వెదర్ అప్ డేట్ : తెలంగాణలో వర్షాలు..దెబ్బతింటున్న పంటలు

  • Published By: madhu ,Published On : October 26, 2019 / 01:29 AM IST
వెదర్ అప్ డేట్ : తెలంగాణలో వర్షాలు..దెబ్బతింటున్న పంటలు

తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి. అరేబియా సముద్రంలో అల్పపీడనం కొనసాగుతోంది. రానున్న 12 గంటల్లో తీవ్ర తుఫాన్‌గా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. వచ్చే 24 గంటల్లో ఇది తీవ్ర తుఫాన్‌గా మారుతుందని, దీని ప్రభావంతో 2019, అక్టోబర్ 26వ తేదీ శనివారం గంటకు 85 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. తెలంగాణలో శనివారం ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో ఓ మోస్తరు వర్షాలు కురవచ్చని వెల్లడించారు. 

మరోవైపు ఎడతెరిపి లేకుండా కురస్తున్న వర్షాలతో చేతికొచ్చే పంటలు దెబ్బతింటున్నాయి. వరి పైరు నేల రాలుతోంది. పత్తి రంగు మారుతోంది. నివారణ చర్యలు చేపట్టాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. పొలాల్లో నీళ్లు నిలవడంతో పంటలు నాశనమౌతున్నాయి. వరి, పత్తి పంటలకు రకరకాల చీడపీడలు ఆశించి ఏకకాలంలో పీల్చి పిప్పి చేస్తున్నాయి. పత్తి పంటపై పచ్చదోమ, తెల్లదోమ, బ్యాక్టీరియా, ఆకుపచ్చ తెగులు, కాయకుళ్లు తెగులు, అల్టర్నేరియా కాండం మచ్చ తెగులు దాడి చేశాయి. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. 
Read More : చర్చలకు వేళాయే : ఏజెండాలో లేని ఆర్టీసీ విలీనం!