బీ కేర్‌ఫుల్ : తీవ్ర వడగాలులు వీచే అవకాశం

  • Published By: veegamteam ,Published On : May 8, 2019 / 01:30 AM IST
బీ కేర్‌ఫుల్ : తీవ్ర వడగాలులు వీచే అవకాశం

ఎండలు మండిపోతున్నాయి. భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. తెలంగాణ రాష్ట్రం నిప్పుల కుంపటిలా మారింది. ఎండవేడికి, వడగాలులకు జనాలు విలవిలలాడుతున్నారు. ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతున్నాయి. ఉదయం 8 నుంచే సూర్యూడు చుక్కలు చూపిస్తున్నాడు. ఈ పరిస్థితి మరికొన్ని రోజులు కొనసాగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

రానున్న మూడు రోజులు తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ఉత్తర తెలంగాణ, తూర్పు తెలంగాణ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో వడగాలులు అధికంగా వీచే ఛాన్స్ ఉందని, ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. అత్యవసరమైన పనులు ఉంటే తప్ప ఎండలో తిరగొద్దని కోరారు. వడదెబ్బ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. తగినంత మంచి నీరు తాగాలన్నారు. మంగళవారం (మే 7,2019) రాష్ట్రంలో అత్యధికంగా నల్లగొండలో 44.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదిలాబాద్ లో 44.3 డిగ్రీలు, నిజామాబాద్ లో 44 డిగ్రీలు, హైదరాబాద్ లో 42.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డ్ అయ్యాయి.

వడగాలులు ప్రజల ప్రాణాలు తీస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో వడదెబ్బతో ఆదివారం (మే 5,2019) 23మంది చనిపోయారు. వరంగల్‌ రూరల్‌ జిల్లాలో 10 మంది, ఖమ్మం జిల్లాలో ముగ్గురు,  మహబూబాబాద్‌ జిల్లాలో ముగ్గురు.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇద్దరు, జయశంకర్‌ జిల్లాలో ఇద్దరు.. వనపర్తి, కామారెడ్డి, మెదక్‌ జిల్లాల్లో ఒకరి వంతున చనిపోయారు.

* ఆదిలాద్ 44.3 డిగ్రీలు
* భద్రాచలం 42.2 డిగ్రీలు
* హన్మకొండ 42.5 డిగ్రీలు
* హైదరాబాద్ 42.2 డిగ్రీలు
* ఖమ్మం 43.8 డిగ్రీలు
* మెదక్ 43 డిగ్రీలు
* నల్లగొండ 44.6 డిగ్రీలు
* నిజామాబాద్ 44 డిగ్రీలు
* రామగుండం 43.8 డిగ్రీలు