విష జ్వరాలు, డెంగీ నివారణకు చర్యలు తీసుకుంటున్నాం : భయపడొద్దని మంత్రి కేటీఆర్ భరోసా

  • Published By: veegamteam ,Published On : September 9, 2019 / 01:17 PM IST
విష జ్వరాలు, డెంగీ నివారణకు చర్యలు తీసుకుంటున్నాం : భయపడొద్దని మంత్రి కేటీఆర్ భరోసా

కేటీఆర్ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే పని మొదలు పెట్టారు. పట్టణాల్లో పారిశుద్ధ్యం, జ్వరాల నియంత్రణపై ఫోకస్ పెట్టారు. డెంగీ నివారణకు పూర్తి చర్యలు చేపడతామని అన్నారు. ఈమేరకు సోమవారం హైదరాబాద్ లో జీహెచ్ ఎంసీ, మున్సిపల్ అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. పారిశుద్ధ్యంతో పాటు రోడ్ల అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నగరవాసులు డెంగీ వ్యాధితో ఇబ్బందులు పడుతున్నారు. వైరల్ వ్యాధులతో ప్రజలు బాధపడుతున్నారని చెప్పారు. సీజనల్ గా వచ్చే వ్యాధులను నిరోధించేందుకు ప్రత్యేక క్యాలెండర్ తీసుకొచ్చామని చెప్పారు. 

వ్యాధులపై ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వ్యాధులపై అవగాహనా కార్యక్రమాలు నిర్వహించారు. జ్వరాలపై కాలేజీలు, స్కూళ్లలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. రేపటి నుంచి హైదరాబాద్ లో మూడు అవగాహన సదస్సులు నిర్వహిస్తామని చెప్పారు. ఆస్పత్రుల్లో పరిస్థితిని మంత్రి ఈటల రాజేందర్ సమీక్షిస్తున్నారని తెలిపారు. 

రోడ్లపై నీరు ఎక్కడా నిల్వ ఉండకుండా చూసుకోవాలన్నారు. త్వరలో బస్తీల్లో మెడికల్ క్యాంపులు నిర్వహిస్తామని చెప్పారు. అంటు వ్యాధులపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు విస్తృత ప్రచారం చేపడతామని తెలిపారు. బస్తీ దావాఖానాల్లో సాయంత్రం ఓపీ సేవలు ప్రారంభిస్తామని చెప్పారు. 15 రోజుల్లో డెంగీ నివారణకు పూర్తి చర్యలు చేపడతామని వెల్లడించారు. 

కేబినెట్ అనుమతితో దవాఖానాలను పెంచుతామని చెప్పారు. ప్రైవేట్ ఆస్పత్రులు ప్రతీదాన్ని డెంగీ అని చెప్పడం కరెక్టు కాదన్నారు. 1500 మంది ఎంటమాలజిస్టు ఖాళీలను భర్తీ చేయాలని ఆదేశించామని చెప్పారు. ఉదయం 6 గంటలకే అధికారులు అందుబాటులో ఉండాలన్నారు. డెంగీని 15 రోజుల్లో అదుపులోకి తీసుకొస్తామని చెప్పారు. అన్నీ వైరల్ ఫీవర్స్ డెంగీ కాదన్నారు. 

శానిటేషన్ పై కూడా విస్తృతంగా చర్చించామని తెలిపారు. సెప్టెంబర్ 15, 16 వరకు నగరంలో చెత్తను పూర్తిగా తొలగించాలని ఆదేశించారు. రోడ్ల నిర్మాణంలోనూ గుణాత్మకమైన మార్పు తీసుకొస్తామని చెప్పారు. ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమిస్తే జరిమానాలు వేయాల్సిందేనని స్పష్టం చేశారు. నిబంధనలు అతిక్రమించిన వాహనదారులపై జరిమానాలు విధించడాన్ని వ్యతిరేకించిన వారిది కూడా తప్పవుతుందన్నారు. దేశం బాగుపడాలంటే పౌరుల్లో మార్పు రావాలన్నారు.