సమ్మర్ హాలిడేస్ : రైళ్లో కేటుగాళ్లు..జాగ్రత్త

  • Published By: madhu ,Published On : April 18, 2019 / 10:35 AM IST
సమ్మర్ హాలిడేస్ : రైళ్లో కేటుగాళ్లు..జాగ్రత్త

రైలు ఎక్కేందుకు వచ్చినట్లుగా హడావుడి చేస్తారు. ప్రయాణికుల దృష్టి మరల్చి చోరీలకు పాల్పడుతారు. నిర్లక్ష్యంగా ఉన్న వారి బ్యాగులను దోచేస్తారు. ఇలా అయా రైల్వేస్టేషన్లను అడ్డాగా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్న కేటుగాళ్లపై రైల్వే పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. ముఖ్యంగా వేసవికాలం బందోబస్తును పటిష్టవంతం చేశారు. వేసవి సెలవులకు కటుంబసమేతంగా వెళ్లే ప్రయాణికుల రక్షణకు పలు చర్యలు చేపట్టారు రైల్వే పోలీసులు.   

ప్రధాన రైల్వేస్టేషన్లలో రైల్వే పోలీసులు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. రైళ్లు, ఫ్లాట్‌ఫామ్స్‌, లగేజ్ కౌంటర్ల దగ్గర రైల్వే పోలీసులు నిఘా పెంచారు. ముఖ్యంగా వేసవి సెలవులు రావడంతో ప్రయాణికుల రద్దీ పెరిగే అవకాశం ఉంది. దీంతో సమ్మర్ బందోబస్తును పటిష్టం చేశారు రైల్వే పోలీసులు. ప్రధానంగా ఉత్తరప్రదేశ్‌, ముంబై, హర్యానా, రాజస్థాన్, బీహార్ రాష్ట్రాలకు చెందిన అనేక గ్యాంగులు రాష్ట్రంలోకి ప్రవేశించే ప్రమాదం ఉంది. సయ్యద్‌ షెజాద్‌ అలియాస్‌ రాజు గ్యాంగ్‌, లగేజ్ జిప్ గ్యాంగ్, ప్లాట్ ఫాం దొంగలు, దృష్టి మరల్చి చోరీలకు పాల్పడే ముఠాలపై నజర్ పెట్టారు. సికింద్రాబాద్‌, కాజీపేట్, నాంపల్లి, కాచిగూడ, ఫలక్‌నుమా తదితర ప్రధాన రైల్వేస్టేషన్‌లో అనుమానాస్పదంగా తిరుగుతున్న వారిపై రైల్వే దృష్టి కేంద్రీకరించారు. 

వేసవి సెలవులు కావడంతో చోరీ ముఠాలు ప్రధాన రైల్వేస్టేషన్లపై దృష్టిసారించినట్లు ఇంటెలిజెన్స్ సమచారం మేరకు రైల్వే పోలీసులు అప్రమత్తమయ్యారు. ప్లాట్ ఫాం బందోబస్తు, మఫ్టీ పార్టీ, రైల్వే షాడో టీమ్స్, క్విక్ రియాక్షన్ టీమ్స్‌ను రంగంలోకి దింపారు. టికెట్‌ కౌంటర్‌ దగ్గర, ఎస్కలేటర్‌ ఎక్కే సమయంలో ప్రయాణికుల కదలికలను గమనించేందుకు నిఘా ఏర్పాటు చేశారు. ప్రయాణీకులు బ్యాగుల్లోని విలువైన నగలను, వస్తువులను జాగ్రత్తగా ఉంచుకోవాలని సూచిస్తున్నారు.

ఎలాంటి అనుమానం వచ్చినా.. వెంటనే రైల్వే పోలీసులను సంప్రదించాలని చెబుతున్నారు. అలాగే  రైళ్లలో అపరిచితుల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు.  ఇటీవలే రాజ్‌కోట్ ఎక్స్‌ప్రెస్‌లో భారీ చోరీకి ప్లాన్ చేసిన ముఠాలపై రైల్వే పోలీసులు 5 బృందాలతో గాలిస్తున్నారు. ఈ కేసులో పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్, ఏఅర్, రైల్వే పోలీసులు నిత్యం పహారా కాస్తున్నారు. మరోవైపు సీసీ కెమెరాలతో నిఘాను పెంచారు.