కీలక దశకు దిశ నిందితుల ఎన్ కౌంటర్ కేసు

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ నిందితుల ఎన్ కౌంటర్ కేసు కీలక దశకు చేరుకుంది. ఇప్పటికే నిందితుల రీపోస్టుమార్టం రిపోర్టును ఢిల్లీ ఎయిమ్స్ ఫోరెన్సిక్ నిపుణులు సీల్డ్ కవర్ లో హైకోర్టుకు సమర్పించారు.

  • Published By: veegamteam ,Published On : January 9, 2020 / 01:24 AM IST
కీలక దశకు దిశ నిందితుల ఎన్ కౌంటర్ కేసు

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ నిందితుల ఎన్ కౌంటర్ కేసు కీలక దశకు చేరుకుంది. ఇప్పటికే నిందితుల రీపోస్టుమార్టం రిపోర్టును ఢిల్లీ ఎయిమ్స్ ఫోరెన్సిక్ నిపుణులు సీల్డ్ కవర్ లో హైకోర్టుకు సమర్పించారు.

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ నిందితుల ఎన్ కౌంటర్ కేసు కీలక దశకు చేరుకుంది. ఇప్పటికే నిందితుల రీపోస్టుమార్టం రిపోర్టును ఢిల్లీ ఎయిమ్స్ ఫోరెన్సిక్ నిపుణులు సీల్డ్ కవర్ లో హైకోర్టుకు సమర్పించారు. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం నియమించిన సిట్ కూడా పూర్తి వివరాలను సేకరించింది. ఇక నిందితుల ఎన్ కౌంటర్ జరిగి నెల రోజులు పూర్తికావడంతో సుప్రీంకోర్టు నియమించిన జ్యుడీషియల్ కమిషన్ దర్యాప్తు వేగవంతం చేయనుంది. 

దేశం మొత్తం చర్చనీయాంశంగా మారిన దిశ సంఘటన.. ఆ తర్వాత నిందితుల ఎన్ కౌంటర్ కు సంబంధించిన ఫైనల్ రిపోర్టును మహబుబ్ నగర్ కోర్టుకు సమర్పించేందుకు షాద్ నగర్ పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు చటాన్ పల్లి ఎన్ కౌంటర్ లో చనిపోయిన నలుగురు మృతదేహాలకు రీపోస్టుమార్టం చేసిన ఢిల్లీ ఎయిమ్స్ బృందం సీల్డ్ కవర్ లో రిపోర్టును హైకోర్టుకు సమర్పించారు. ఇక నిందితుల ఎన్ కౌంటర్ పై సుప్రీంకోర్టు నియమించిన జ్యుడీషియల్ కమిషన్ సభ్యులు మరో వారం రోజుల్లో హైదరాబాద్ రానున్నారు. ఇప్పటికే కేసుకు సంబంధించిన అంశాలపై కమిషన్ సభ్యులు సిర్పూర్ కర్ నివాసంలో సీబీఐ మాజీ డైరెక్టర్ కార్తికేయన్, బాంబే హైకోర్టు మాజీ న్యాయమూర్తి రేఖా ప్రకాష్ భేటీ అయ్యారు.

మరోవైపు దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై తెలంగాణ ప్రభుత్వం రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ తో వేసిన ప్రత్యేక దర్యాప్తు సంస్థ కూడా పూర్తి వివరాలను సేకరించింది. హైకోర్టు ఆదేశాల మేరకు ఎన్ కౌంటర్ లో పోలీసులు వాడిన వాహనాలు, ఆయుధాలు, బుల్లెట్స్ లను ఇప్పటికే సిట్ అధికారులు సీజ్ చేశారు. జ్యుడీషియల్ కమిషన్ హైదరాబాద్ కు వచ్చిన తర్వాత ఇప్పటి వరకు సేకరించిన రిపోర్టును సిట్ అందజేయనుంది. నిందితుల రీపోస్టుమార్టం రీపోర్టును కూడా కమిషన్ పరిశీలించనున్నట్లు తెలుస్తోంది. 

జ్యుడీషియల్ కమిషన్ హైదరాబాద్ కు రానున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. కమిషన్ సభ్యులు సిర్పూర్ కర్, కార్తికేయన్, రేఖా ప్రకాష్ ల కోసం దిల్ కుష గెస్ట్ హౌస్ లో వసతి కల్పించనున్నట్లు సమాచారం. ఇక కమిషన్ సభ్యులు హైకోర్టు వేదికగా దర్యాప్తు చేపట్టే అవకాశం ఉండడంతో.. సీఆర్ఫీఎఫ్ బలగాలతో పటిష్టమైన భద్రత కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. 

జ్యుడీషియల్ కమిషన్ సభ్యులు కేవలం ఎన్ కౌంటర్ విషయాన్నే కాకుండా దిశ అత్యాచారం, హత్యపైనా లోతుగా దర్యాప్తు చేసే అవకాశం ఉంది. మొత్తంగా దిశ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి ఆరు నెలల్లోపు సుప్రీంకోర్టుకు ఫైనల్ రిపోర్ట్ ఇవ్వనుంది.