నా బిడ్డను కాపాడండి…సుష్మాను కోరిన హైదరాబాద్ మహిళ

  • Published By: venkaiahnaidu ,Published On : March 29, 2019 / 10:05 AM IST
నా బిడ్డను కాపాడండి…సుష్మాను కోరిన హైదరాబాద్ మహిళ

బంగ్లాదేశ్ లో చిక్కుకుపోయిన తన కొడుకుని కాపాడాలని హైదరాబాద్ కు చెందిన జులేఖా బేగమ్ అనే మహిళ కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ కి విజ్ణప్తి చేసింది.బంగ్లాదేశ్ లో తన కొడుకు మొహ్మద్ ఇమ్రాన్ దగ్గర కొందరు గుర్తు తెలియని వ్యక్తులు బలవంతంగా పాస్ పోర్ట్,ఇతర వస్తువులను లాగేసుకున్నారని,వెంటనే తన కొడుకుని కాపాడి హైదరాబాద్ తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలని సుష్మాని ఆమె కోరింది.

హైదరాబాద్ కు చెందిన జులేఖా బేగమ్ కు మొహ్మద్ ఇమ్రాన్ అనే కొడుకు ఉన్నాడు.దాదాపు 15నెలల క్రితం పనికోసం ఇమ్రాన్ ఒమన్ దేశానికి వెళ్లాడు.ఒమన్ లో ఓ స్టోర్ లో పనిలో చేరాడు.అక్కడ ఇమ్రాన్ కి బంగ్లాదేశ్ కి చెందిన ఓ వ్యక్తి ఫ్రెండ్ అయ్యాడు.డిసెంబర్-16,2018న వెకేషన్ పై ఇమ్రాన్ హైదరాబాద్ వచ్చాడు.రెండు నెలలు కుటుంబంతో గడిపాడు.ఆ తర్వాత కలకత్తాలో పని ఉందని చెప్పి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. కొన్ని రోజుల తర్వాత ఇంటికి ఫోన్ చేసి తాను ఫ్రెండ్ పెళ్లికి హాజరయ్యేందుకు ఒంగ్లాదేశ్ వెళ్లానని తెలిపాడు.రెండు మూడురోజుల్లో హైదరాబాద్ వస్తానని కుటుంబసభ్యులకు తెలిపాడు.

అయితే ఇమ్రాన్ చెప్పినట్లుగా ఇంటికి రాలేదు.15 రోజుల తర్వాత మరోసారి ఇంటికి ఫోన్ చేసిన ఇమ్రాన్ తన పాస్ పోర్ట్ ను కొంతమంది బలవంతంగా లాగేసుకున్నారని,తనను భారత్ రానివ్వకుండా చేస్తున్నారని చెప్పాడు. దీంతో ఏం జరిగిందో తెలియక తల్లడిల్లిపోయిన ఇమ్రాన్ తల్లిదండ్రులు విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్ సాయం కోరారు.వెంటనే ఈ విషయంలో జోక్యం చేసుకుని తమ బిడ్డను తన దగ్గరకు చేరాలా చర్యలు తీసుకోవాలని కన్నీళ్లు పెట్టుకున్నారు.