ప్రపంచంలోనే ఫస్ట్ : హైదరాబాద్‌లో అరుదైన సర్జరీ.. 4 నెలల శిశువు కిడ్నీలో రాళ్లు తొలగింపు 

  • Published By: sreehari ,Published On : October 3, 2019 / 02:39 PM IST
ప్రపంచంలోనే ఫస్ట్ : హైదరాబాద్‌లో అరుదైన సర్జరీ.. 4 నెలల శిశువు కిడ్నీలో రాళ్లు తొలగింపు 

కిడ్నీలో రాళ్లు రావడం కామన్. వయస్సుతో సంబంధం లేకుండా అన్ని వయస్సుల వారిలో కిడ్నీలో రాళ్లు వస్తుంటాయి. చాలామందిలో కిడ్నిలో రాళ్లతో బాధపడుతుంటారు. కొంతమందికి మందులతో కిడ్నీలు రాళ్లు కరిగిపోతాయి. మరి కొందరికి అవసరానికి బట్టి వైద్యులు.. సర్జరీ చేసి కిడ్నీలో రాళ్లను తొలగిస్తుంటారు.

హైదరాబాద్‌లోని ప్రీతి యూరాలజీ అండ్ కిడ్నీ హాస్పిటల్ వైద్యులు అరుదైన కిడ్నీ సర్జరీ చేశారు. 4 నెలల పసికందుకు కిడ్నీ ఆపరేషన్ చేశారు. శిశువు కిడ్నీలోని రాళ్లను విజయవంతంగా తొలగించారు. ఒక్కో కిడ్నీ నుంచి మొత్తం (8మిల్లీ మీటర్ల నుంచి 9 మిల్లీ మీటర్ల పరిమాణం) ఉన్న 3 రాళ్లు చొప్పున మొత్తం 6 రాళ్లను తొలగించారు. దీంతో ప్రపంచంలోనే అత్యంత పిన్న వయస్సులో కిడ్నీ ఆపరేషన్ చేయించుకున్న మగ శిశువుగా రికార్డు ఎక్కింది.

ఇండియాలో కిడ్నీలో రాళ్లు పెరగడం చాలా సాధారణమైన వ్యాధిగా చెప్పవచ్చు. డిహైడ్రేషన్, పోషకాహారలోపం, ఉప్పు ఎక్కువ మోతాదులో వాడటం, మాంసాహారం అధికంగా తీసుకోవడం కారణంగా కిడ్నీల్లో రాళ్లు ఏర్పడుతుంటాయి. కానీ, పిల్లల్లో కిడ్నీలో రాళ్లు ఏర్పడటం సాధారణ సమస్య కాదు. అందులోనూ అప్పుడే పుట్టిన శిశువుల్లో చాలా అరుదుగా కనిపిస్తుందని ఆస్పత్రి వైద్యులు తెలిపారు.

కొన్ని రోజులుగా ఒక మగ శిశువు యూరిన్ సరిగా నడవక పోవడంతో తల్లిదండ్రులు నిలోఫర్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు పరీక్షించగా.. బాబు కిడ్నీలో రాళ్లు  ఉన్నట్టు నిర్ధారించారు. వెంటనే ఈ కేసును ప్రీతి యూరాలజీ అండ్ కిడ్నీ ఆస్పత్రికి రిఫర్ చేశారు. పసివాడి కిడ్నీలో రాళ్లను తొలగించేందుకు వైద్య బృందం తీవ్రంగా శ్రమించింది. 

అనంతరం శిశువు కిడ్నీలోని రాళ్లును తొలగించినట్టు ఆస్పత్రి మేనేజింగ్ డైరెక్టర్ వి.చంద్ర మోహన్ వైద్యులు తెలిపారు. చైనా, యూఎస్ నుంచి కొన్ని సెంటర్లలో మాత్రమే ఇలాంటి అరుదైన సర్జరీ చేస్తుంటారని చెప్పారు. ప్రపంచంలోనే తొలిసారి RIRS సర్జరీ చేశామని, ఒకే సమయంలో 4 నెలల శిశువు రెండు కిడ్నీల్లోని రాళ్లను తొలగించామని ఆయన అన్నారు. RIRS అనగా.. ఎండోస్కోపిక్ సర్జరీ అంటారు.

ఈ రకమైన ప్రక్రియలో మూత్ర నాళం నుంచి కిడ్నీకి దగ్గరగా తీసుకెళ్లి రాళ్లను తొలగిస్తారు. ఈ డివైజ్ ద్వారా లేజర్ ఫైబర్ (హల్మియం లేజర్) ద్వారా రాళ్లను కరిగిస్తారు. ఈ ప్రక్రియ సమయంలో 4 నెలల శిశువకు శరీరాన్ని కత్తిరించలేదు. కుట్లు వేయలేదు. రక్తస్రావం కూడా జరుగలేదు. సర్జరీ పూర్తి అయిన కొన్ని రోజుల్లోనే శిశువును డిశ్చార్జి చేసినట్టు వైద్యులు వెల్లడించారు.