ఎవరూ పస్తులుండొద్దు : అన్నపూర్ణ కేంటీన్ల ద్వారా ఉచిత భోజనం సరఫరా

  • Published By: chvmurthy ,Published On : March 27, 2020 / 02:50 AM IST
ఎవరూ పస్తులుండొద్దు : అన్నపూర్ణ కేంటీన్ల ద్వారా ఉచిత భోజనం సరఫరా

కరోనా వైరస్ వ్యాప్తి నిరోధంలో భాగంగా ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించటంతో నిరుపేదలు, కూలీలు, అనాధలు అన్నానికి దూరమై పస్తులుంటున్నారు.  వీరి సమస్యను తీర్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. హైదరాబాద్‌లో ఉచిత భోజన కేంద్రాలు అందుబాటులోకి తీసుకువచ్చింది. అన్నపూర్ణ కేంద్రాలను యథాతథంగా కొనసాగించాలని జీహెచ్‌ఎంసీ అధికారులను మంత్రి కేటీఆర్‌ ఆదేశించారు. 

మంత్రి ఆదేశాలతో రంగంలోకి దిగిన జీహెచ్‌ఎంసీ అధికారులు గురువారం నగరంలోని 80 కేంద్రాల్లో 11 వేల మందికిపైగా ఉచిత భోజనాలు పెట్టారు. శుకవారం మార్చి 27  నుంచి 150 కేంద్రాల ద్వారా భోజనాన్ని అందించనున్నట్టు అక్షయపాత్ర నిర్వాహకులు హరేకృష్ణ మూవ్‌మెంట్‌ ప్రతినిధులు చెప్పారు. 

శుక్రవారం నుంచి రాత్రి సమయాల్లోనూ భోజన కేంద్రాలు తెరిచే ఉంటాయని వారు వెల్లడించారు. లాక్‌డౌన్‌ వల్ల ఎవరూ ఆకలితో బాధపడవద్దన్న ఉద్దేశంతోనే మంత్రి కేటీఆర్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్టు జీహెచ్‌ఎంసీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌ తెలిపారు.

వెనక్కి తగ్గిన హాస్టల్‌ యజమానులు
ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించగానే హైదరాబాద్ లోని పలు  హాస్టల్స్ మూసి వేయటంతో ఉన్నఫలంగా హాస్టల్‌ విద్యార్థులు రోడ్లపైకి వచ్చిన అంశాన్ని ప్రభుత్వం సీరియస్‌ గా తీసుకుంది. గ్రేటర్‌ ప్రజాప్రతినిధులు బుధవారం అర్థరాత్రి నుంచే రంగంలోకి దిగి హాస్టళ్ల యాజమాన్యాలతో సంప్రదింపులు జరిపారు.

హాస్టళ్లలో ఆశ్రయం పొందుతున్న వారు తమ స్వస్థలాలకు వెళ్లే ఆలోచనను విరమించుకోవాలని నచ్చజెప్పారు. తమ వద్ద ఆశ్రయం పొందుతున్న వారిని సొంత బిడ్డల్లా చూసుకోవాలని హాస్టల్‌ నిర్వాహకులను కోరారు. ఈ మేరకు విద్యార్థులకు వసతి కొనసాగించేందుకు నిర్వాహకులు నిర్ణయించారు. 

Also Read | న్యూస్ పేపర్లు ముట్టుకుంటే..కరోనా వైరస్ రాదు!