కృష్ణా జలాలు : ఏపీకి 152, తెలంగాణకు 59 టీఎంసీలు

  • Published By: veegamteam ,Published On : August 30, 2019 / 02:46 PM IST
కృష్ణా జలాలు : ఏపీకి 152, తెలంగాణకు 59 టీఎంసీలు

ఏపీ, తెలంగాణకు నీటి విడుదలకు సంబంధించి కృష్ణా నది యాజమాన్య బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. 2019, సెప్టెంబర్ నెల వరకు ఏపీకి 152 టీఎంసీలు, తెలంగాణకు 59 టీఎంసీలు కేటాయించింది. కనీస నీటి వినియోగ మట్టానికి పైనున్న 257.54 టీఎంసీలు ఇరు రాష్ట్రాలకు కేటాయిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. 

ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు కృష్ణా నది జలాల పంపిణీ అంశాల్ని చర్చించేందుకు శుక్రవారం (ఆగస్టు 30, 2019) కృష్ణాబోర్డు సమావేశమైంది. రెండు రాష్ట్రాల మధ్య జలాల పంపిణీపై నిర్ణయాలు తీసుకోవడంతోపాటు ఇన్‌ఫ్లోలపై చర్చించారు. నీటి విడుదలకు కృష్ణానది యాజమాన్య బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ, తెలంగాణ,రాష్ట్రాలకు నీటి విడుదల ఆదేశాలు ఇచ్చింది.

ఏపీకి శ్రీశైలం నుంచి 100 టీఎంసీలు, నాగార్జున సాగన్ నుంచి 52 టీఎంసీలు, చెన్నైకి తాగునీరు సహా పోతిరెడ్డిపాడు నుంచి 88 టీఎంసీలు, హంద్రీనీవా, ముచ్చమర్రి ఎత్తిపోతల పథకాల నుంచి 12 టీఎంసీలు, నాగార్జునసాగర్ కుడికాలువ ద్వారా 32 టీఎంసీలు, ఎడమ కాలువ ద్వారా 2 టీఎంసీలు, కృష్ణా డెల్టాకు 15 టీఎంసీల విడుదలకు బోర్డు ఆదేశాలు ఇచ్చింది.  

తెలంగాణకు శ్రీశైలం నుంచి 14.5 టీఎంసీలు, నాగార్జున సాగర్ నుంచి 44.51 టీఎంసీలు, కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా తాగు, సాగునీటి అవసరాలకు 14.5 టీఎంసీలు, నాగార్జున ఎడమ కాలువ నుంచి 26.06 టీఎంసీలు, ఏఎమ్మార్పీ నుంచి 10.47 టీఎంసీలు, హైదరాబాద్ తాగునీటికి 5.9 టీఎంసీలు, మిషన్ భగీరథకు 2.08టీఎంసీల చొప్పున కష్ణానది యాజమాన్య బోర్డు కేటాయించింది.