ఆ రూ. 8కోట్లు మావే : పోలీసులు ఓవరాక్షన్ చేశారని బీజేపీ ఆగ్రహం

  • Published By: veegamteam ,Published On : April 9, 2019 / 03:19 AM IST
ఆ రూ. 8కోట్లు మావే : పోలీసులు ఓవరాక్షన్ చేశారని బీజేపీ ఆగ్రహం

హైదరాబాద్ నారాయణగూడలో పట్టుబడ్డ రూ.8కోట్ల నగదు తమదేనని బీజేపీ ప్రకటించింది. న్యాయబద్ధంగానే బ్యాంకు నుంచి డబ్బు తీసుకున్నామని, పోలీసులు ఓవర్ యాక్షన్ చేశారంటూ ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. రాజకీయ కుట్రలో భాగంగానే పోలీసులు తమను ఇబ్బంది పెడుతున్నారని అంటున్నారు.

లోక్‌సభ ఎన్నికల వేళ హైదరాబాద్‌లో భారీగా నగదు పట్టుబడింది. నారాయణగూడ ఫ్లై ఓవర్ దగ్గర టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు భారీగా మొత్తంలో డబ్బును స్వాధీనం చేసుకున్నారు. తమకు వచ్చిన సమాచారం మేరకు వాహన తనిఖీలు చేపట్టిన పోలీసులు వాహనంలోని రూ.8కోట్లు పట్టుకున్నారు. ఈ డబ్బంతా బీజేపీ ఫండ్‌గా పోలీసులు గుర్తించారు. హిమాయత్‌ నగర్‌ సర్కిల్‌ దగ్గర వాహనాలు తనిఖీ చేస్తుండగా తొలుత ఇద్దరిని అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ.2కోట్లు స్వాధీనం చేసుకున్నారు. వారిచ్చిన సమాచారం మేరకు నారాయణగూడలో ఓ బ్యాంకు దగ్గర మిగతా వారు ఉన్నట్టు తెలుసుకున్న పోలీసులు అక్కడికి వెళ్లి మరో రూ.6కోట్లు స్వాధీనం చేసుకున్నారు.

ఆ డబ్బు భారతీయ జనతాపార్టీదేనని ఆ పార్టీ అధికార ప్రతినిధి కృష్ణసాగర్‌రావు తెలిపారు. పోలీసులు ఓవరాక్షన్ చేశారని మండిపడ్డారు. తాము లీగల్‌గానే బ్యాంకు నుంచి డబ్బు డ్రా చేశామన్నారు. పోలీసులు కారు అద్దాలు పగులగొట్టి దొంగ డబ్బులా పట్టుకుపోయారని అన్నారు. ఎన్నికల ప్రచారానికి అయిన ఖర్చులు చెల్లించేందుకు డబ్బును బ్యాంకు నుంచి డ్రా చేసినట్లు కృష్ణసాగర్ చెప్పారు. ఇది ముమ్మాటికి రాజకీయ కుట్రేనని అన్నారు. ఎన్నికల వేళ పోలీసులు తనిఖీలు చేపట్టి నగదు పట్టుకుంటున్నప్పటికీ ఇటీవల కాలంలో ఇంత పెద్ద మొత్తంలో డబ్బు పట్టుబడటం ఇదే తొలిసారి.