కరోనా వైరస్ ఆకారంలో కారు తయారుచేసిన హైదరాబాదీ.. ఒకే సీటుతో 40కిలోమీటర్లు వెళ్లొచ్చు

భారతదేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. కరోనా కేసుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. కరోనాను కట్టడి చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించాయి.

కరోనా వైరస్ ఆకారంలో కారు తయారుచేసిన హైదరాబాదీ.. ఒకే సీటుతో 40కిలోమీటర్లు వెళ్లొచ్చు

భారతదేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. కరోనా కేసుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. కరోనాను కట్టడి చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించాయి. మార్చి 24 నుంచి లాక్ డౌన్ కొనసాగుతోంది. అందరూ ఇంట్లోనే ఉండాలని ఎవరూ బయటకు రావొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. అయినప్పటికీ చాలామంది అవసరం లేకపోయినా రోడ్లపైకి వస్తున్నారు.

కరోనా వైరస్ వ్యాప్తిపై చాలామందికి అవగాహన ఉండటం లేదు. నిర్లక్ష్యంతో బయటకు వచ్చి వైరస్ బారిన పడుతున్నారు. ఇతరుల్లో వ్యాప్తికి కారణమవుతున్నారు. కరోనా వైరస్ వ్యాప్తిపై ప్రతిఒక్కరిలోనూ అవగాహన కల్పించేందుకు హైదరాబాద్ కు చెందిన ఓ స్థానిక కారు మ్యూజియం యజమాని వినూత్న రీతిలో ప్రయత్నించారు. కరోనా వైరస్ ఆకృతిలో కారును తయారు చేశారు.

అచ్చం కరోనా వైరస్ మాదిరిగానే కనిపించే ఈ కారులో ఒకరు కూర్చొనేందుకు వీలుగా ఒక సీటు మాత్రమే ఉంటుంది. 100cc ఇంజిన్ తో నడిచే కారు దాదాపు 40కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. సుధా కార్స్ మ్యూజియం యజమాని సుధాకర్ మాట్లాడుతూ.. ‘ఈ కారు 100cc ఇంజిన్ తో నడుస్తుంది. నాలుగు చక్రాలు.. సింగిల్ సీట్ ఉంటుంది. 40 కిలోమీటర్ల వరకు సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చు. ఈ మోడల్ కారు తయారుచేయడానికి మాకు 10 రోజుల సమయం పట్టింది. ఇది చూసైనా ప్రజలు బయటకు రాకుండా ఇంట్లోనే ఉంటారని ఆశిస్తున్నా’ అని అన్నారు. (కరోనా సోకి ప్రముఖ ఇండియన్-అమెరికన్ జర్నలిస్ట్ మృతి)

కరోనా వైరస్ ఆకృతిలో ఉన్న ఈ కారును గురువారం ఆవిష్కరించబోతున్నాం. మరుసటి రోజు నుంచి ఈ కారు హైదరాబాద్ రోడ్లపై చక్కర్లు కొట్టనుంది. వైరస్ వ్యాప్తిపై ఈ కారుతో ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రయత్నిస్తున్నాం. ప్రజలు అర్థం చేసుకుంటారని భావిస్తున్నాం’ అని సుధాకర్ చెప్పారు.

ఇదివరకే AIDS పై అవగాహన కల్పించేందుకు కండోమ్ ఆకృతిలో బైక్ రూపొందించామని తెలిపారు. అలాగే హెడ్ సేఫ్టీ కోసం హెల్మట్ ఆకృతిలో కారును కూడా తయారుచేశామన్నారు. స్మోకింగ్ అలవాటు ఉన్నవారిలో అవగాహన కల్పించేందుకు సిగరేట్ ఆకృతిలో బైక్ రూపొందించామని, ఇప్పుడు కరోనా వైరస్ ఆకృతిలో కారును తయారుచేసినట్టు సుధాకర్ చెప్పుకొచ్చారు.