనంగా బస్సులు నడిపినట్లు..ఆర్టీసీ అధికారి తెలిపారు. 

జేబీఎస్‌లో కూడా స్పెషల్ బస్సులు నడుపుతోంది ఆర్టీసీ. ప్రతి రోజు వివిధ జిల్లాలకు ఇక్కడ నుంచి 1500 బస్సులు వెళుతుంటాయి. కేపీహెచ్‌బీ, జగద్గిరిగుట్ట, లింగంపల్లి, పటన్ చెరూ, మియాపూర్ ప్రాంతాల నుంచి కూడా ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. 

వివిధ జిల్లాలకు వెళ్లేందుకు ప్రధాన ప్రాంతాలైన అమీర్ పేట, కూకట్ పల్లి, ఉప్పల్ తదితర ప్రాంతాల్లో ప్రయాణీకుల రద్దీ కనిపించింది. దీంతో ఆయా మార్గాల్లో ట్రాఫిక్ స్తంభిస్తోంది. సాయంత్రం వేళ రద్దీ అధికంగా ఉంటోంది. ప్రయాణీకుల సౌకర్యార్థం ఆర్టీసీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. బస్సులకు సంబంధించిన వివరాలను ఆర్టీసీ సిబ్బంది మైక్‌లలో వినిపిస్తున్నారు. ప్రైవేటు బస్సుల్లో ప్రయాణీకుల తాకిడి క్రమక్రమంగా పెరుగుతోంది. మొత్తానికి దసరా నవరాత్రుల నుంచే మొదలైన రద్దీ..చివరిలో అధికంగా ఉండే అవకాశం ఉంది. 
Read More :ఫస్ట్ వీళ్లకే : పోలీసులకు వీక్లీ ఆఫ్ ఇచ్చారు